close

తాజా వార్తలు

Published : 14/02/2020 00:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలా సాధించా!

రూ.43 లక్షల కొలువు

ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఈ-మెయిల్‌.. వీటన్నింటికీ రకరకాల యూజర్‌ఐడీలు, పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటాం... వాటిని కొన్నిసార్లు మరిచిపోతుంటాం. చికాకు పడుతుంటాం... అదే అన్నింటికీ ఒకే యూనికోడ్‌ ఉంటే... ఏ ఇబ్బంది ఉండదు కదా! ఈ ఆలోచనే హైదరాబాద్‌ హెచ్‌సీయూకు చెందిన నందనిసోనికి రూ.43లక్షల వేతనంతో ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది. ఆ విశేషాలివి...

అది మార్చి, 2019. దిల్లీలో స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ జరుగుతోంది. దీంట్లో నందనిసోని తన బృందంతో పోటీల్లో పాల్గొంది. మొత్తం ఆరుగురు సభ్యులు. తుది పోటీలకు నెల రోజుల ముందే వారు ప్రాజెక్టులోని ఏఏ అంశాలపై పని చేయాలో నిర్ణయించుకున్నారు. గెలుపు కోసం ఎంత కసరత్తు అవసరమో అంతా చేశారు. ఎంతో శ్రమించి ఆల్టర్నేటివ్‌ అథెంటికేషన్‌ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌... ఇలా ఎన్నో సామాజిక మాధ్యమాలకు విడివిడిగా యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటాం. ఇది ఎంతో మందికి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఒకే కోడ్‌ సాయంతో ఇవన్నీ పనిచేసేలా పరిశోధన చేశారా విద్యార్థులు. దీంతో వేర్వేరు యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఈ ఆలోచన మొత్తం 36 మందిని వెనక్కి నెట్టింది. నందనిసోని బృందాన్ని విజేతగా నిలిపింది. రూ.లక్ష నగదు బహుమతిని తెచ్చిపెట్టింది.

ఇటీవల అడోబ్‌ సిస్టమ్‌ కంపెనీ ప్రాంగణ నియామకాలు నిర్వహించింది. ఇది మొత్తం నాలుగు దశల్లో జరిగింది. ఇందులో పాల్గొంది నందనిసోని. రెండుసార్లు టెక్నికల్‌, మేనేజర్‌, హెచ్‌ఆర్‌ స్థాయి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో ఇండియా హ్యాకథాన్‌లో తన బృందానికి పురస్కారం తెచ్చిన ఆలోచనను పంచుకుంది. ఇది వారికెంతో నచ్చింది. అంతేకాదు... డేటాసెర్చ్‌, అల్గారిథమ్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పేసింది. రెజ్యుమేనూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. గతంలో చేసిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ అందులో ప్రస్తావించి కొలువు కొట్టింది. హెచ్‌సీయూ చరిత్రలో స్వదేశీ కేటగిరీలో రూ.43లక్షల అత్యధిక వేతనంతో ఉద్యోగం సాధించిన మొదటి విద్యార్థినిగా నందని గుర్తింపు పొందింది.

నందనిసోనిది మహారాష్ట్ర. అమ్మ ఉపాధ్యాయురాలు. నాన్న బంగారు నగల తయారీ వ్యాపారి. వారు చిన్నప్పటి నుంచే నందనిని ఎంతో ప్రోత్సహించేవారు. ఆమె బౌజర్‌లోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో చదివి 95శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైంది. అహ్మదాబాద్‌లోని సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీలో బీసీఏ పూర్తి చేసింది. ఇప్పుడు హెచ్‌సీయూలో ఎంసీఏ మూడో సంవత్సరం చదువుతోంది. ఎవరైనా చేయూతనందిస్తే తన ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి సిద్ధంగా ఉందామె. ఉద్యోగంతోనే ఆగిపోకుండా కంప్యూటర్‌ సైన్స్‌లో మరింత పట్టు సాధిస్తానని చెబుతోందీ ప్రతిభావని.

- యార్లగడ్డ అమరేంద్ర, ఈనాడు, హైదరాబాద్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని