గంటా వైకాపాలో చేరే అవకాశం: విజయసాయి

తాజా వార్తలు

Updated : 03/03/2021 13:56 IST

గంటా వైకాపాలో చేరే అవకాశం: విజయసాయి

విశాఖపట్నం: మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైకాపాలో చేరే అవకాశముందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ బుధవారం వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ పాలన చూసి చాలా మంది వైకాపాలో చేరుతున్నారన్నారు. ‘గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారు. జగన్‌ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశముంది’’ అని తెలిపారు. మరో వైపు.. వైకాపాలో గంటా చేరిక ప్రతిపాదనను మొదటి నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యతిరేకిస్తున్నారు. బుధవారం విశాఖలో జరిగిన కాశీవిశ్వనాథ్‌ వైకాపాలో చేరిక కార్యక్రమానికి అవంతి శ్రీనివాస్‌ దూరంగా ఉన్నారు. దీంతో విశాఖ వైకాపాలో వర్గపోరు మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసుపల్లి గణేష్‌కుమార్‌ ..ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో వైకాపాకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు కూడా వైకాపాలో చేరతారనే ప్రచారం జరిగింది. గంటా వైకాపాలో చేరికను వ్యతిరేకిస్తూ మంత్రి అవంతి శ్రీనివాసరావు బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. ఆయన వర్గం ధర్నాలు కూడా నిర్వహించింది. ఆ తర్వాత కొంతకాలం ఈవిషయంపై చర్చ జరగలేదు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో గంటా వైకాపాలో చేరే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు పంపారు. ప్రస్తుతం రాజీనామా లేఖ స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్న గంటా.. ఇటీవల చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నారు. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్షకు కూర్చున్నప్పుడు శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. పోలీసులు దీక్ష భగ్నం చేయడంతో... చంద్రబాబుతో పాటు ఆసుపత్రికి వెళ్లి పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. గంటా శ్రీనివాసరావు తాను పార్టీ మారుతున్నట్టు  ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని