
తాజా వార్తలు
నేను సన్నగా కనిపిస్తున్నా!
నా వయసు 25 ఏళ్లు. చాలా సన్నగా కనిపిస్తున్నాను. నాకు ఎటువంటి అనారోగ్యాలు లేవు. చాలామంది బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తారు. నేను మాత్రం బరువు పెరగాలనుకుంటున్నా. నా ఎత్తు అయిదడుగులు, బరువు 35 కిలోలు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెప్పండి. - ఉష, పాలకొల్లు
శరీర తీరు, జన్యువులు, పోషకాహారం, మానసిక స్థితి, ఆరోగ్యస్థితులపై శరీర బరువు ఆధారపడి ఉంటుంది. వాత, పిత్త, కఫాలలో వాతప్రకృతి ఉన్నవారు సన్నగా ఉంటారు. తల్లిదండ్రులు సన్నగా ఉంటే, పిల్లలకు ఆ లక్షణం వచ్చే అవకాశం ఉంది. పోషకాహారలోపమూ దీనికి కారణమే. నిత్యం దిగులుగా ఉండేవారు కూడా సన్నగా కనిపిస్తారు. ఇంకా.. పలు అనారోగ్యాల వల్ల కూడా శరీర బరువు తగ్గుతుంది. మీ విషయానికొస్తే, మీకెటువంటి అనారోగ్యాలూ లేవన్నారు.
అలా అయితే.. మీ శరీరపు తీరు వాత ప్రకృతి కావచ్ఛు దీనికి జన్యువులూ కారణమవ్వచ్ఛు మానసికంగా ఉల్లాసంగా ఉంటే మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. ఆహారంలో అంజీర, ఖర్జూరం, ఎండుద్రాక్ష, బాదం, అక్రోట్, అరటిపండు, చెరకు, మినుము, నెయ్యి, పెరుగు వంటి పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జీర్ణశక్తి పెరగడానికి రోజూ ఆహారం తీసుకునే ముందు కొంచెం అల్లం ముక్కలు, ఉప్పు కలిపి తినండి.
రెండు అంజీరాలు, రెండు ఖర్జూరాలు, పది బాదం పప్పులు నానబెట్టి మిక్సీలో మెత్తగా చేసి పాలల్లో కలపాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసి నిత్యం తీసుకోవాలి. అలాగే చెంచా శతావరిచూర్ణం, చెంచా పటిక బెల్లంపొడిని గ్లాసు పాలల్లో కలిపి రోజూ తాగండి. ఈ సూచనలన్నీ మీరు బరువు పెరగడానికి తోడ్పడతాయి.
మీ ప్రశ్నలు vasuayur@eenadu.net కు పంపించగలరు.