close

తాజా వార్తలు

Published : 07/02/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీతమ్మ వాకిట్లో చిన్నారి పథకం

ఎనిమిదో తరగతి చదువుతోంది ఓ అమ్మాయి. తన పుట్టిన రోజున అమ్మ కొత్త డ్రెస్సు కొంటానంది. ‘నాకేం వద్దు. నాకు చాలానే కొత్త దుస్తులున్నాయి. కావాలంటే నువ్వు డ్రెస్సుకు ఖర్చుపెట్టాలనుకున్న డబ్బులు నాకివ్వు’ అంటూ అమ్మకు తేల్చి చెప్పిందా చిన్నారి. ఇంతకీ ఆ డబ్బులు ఎందుకు?
ఇంకొందరు చిన్నారుల చదువుకోసం...
ఒక చిన్నారి. ఇంట్లో వాటర్‌ బాటిళ్లు నింపడం... కూరగాయలు తేవడం... మొక్కలకు నీళ్లుపోయడం... అమ్మకి వంట చేయడంలో సాయం.. వంటివి చేస్తోంది. బదులుగా అమ్మానాన్నల దగ్గర డబ్బులు తీసుకుంటోంది. అయితే ఆ చిన్నారి ఆ డబ్బులు అడిగింది తన కోసం కాదు. మరి ఎవరికోసం?
పేదరికంలో మగ్గుతున్న పసిమొగ్గల భవిష్యత్తు కోసం
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. హైదరాబాద్‌ బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ అంతర్జాతీయ పాఠశాలలోని మూడువేల మంది చిన్నారులు డబ్బులు సంపాదిస్తూ, ఖర్చుల్ని తగ్గించుకుంటూ పొదుపు చేస్తున్నారు. ఈ స్కూల్లో ‘కాయిన్స్‌ ఫర్‌ ది కంట్రీ’ పేరుతో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటూ పైసా పైసా కూడబెడుతున్నారు. ఏటా రెండు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంతోమంది పిల్లలకు సాయం చేస్తున్నారు. 2005 నుంచి 2019 వరకు వీరు పొదుపు చేసి, సాయం చేసిన డబ్బు మొత్తం దాదాపు కోటీ 45 లక్షల రూపాయల పైమాటే. చిన్న వయసులోనే ఈ విద్యార్థుల్లో వచ్చిన సామాజిక బాధ్యతకు కారణం ఈ స్కూలు ప్రిన్సిపల్‌ సీతామూర్తి. అసలా ఆలోచన ఎలా వచ్చింది? ఇంత పెద్ద మొత్తాన్ని వారు ఎలా పొదుపు చేశారో... ఆమె మాటల్లోనే...
* ఓసారి 2008లో అంతర్జాతీయ సదస్సుకు సింగపూర్‌ వెళ్లాను. అక్కడ ఒక అమెరికన్‌... పాకిస్థాన్‌లోని ఆడపిల్లల చదువు కోసం చేస్తున్న పొదుపు గురించి చెప్పాడు. అది నాకు చాలా నచ్చింది. అప్పటివరకు మా స్కూల్లోనూ పొదుపు విధానం ఉంది. అయితే విద్యార్థులు డబ్బులు పొదుపు చేయడానికి ఫ్రెండ్స్‌, బంధువుల్ని అడిగేవారు. అలా కాకుండా.. ఎవర్నీ డబ్బులు అడగకుండా పొదుపు చేస్తే బాగుంటుందనిపించింది. పాఠశాల యాజమాన్యంతో దీన్ని చర్చించి ‘కాయిన్స్‌ ఫర్‌ ది కంట్రీ’ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో భాగంగా పిల్లలు పొదుపు చేయడానికి.. ఇంట్లో బాటిల్స్‌ నింపడం, అమ్మకు ఇంటిపనుల్లో సాయం చేయడం, టాయ్‌ లైబ్రరీ, బుక్‌ లైబ్రరీ ఏర్పాటు చేయడం, బయటకు వెళ్లినప్పుడు ఖర్చులు తగ్గించుకోవడం.. వంటి సూచనలు చేశాం. పిల్లల అమ్మానాన్నలకూ అవగాహన కల్పించాం.
* ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి రోజూ అసెంబ్లీలో విద్యార్థులు చేసిన పొదుపు, వాళ్ల ఆలోచనల గురించి కొంతసేపు మాట్లాడుతున్నాం. పొదుపు చేసిన డబ్బుతో ఎంతమందికి సాయం అందుతోందో చెప్పి, లబ్ధిపొందేవారిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాం. పిల్లలతో పాటు మేమెంత జమ చేస్తున్నామో వివరిస్తున్నాం. ఈమధ్య మా ఇంట్లో ఓ ఫంక్షన్‌ జరిగింది. కొన్ని ఖర్చులు తగ్గించి కొంత డబ్బు మిగిల్చా. దాన్ని పిల్లల ముందే నా దగ్గర ఉన్న కిడ్డీ బ్యాంకులో వేశా. అలా పిల్లలకు ఎప్పుటికప్పుడు బాధ్యత గుర్తు చేస్తూ పొదుపు చేసేలా ప్రోత్సహిస్తుంటాం.
* ఏటా విద్యాసంవత్సరం మొదలవ్వగానే మూడువేల మంది విద్యార్థులకు కిడ్డీబ్యాంకులు అందజేస్తాం. వాటిని పిల్లలంతా ఇంటికి తీసుకెళతారు. అందులో నగదు జమ చేయడానికి విద్యార్థులు ఎవరినీ అడగకూడదనేది మా నిబంధన. పుట్టిన రోజు సరదాలు వంటి వేడుకల్లో పెట్టే ఖర్చులో కాస్త తగ్గించుకోవడం, పాకెట్‌ మనీ, బహుమతుల ద్వారా అందిన డబ్బులు ఇలా రకరకాలుగా జమ చేస్తుంటారు. ఒక్కో విద్యార్థి తమ పరిస్థితుల్ని బట్టి పొదుపు చేస్తుంటారు. వాటిని జనవరి 26న పాఠశాలకు అప్పగించాలి. వరంగల్‌ జిల్లా కళ్లెడలోని ‘రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌(ఆర్‌డీఎఫ్‌), గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్తి  మైనంపాడులోని ‘నీడి ఇల్లిటరేట్‌ ఎడ్యూకేషన్‌(నైస్‌)’ స్వచ్ఛంద సంస్థలకు ఆ డబ్బును విరాళంగా ఇస్తున్నాం. వీటి ద్వారా దాదాపు రెండువేల మంది అనాథ పిల్లలకు సాయం అందుతోంది.


- నవనీత గంటగారి

 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని