close

తాజా వార్తలు

Updated : 19/01/2020 03:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ పెట్టుబడులనూ చూడండి..

భవిష్యత్తులో ఆర్థిక భరోసా ఉండాలంటే.. సంపాదించిన మొత్తంలో కొంత మదుపు చేయాల్సిందే. అవసరం, ఉన్న వ్యవధి, ఆశించే రాబడి ఆధారంగా పథకాలను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా చాలామంది మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకే ప్రాధాన్యం ఇస్తుంటారు. దీర్ఘకాలంలో మంచి లాభాలు రావాలంటే.. పెట్టుబడుల జాబితాల్లో ఇవి తప్పనిసరి. వీటితోపాటు పరిశీలించాల్సిన ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలూ కొన్ని ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం..

స్థిరంగా..  బాండ్‌ ఫండ్లు..
పెట్టుబడి కాస్త సురక్షితంగా ఉండటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకునే వీలు, పన్ను పరంగానూ ప్రయోజనాలు కల్పించేవి డెట్‌ ఫండ్లు. వీటిలో ఏది ఎంపిక చేసుకోవాలన్నదే చాలామందికి ఉండే సందేహం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోల్చినప్పుడు డెట్‌ ఫండ్లు కాస్త మెరుగైన రాబడిని అందిస్తాయి. పైగా అనుకూలంగానూ ఉంటాయి. ఇక్కడ ఉండే పెద్ద సవాలేమిటంటే.. వడ్డీ రేట్లు కొన్నిసార్లు ప్రతిసారీ స్థిరంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్లలోకి మారేందుకు మంచి తరుణమిదని చెప్పొచ్చు. వీటిలో ఇప్పటి వరకూ ఉన్న కొన్ని ఇబ్బందులు ఇప్పుడు కనిపించడం లేదు. కాబట్టి, ఇక నుంచి ఇవి మంచి రాబడి అందించేందుకు వీలుంది. ఈ ఏడాదిలో పరిశీలించాల్సిన ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల్లో వీటిపై దృష్టి పెట్టొచ్చు.
సరికొత్తగా  బాండ్‌ ఈటీఎఫ్‌లు..
ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌) పలు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ సూచీలు, బాండ్‌ సూచీలు, కమోడిటీలు తదితర విభాగాల్లో వీటిని ఎంచుకోవచ్చు. గత ఏడాది కాలాన్ని పరిశీలిస్తే.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లకు ఎంతో ఆదరణ పెరిగింది. ఇక కొత్తగా వచ్చిన బాండ్‌ ఈటీఎఫ్‌.. భారత్‌ 22. వీటిలో మదుపు చేసేందుకూ పరిశీలించవచ్చు. 2020 ఏడాదిలో ఈటీఎఫ్‌లు అనేక మందిని ఆకర్షించే అవకాశం ఉందని అంచనా.
ఫండ్ల బాటలో..  వైవిధ్యంగా..
దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి రావాలంటే.. ఈక్విటీలకు మించిన మార్గం లేదు. ఏ ఇతర పెట్టుబడి పథకంతో పోల్చి చూసినా ఇవి మెరుగైన రాబడినే ఇస్తాయని చరిత్రను గమనిస్తే తెలుస్తుంది. మీరు మొదటిసారి ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తే.. డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడంతో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మెల్లిగా మల్టీ క్యాప్‌ ఫండ్లలోకి మారాలి. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (పీఎంఎస్‌) ద్వారా మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు. అయితే, దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది. మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి సగటు ప్రయోజనం పొందాలంటే.. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) మార్గాన్ని అనుసరించడమే ఎప్పుడూ మేలు. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు ఇదే ఉత్తమం.
అత్యవసర  నిధికి..
నగదుతో సమానమైన పెట్టుబడిగా లిక్విడ్‌ ఫండ్లను భావించవచ్చు. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేందుకు వీటిలో మదుపు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. ఈ లిక్విడ్‌ ఫండ్లలో పెట్టుబడులు కాస్త సురక్షితంగా ఉండటంతోపాటు, బీరువాలో దాచుకునే నగదుకన్నా ఎక్కువ రాబడినిస్తాయి.


పసిడి... ఇతర లోహాల్లో..

పెట్టుబడులకు కేటాయించే మొత్తంలో 10-15శాతం వరకూ బంగారానికి మళ్లించాలి. నేరుగా బంగారం కొనే బదులు గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి. వీటి ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా.. ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్‌ మార్కెట్లో బంగారం ద్రవ్యానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. కాబట్టి, కచ్చితంగా మన దగ్గర కొంత మేరకు బంగారం పెట్టుబడులు ఉండాలి. వీటితో ఈ ఏడాదిలో పారిశ్రామిక అవసరాల కోసం రాగి, అల్యూమినియం, జింక్‌లాంటి లోహాలకూ గిరాకీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి కనిపిస్తే వీటిలో మంచి రాబడికి అవకాశం ఉంటుంది. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు మెటల్‌ ఈటీఎఫ్‌లను లేదా ఆయా లోహాలకు సంబంధించిన కంపెనీల షేర్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు. అయితే, నష్టభయాన్ని అంచనా వేసుకోవడం మర్చిపోవద్దు.


చిన్న మొత్తంతో స్థిరాస్తిలో...

స్థిరాస్తిలో మదుపు చేయడానికి అధిక మొత్తం అవసరం. అదే సమయంలో విలువ ఎప్పటికప్పుడు పెరిగేదే కానీ తగ్గదు. అయితే, గత కొన్నేళ్లుగా స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం కష్టం కావడమే కాకుండా.. లాభాలూ అంతగా రావడం లేదు. ఈ సమయంలో ఈ రంగంలో మదుపు చేయడానికి ఉన్న మరో మార్గం రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌). ఇవి వాణిజ్య ప్రాజెక్టులలో మదుపు చేయడం ద్వారా.. వచ్చిన లాభాలను పెట్టుబడిదారులకు పంచుతాయి. అయితే, వీటిని ఎంచుకోవడంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మంచి నాణ్యమైన స్థిరాస్తి ప్రాజెక్టులను ఎంచుకొని, వాటిలో పెట్టుబడి పెట్టేవాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. చిన్న, మధ్యతరహా మదుపరులకు రీట్స్‌ వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టుల్లో మదుపు చేసేందుకు వెసులుబాటును కల్పిస్తాయి.

- ప్రకాశ్‌ గగ్దాని, సీఈఓ, 5 Paisa.comTags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని