close

తాజా వార్తలు

Published : 14/02/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాళ్లల్లో రాగబంధం!

ప్రేమించి.. పెళ్లి చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుని సుఖంగా ఉందామనుకుంటారు చాలామంది! కానీ ఈ జంట మాత్రం రాళ్లను రక్షించే పనిలో పడింది. పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యతను భుజానికెత్తుకుంది. అందుకే ఈ జంట ప్రేమకథ శిలాక్షరాలుగా మారిపోయింది.... ‘సేవ్‌రాక్స్‌’ పేరుతో పాతికేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రాళ్ల సంరక్షణ బాధ్యతను చేపట్టిన జర్మన్‌ వనిత ఫ్రాకె ప్రేమ కథ ఇది..

పెరుగుతున్న జనావాసాలతో చరిత్రకు అద్దంపట్టే కొండలు, అందమైన ఆకృతులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. గృహ నిర్మాణాల కోసం వాటి గుండెల్లో గునపాలు దించారు. బాంబులతో పగలగొట్టి ఆ స్థలాల్లో పెద్దపెద్ద భవనాలు నిర్మించారు.. ఇదే కొనసాగితే భవిష్యత్తు తరాలకు కొండలు, బండరాళ్లు ఎలా ఉంటాయో వివరించేందుకు వాటి బొమ్మలు మాత్రమే మిగులుతాయి. వాటి ఆకారాలను కథలుగా చెప్పే పరిస్థితి రావొచ్ఛు రాళ్లభూమిగా చెప్పుకునే దక్కను పీఠభూమి పేరుమారే స్థితి ఏర్పడుతోంది. దీనికి వ్యతిరేకంగా పోరాడుతోంది సేవ్‌ ది రాక్స్‌ సొసైటీ. 25ఏళ్లుగా ఈ సంస్థ కార్యక్రమాల వెనుక ముఖ్య భూమిక పోషిస్తున్నారు ఫ్రాకె ఖాదర్‌. జర్మనీకి చెందిన ఫ్రాకె హైదరాబాద్‌ నగరంలో అడుగుపెట్టడం వెనుక అద్భుతమైన ప్రేమ కథ ఉంది.. 1996 నుంచి రాళ్ల మనసు వింటోన్న ఫ్రాకె.. ఈ నగరంలో అడుగుపెట్టి... రాళ్లపై మనసు పెట్టడానికి కారణం ఆమె ప్రేమ కథ.

అలా మొదలైంది...

దిల్లీలోని జర్మన్‌ ఎంబసీ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఫ్రాకె.. 1975లో తన స్నేహితుల ద్వారా హైదరాబాద్‌కి చెందిన ఫయాజ్‌ ఖాదర్‌ని కలిశారు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో వారి స్నేహం ప్రేమగా మారింది. దేశాలు వేరైనా... ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. ఆ క్షణం నుంచీ ఫ్రాకె తన జీవితాన్ని భారతదేశానికే అంకితం చేశారు. ఇక్కడ నేలనీ, గాలినీ ప్రేమించడం మొదలుపెట్టారు. క్రమంగా పూర్తి హైదరాబాదీగా మారిపోయారు. ఇక్కడ వాతావరణం.. ముఖ్యంగా బండలతో నిండిన ఈ నగరం ఆమెను మంత్రముగ్ధురాలిని చేసింది. రాళ్లను ఓ పర్యావరణ సంపదగానే భావించారామె. ‘మా పెళ్లయిన కొత్తలో నగరం ఇలా ఉండేది కాదు. వారాంతాల్లో గడిపేందుకు ప్రకృతి, శిల సంపద మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చేవి. మేం చెప్పుకున్న ముచ్చట్లకు ఈ రాళ్లే సాక్షి. కానీ... కాలం మారుతున్న కొద్దీ క్రమంగా అవి కనుమరుగవడం మొదలయ్యాయి. అది నన్నెంతో బాధించింది’ అంటారు ఫ్రాకె. పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని భర్తతో చెప్ఫి. ఇదే ఆలోచన ఉన్న మరికొంతమంది ప్రకృతి ప్రేమికులతో కలిసి 1996లో ‘సేవ్‌ ది రాక్స్‌ సొసైటీ’ని స్థాపించారు. ఫ్రాకె భర్త మరణానంతరం కూడా సేవ్‌రాక్స్‌ కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విశేష సేవలందిస్తున్నారు. మొదట్లో కొందరితో మాత్రమే మొదలైన ఈ ఉద్యమంలో ఇప్పుడు వేలాదిమంది ప్రకృతి ప్రేమికులు సభ్యులుగా చేరి పర్యావరణాన్ని కాపాడుతున్నారు.

ప్రతిరోజు కొత్తగా ప్రేమలో..

ప్రతిరోజు రాళ్లతో కొత్తగా ప్రేమలో పడుతుంటారు ఫ్రాకె. ఆమె వయసు ఇప్పుడు 81.. ఈ వయసులోనూ ప్రతిరోజు శిలాసంపదను కాపాడేందుకే తపన పడుతున్నారామె. సంస్థ ప్రారంభం నుంచి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెకు ఉదయం నుంచి రాత్రి దాకా ఆలోచనంతా ఈ కార్యక్రమాలపైనే. ప్రతివారం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో యువతతో పోటీపడుతుంటారామె. బృందంలో అందరికంటే చురుగ్గా ఉంటూ అందరినీ ముందుండి నడిపిస్తున్నారు.

- అభిసాయి ఇట్ట, హైదరాబాద్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని