close

తాజా వార్తలు

Updated : 29/02/2020 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భర్త ప్రాణాల కోసం...పరుగు

భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి యముడినే ఎదురించింది సావిత్రి! భర్తని బతికించుకోవడం కోసం మారథాన్‌లలో పాల్గొంది ఓ మహిళ. చెప్పులు లేకుండా ఒట్టి పాదాలకు రాళ్లు గుచ్చుకుంటున్నా... లక్ష్యాలను చేరుకుంది. విజేతగా నిలిచి, ఆ నగదుతో తన సౌభాగ్యాన్ని కాపాడుకుంది. వరుసగా మూడేళ్లపాటు మారథాన్‌లో విజేతగా నిలిచి, అందరికీ స్ఫూర్తినందించిన ఈమె కథ చలనచిత్రంగా విడుదలయ్యింది. ఈమే... 72 ఏళ్ల లతాకరే.

హారాష్ట్ర, పింప్లీ గ్రామానికి చెందిన లత, భగవాన్‌ కరే దంపతులకు నలుగురు సంతానం. భర్తతో కలిసి కూలి పనిచేస్తూ, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసింది. అలా బతుకుతున్న వీరికి అనుకోని కష్టం ఎదురైంది. ఏడేళ్ల క్రితం భగవాన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి వెళితే, హృద్రోగమని తెలిసింది. వైద్యపరీక్షలకూ చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎక్కడా అప్పు దొరకలేదు.

ఆ కాగితమే... ఆసుపత్రి బయట లతాకరేకు ఓ చిన్న కాగితం కళ్లబడింది. ‘ఆ కాగితం ముక్క నన్ను ఆకర్షించింది. బారామతిలో ఏటా నిర్వహించే మారథాన్‌ గురించి అందులో ఉంది. విజేతకు అయిదువేల రూపాయలు. దేవుడే ఈ దారిని చూపించాడనుకున్నా. గెలిచి, నా భర్తకు వైద్య పరీక్షలు చేయించొచ్చు అనుకున్నా. నా కూతుళ్ల వద్దకు వెళ్లాలంటే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లడం అలవాటు. అలా మైళ్లదూరం నడిచే నాకు ఈ పోటీలో గెలుస్తాననే నమ్మకం వచ్చింది’ అంటుంది లతాకరే.

చెప్పులు లేకుండా... మారథాన్‌ నిర్వాహకుల వద్ద లతాకరేకు చుక్కెదురైంది. మొదట అనుమతివ్వలేదు. తాను పరుగుపెట్టగలనని, ఆ వచ్చే బహుమతి తనకెంతో అత్యవసరమని లత వేడుకుంది. అవకాశం ఇవ్వాలని బతిమాలింది. ఎలా అయితేనేం.. అనుమతి సాధించింది. పోటీలో ఆమె పేరు నమోదైంది. మరుసటిరోజు పోటీ ఉందనగా లతాకరేకు కళ్లు తెరవలేనంత జ్వరం. ‘నా భర్త భయపడ్డాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే నాపై నమ్మకం ఉన్నా, నా అనారోగ్యం తనను భయపెట్టింది. బిళ్ల వేసుకుని, పట్టుదలగా ముందుకు అడుగేశా. తీరా అక్కడికెళ్లేసరికి పోటీదారులందరూ బూట్లు ధరించి, ప్యాంటు, చొక్కాల్లో ఉన్నారు. చీరతో, కనీసం చెప్పులు కూడా లేని నేనెలా పోటీపడగలను అనిపించింది. అయినా వెనకడుగు వేయలేదు. పాదాలకు రాళ్లు గుచ్చుకుని, బాధపెడుతున్నా... పరుగు ఆపలేదు. ప్రేక్షకుల ప్రోత్సాహంతో విజేతగా నిలిచి, అయిదువేల రూపాయలను అందుకున్నా. ఈ వయసులో పరుగులేంటి అని విమర్శించి, హేళన చేసిన వారంతా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. అది నా మొదటి మారథాన్‌. అలా వరుసగా మూడేళ్లపాటు నేనే విజేతగా నిలిచా. నా గురించి తెలుసుకున్న ఓ దర్శకుడు నాపై మరాఠీలో ఓ సినిమా తీశాడు. అందులో నా పాత్ర నేనే వేశా’ అని చెబుతుందీమె.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని