
తాజా వార్తలు
దీదీకి మరో నలుగురు ఎమ్మెల్యేలు షాక్
టిక్కెట్ నిరాకరించడంతో భాజపాలోకి
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. మరో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆ నలుగురూ భాజపాలో చేరిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ వీరికి సీటు నిరాకరించడంతో భాజపాలో చేరారు. ఇటీవల 291మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమతా బెనర్జీ 23మంది సిట్టింగ్లకు టిక్కెట్లు నిరాకరించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే భాజపాలోకి పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే. అయితే, మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ప్రారంభం కానున్న తరుణంలోనూ భాజపాలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొనాలీ గుహా, దీపేందు బిశ్వాస్, రవీంద్రనాథ్ భట్టాచార్య, జాటు లాహిరితో పాటు హబీబ్పూర్ తృణమూల్ అభ్యర్థి సరళ ముర్ము కూడా భాజపాలో చేరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఆ పార్టీ నేతలు సువేందు అధికారి, ముకుల్ రాయ్ సమక్షంలో వీరంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.