close

తాజా వార్తలు

Updated : 28/01/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కిలిమంజారో తలొంచింది

సాధించాలన్న కసి ఉంటే... ఎంతటి ఎత్తైనా అలవోకగా ఎక్కేస్తారు... పేదరికం అడ్డురాదు... అనారోగ్యాన్ని లెక్కచేయరు... విజయం సాధించేవరకు విశ్రమించరు... అందుకు నిదర్శనమే తెలంగాణ సాంఘిక గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు లక్ష్మి, రజిత. ఇటీవల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఆ విశేషాలివి... 

లక్ష్మిది నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని చెన్వార్‌. తల్లిదండ్రులకు అయిదుగురు సంతానంలో ఆమె ఒకరు. రెండేళ్ల వయసులోనే తల్లి అనారోగ్యంతో మరణించింది. తండ్రి కూలీకి వెళ్లినా పూట గడవడం కష్టమయ్యేది. కొన్నిసార్లు పస్తులుండాల్సి వచ్చేది. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేది. ఉన్నతంగా చదువుకుంటే ఎక్కువ వరకట్నం ఇవ్వాల్సి వస్తుందని నాలుగో తరగతిలోనే తండ్రి చదువు మాన్పించాలనుకున్నాడు. బంధువుల ప్రోత్సాహంతో కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చేరింది. గురుకులంలో ఇంటర్‌ చదివింది. తరువాత సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో చేరింది. ఆమెకు చిన్నప్పటి నుంచే ఆటలంటే ఆసక్తి. అదే ఆమెకు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించే అవకాశాన్నిచ్చింది.

కామారెడ్డి జిల్లాలోని ఎక్కపల్లి తండా రజిత స్వగ్రామం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. ఆమె ఎల్లారెడ్డిపేటలోని కేజీబీవీలో చదివేటప్పుడు చిన్నవయసులో ఎవరెస్ట్‌ని అధిరోహించిన మలావత్‌ పూర్ణ పాఠశాలకు వచ్చింది. ఆమె విజేతగా నిలిచిన తీరు... అక్కడి విద్యార్థులకు వివరించింది. ఈ మాటలు రజితలో స్ఫూర్తిని నింపాయి. ఒక్కసారైనా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలన్న కసిని పెంచాయి. మెదక్‌లోని సంక్షేమ డిగ్రీ కళాశాలలో ఆమెను అవకాశం వరించింది.

కిలిమంజారో అధిరోహించడానికి ప్రభుత్వం విద్యార్థులను ఎంపిక చేస్తుందన్న విషయం తెలియగానే వీరూ ఆసక్తి కనబరిచారు. భువనగిరి శిక్షణలో ప్రతిభ చూపి లక్ష్మి, రజిత మాత్రమే ఎంపికయ్యారు. గత అక్టోబర్‌లో వీరిద్దరినీ లద్దాఖ్‌లో శిక్షణకు పంపించారు. అక్కడ 18 వేల అడుగుల పర్వతాన్ని సునాయాసంగా ఎక్కారు.

కిలిమంజారో ఇలా... టాంజానియాలోని కిలిమంజారో అధిరోహించడానికి వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలియదు. ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేరు. గజగజా వణికించే చలి. క్షణాల్లో వాతావరణం మారిపోయేది. కొన్ని రోజులు అడవుల్లో నడవాలి. ఇలా 34కి.మీల ఎత్తులో ఉన్న పర్వతాన్ని అధిరోహించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా వెనుదిరగాలనుకోలేదు. ‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కళాశాల పేరు నిలబెట్టాలి. మా సార్లకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి’ అనుకున్నాం అంటారు రజిత, లక్ష్మి. ఈ నెల 24న కిలిమంజారోపై జాతీయ పతకాన్ని రెపరెపలాడించారు. ఎవరెస్టే ఇప్పుడు తమ లక్ష్యమంటున్నారు.

-ఆవుటి నాగరాజు, న్యూస్‌టుడే, మద్దూరు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని