close

తాజా వార్తలు

Published : 20/01/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పద్మాకార్‌

ఇంటర్‌ చదివిన ఇంజినీర్‌

విశాఖపట్నం జగన్నాథపురంలో ఓ మెకానిక్‌ షెడ్డు. ఇక్కడికి వాహనాల మరమ్మతుల కోసం ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు. షెడ్డు యజమాని యాంత్రిక విన్యాసాలు వీక్షించడానికి ఇంజినీరింగ్‌ విద్యార్థులూ వస్తారు. గ్యారేజీలో మెకానిక్‌గా జీవితం మొదలుపెట్టిన ఈ గురువు పేరు పద్మాకర్‌. వినూత్న వాహనాలను రూపొందిస్తూ అందరితో వారెవ్వా! అనిపించుకుంటున్నారు.
పద్మాకర్‌ చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకు. చర్మవ్యాధి ఆయనలోని విద్యార్థిని ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేసింది. దీంతో ఇంటర్‌ మధ్యలోనే చదువు ఆపేశారు. తండ్రికి చెందిన గ్యారేజీలో మెకానిక్‌గా చేరారు. మోటార్ల పనితీరును ఔపోసన పట్టారు. జనరేటర్లు, పెట్రోల్‌ పంపులు, పంపుసెట్లు ఎలా మరమ్మతు చేయాలో నేర్చుకున్నారు. నౌకల మరమ్మతులు చేసే వివిధ సంస్థల్లో చేరి అందులోనూ పరిజ్ఞానం సాధించారు. హెలికాప్టర్ల రిపేరులో ప్రావీణ్యం పొందారు. కొన్నేళ్ల అనుభవం తర్వాత 2001లో ‘పద్మాకర్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ’ని స్థాపించారు. వాహనాలకు మరమ్మతులు చేస్తూనే.. తన దగ్గరికి వచ్చే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సలహాలు ఇస్తుండే వారు. వినూత్న ఆలోచనలతో వచ్చే విద్యార్థులకు అవసరమయ్యే సాంకేతిక సహకారం అందించడం ప్రవృత్తిగా మలుచుకున్నారు. పదేళ్ల కిందట ‘పద్మాకర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ అనే సంస్థను ప్రారంభించారు. అల్లుడు చంద్రమోహన్‌ సాయంతో ఎలక్ట్రిక్‌ బైకులు, సోలార్‌ వాహనాలు, దివ్యాంగులకు అవసరమైనవి, గాలితో నడిచేవి ఇలా రకరకాల వాహనాలు విద్యార్థులతో దగ్గరుండి తయారు చేయించారు. ఈ వింత వాహనాలు పలు అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సొంతంగా విచిత్ర వాహనాలు తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
* ‘పద్మాకార్‌’ ఇది పద్మాకర్‌ రూపొందించిన ఎలక్ట్రిక్‌ కారు పేరు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో.. 60 కి.మీ. ప్రయాణిస్తుంది.
* పది పైసల ఖర్చుతో ఒక కిలోమీటర్‌ ప్రయాణించే వాహనాన్ని తయారు చేశారు. అదే ‘పద్మాకర్‌ వండర్‌ ఎలక్ట్రిక్‌ 48వి’. స్ల్పెండర్‌ బైక్‌ ఇంజిన్‌ తొలగించి దాని స్థానంలో బ్యాటరీలు ఏర్పాటు చేశారు. వాహనం వెనుక భాగంలో ఉంచిన బీఎల్‌డీసీ మోటార్‌కుబ్యాటరీని అనుసంధానించి బైక్‌ నడిచేలా చేశారు. ఈ వాహనం 15 నెలలుగా వందల కిలోమీటర్లు ప్రయాణించింది.
* విమానాలు నడవడానికి ఉపయోగించే పరిజ్ఞానంతో ఓ వాహనాన్ని తయారు చేశారు. దాని పేరు ‘రోడ్‌క్రాఫ్ట్‌’. పెట్రోల్‌తో నడిచే మోటార్‌కు ప్రొపెల్లర్‌ అనుసంధానించి దీనిని రూపొందించారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని