
తాజా వార్తలు
మహాశివరాత్రి సందడి మామూలుగా ఉండదు
ఒకేరోజు విడుదల కానున్న నాలుగు సినిమాలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రతీ ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమాలు పోటీకి దిగి ప్రేక్షకులను అలరించేవి. ఈసారి కూడా నాలుగైదు సినిమాలు సందడి చేశాయి. సంక్రాంతి తర్వాత కూడా వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘కొన్నిసార్లు రావడం ఆలస్యం కావచ్చు. కానీ.. రావడం మాత్రం పక్కా’ అంటూ.. సంక్రాంతికి రాలేకపోయిన ఆ సినిమాలు శివరాత్రికి సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇన్నాళ్లు సినిమాల్లేక వినోదం కోసం ఎదురుచూసిన సినీ ప్రియులకు ఈ శివరాత్రితో ఆ కష్టాలు తీరనున్నాయి. రానున్న మహాశివరాత్రి కానుకగా ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో ఈసారి జాగారం హంగామాతో నిండిపోనుంది. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసా..?
సందడికి శర్వానంద్ ‘శ్రీకారం’..
పండగపూట మంచి వినోదం పంచే కుటుంబ కథా చిత్రం వస్తే సినీప్రేమికులకు అంతకంటే ఆనందం ఏముంటుంది. అదీ శర్వానంద్‌లాంటి ఫ్యామిలీ హీరో సినిమా అయితే ఇక చెప్పనక్కర్లేదు కదా.!. అందుకే శర్వానంద్ ఈ సారి శివరాత్రికి అలరించేందుకు ‘శ్రీకారం’ చుట్టారు. బి.కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఆమని, రావురమేశ్, సాయికుమార్, మురళీశర్మ, నరేశ్, సప్తగిరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జే.మేయర్ సంగీతం అందించారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘జాతి రత్నాలు’తో జాగారం
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌రామకృష్ణ.. ఈ ముగ్గరూ ఇటీవల కాలంలో కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారి యువతకు బాగా దగ్గరైన నటులు. ఒంటరిగానే కావాల్సినంత వినోదం పంచే వీళ్లు ఈసారి కలిసి ‘జాతి రత్నాలు’తో కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యారు. అనుదీప్ దర్శకత్వంలో పొలిటికల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. మార్చి 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలోని పాట ‘చిట్టి నా బుల్బుల్ చిట్టి’ సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వినోదంపై మినిమం గ్యారంటీ ఇస్తారన్న ముద్రవేసుకున్న ఈ ముగ్గురూ కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
‘గాలి సంపత్’తో రంగంలోకి అనిల్ రావిపూడి
ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గని డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన ఓవైపు ‘ఎఫ్3’ని పట్టాలపై పరిగెత్తిస్తూనే మరోవైపు ‘గాలి సంపత్’తో అలరించేందుకు వస్తున్నారు. అనిశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. నవ్వించడంలో స్పెషలిస్టుగా మారిన అనిల్ రావిపూడి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. లవ్లీ సింగ్ హీరోయిన్గా సందడి చేయనుంది. రాజేంద్రప్రసాద్, తణికెళ్ల భరణి కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 11న థియేటర్లో ప్రేక్షకులకు అలరించేందకు సిద్ధమైంది.
క్రైమ్ థ్రిల్లర్‌గా ఆసక్తిరేపుతున్న మోసగాళ్లు..
మంచు విష్ణు, కాజల్, సునీల్‌శెట్టి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. పాన్ ఇండియా మూవీగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. అర్జున్ అనే యువకుడిగా విష్ణు, అతని సోదరిగా అను అనే పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సునీల్‌శెట్టి, రుహీసింగ్, నవదీప్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 11న సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఇదీ చదవండి..
నడికుడి రైలంటి.. అదిరింది ‘బొమ్మ’సాంగూ!