close

తాజా వార్తలు

Published : 07/02/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చ్యవన్‌ప్రాశ్‌ను ఇంట్లో తయారుచేసుకోవచ్చా..?

ఇంటి వైద్యం


చ్యవన్‌ప్రాశ్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి.

-రజని, భీమవరం



చ్యవన్‌ప్రాశ్‌ మంచి రసాయన ఔషధం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, వార్ధక్య లక్షణాలు త్వరగా రాకుండా కాపాడుతుంది. దీని తయారీలో దాదాపు 45 నుంచి 50 రకాల మూలికలు వినియోగిస్తారు. ఇంటివద్ద దీన్ని తయారుచేసుకోవడం కష్టం. ఇందులో ప్రధానంగా వాడే మూలిక ఉసిరికాయ. దీన్ని ఉత్తమ రసాయనం అంటారు. దీనికి తేలికగా లభ్యమయ్యే మరికొన్ని మూలికలను కలిపి ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే...
కావలసినవి: ఉసిరికాయలు-50, వెదురు ఉప్పు-20గ్రా., పిప్పళ్ల చూర్ణం-10గ్రా., దాల్చినచెక్క పొడి-పావుచెంచా, యాలకుల పొడి-పావుచెంచా, తేనె-30గ్రా., నెయ్యి-30గ్రా., నువ్వుల నూనె-30గ్రా., చక్కెర-250గ్రా.
తయారీ: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పలుచని వస్త్రంలో మూట కట్టి, కుక్కర్‌లో ఆవిరిపై ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత స్టీలు జల్లెడలో వేసి చేతితో రుద్దుతుంటే గింజలు, పీచు పైన ఉండిపోయి, మెత్తటి గుజ్జు కిందకి వస్తుంది. ఆ తరువాత మూకుడు వేడిచేసి నువ్వులనూనె, నెయ్యి వేసి ఉసిరికాయ గుజ్జును అందులో బాగా వేయించాలి. వేరే గిన్నెలో చక్కెర పాకం పట్టి, వేయించిన గుజ్జును వేసి దగ్గరపడేవరకు ఉడికించాలి. తరువాత చల్లార్చి తేనె, వెదురు ఉప్పు, పిప్పళ్ల చూర్ణం, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి కలిపి శుభ్రమైన గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఉసిరికాయలు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరంలో వ్యాధికారకాలు, మలినాలు చేరకుండా కాపాడతాయి. ఇలా తయారు చేసుకున్న ఈ చ్యవన్‌ప్రాశ్‌ను అయిదు నుంచి పది గ్రాముల పరిమాణంలో ఉదయం, సాయంత్రం భోజనానికి కనీసం గంట ముందు తీసుకోవాలి. వెంటనే అరకప్పు గోరువెచ్చని పాలు లేదా నీళ్లు తాగాలి. ఈ విధంగా కనీసం ఏడాదిపాటు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.



 

 

 

డాక్టర్‌ గాయత్రీదేవి, ఆరోగ్యపీఠం,


మీ ప్రశ్నలు vasuayur@eenadu.net కు పంపించగలరు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని