
తాజా వార్తలు
భారత్ నుంచి భూటాన్‌కు కొవిడ్ టీకాలు
ముంబయి: పొరుగు, కీలక భాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా ఆరు దేశాలకు భారత్ బుధవారం నుంచి టీకాల సరఫరా ప్రారంభించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఈ ఉదయం భూటాన్‌కు ఎగుమతి చేసింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.5లక్షల డోసులను థింపు నగరానికి పంపించింది. మరికొద్దిసేపట్లో మాల్దీవులకు కూడా టీకా డోసుల విమానం బయల్దేరనుంది. ఈ రెండు దేశాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది.
కరోనా ప్రభావం నేపథ్యంలో గ్రాంట్ సహకారం కింద భారత సంస్థలు అభివృద్ధి పరిచిన టీకాలను పొరుగు దేశాలకు ఇవ్వనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారాలు, నెలల తరబడి దశలవారీగా భాగస్వామ్య దేశాలకు టీకాలు పంపించనున్నట్లు వెల్లడించింది. శ్రీలంక, అఫ్గానిస్తాన్, మారిషస్ దేశాల నుంచి ఎంత అవసరమో ధ్రువీకరణ ఇంకా రాలేదన్న విదేశాంగ శాఖ.. వచ్చిన వెంటనే ఈ దేశాలకు కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి..
అలర్జీ ముప్పుంటే కొవిషీల్డ్ టీకా వద్దు