Lockdown భయం.. ఖాళీ అవుతున్న నగరాలు
close

తాజా వార్తలు

Updated : 21/04/2021 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown భయం.. ఖాళీ అవుతున్న నగరాలు

దిల్లీ: గత అనుభవాలను ఎవరూ మర్చిపోలేదు. చంటి పిల్లలను చంకనేసుకొని వందల కిలోమీటర్లు నడిచిన ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. మరోసారి అదే తరహా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం రాత్రి కర్ఫ్యూలు, లాక్‌డౌన్లు అంటూ ఆంక్షలు విధించడం మొదలెడుతోంది. దీంతో మరోసారి వలసకార్మికుల నెత్తిన పిడుగుపడినట్లయింది. గతంలో పడిన కష్టాలు మళ్లీ ఎదురవ్వకూడదనే ఉద్దేశంతో పొట్టకూటి కోసం పల్లెటూరిని విడిచి వచ్చిన వలసకార్మికులు మూటాముళ్లూ సర్దుకొని సొంత ఊళ్లకు బయలు దేరుతున్నారు.

వెలవెలబోతున్న దిల్లీ, ముంబయి

సరిగ్గా ఏడాది కిత్రం ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకోకముందే.. కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ రాజధాని దిల్లీతోపాటు, వాణిజ్య రాజధాని కొలువైన మహారాష్ట్ర గజగజ వణికిపోతోంది. మరోవైపు దిల్లీ సర్కారు 6  రోజుల లాక్‌డౌన్‌ విధించింది. ఆ వార్త వినగానే బస్‌ టెర్మినల్స్‌, రైల్వేస్టేషన్లు వలసకార్మికులతో కిటకిటలాడిపోయాయి. ఇది స్వల్ప లాక్‌డౌన్‌ మాత్రమేనని కార్మికులు దిల్లీని వదలి వెళ్లొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పినా.. కార్మికులు వినిపించుకునే పరిస్థితిలో లేరు. మరోవైపు మహారాష్ట్ర కూడా లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని చెప్పినప్పటికీ  రాష్ట్రాలు తమ జాగ్రత్తల్లో తాము ఉంటున్నాయి.  దీంతో వలసకార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. దీంతో బతికుంటే బలుసాకు తిని బతకొచ్చనే ఉద్దేశంతో స్వస్థలాలకు పయనమవుతున్నారు.

గుజరాత్‌లోనూ...

ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. దీంతో బతుకు తెరువుకోసం అహ్మదాబాద్‌, గాంధీనగర్‌ వంటి నగరాలకు వచ్చిన వలసకూలీలు ఊళ్లకు పయనమవుతున్నారు. వలసకార్మికుల కుటుంబాలతో వాపి రైల్వేస్టేషన్‌ జనసంద్రంగా మారింది. మరోవైపు వలసకార్మికుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో..
ఉత్తర్‌ ప్రదేశ్‌లో 2000 యాక్టివ్‌ కేసులు ఉన్న ప్రతి జిల్లాలోనూ వారాంతపు కర్ఫ్యూ విధించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయించారు. దీనివల్ల వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసేది లేక.. కుటుంబ పోషణ కష్టమై చాలా కుటుంబాలు స్వస్థలాల బాట పడుతున్నాయి. అంతేకాకుండా దిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ వచ్చే వలస కార్మికుల కోసం రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం
లాక్‌డౌన్‌ భయం తెలుగు రాష్ట్రాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల  నుంచి చాలా మంది ప్రజలు హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తుంటారు. దిల్లీతోపాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలోనూ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తలు పుట్టుకొస్తుడంతో.. తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ తప్పదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే రవాణా కష్టమవుతుందని, ముందుజాగ్రత్తగా పలువురు వలసకూలీలు సొంతూళ్లకు పయనమవుతున్నారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని