close

తాజా వార్తలు

Updated : 22/02/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫిల్మ్‌నగర్‌కు  రంగుపడింది!

అంతా ఆమె సృజన

చుట్టూ మురుగు. అపరిశుభ్రమైన వీధులు. దుమ్ము పేరుకుపోయిన ఇళ్లు. పది రోజుల కిందట హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఓ మురికి వాడ పరిస్థితి ఇది. ఇప్పుడది రంగులమయంగా మారింది. పరిశుభ్రతపై అక్కడి ప్రజలకు అవగాహన పెరిగింది. అక్కడి పిల్లలకు చదువు విలువ తెలిసింది. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా!

ముంబయికి చెందిన రూబుల్‌ నాగి లండన్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ చదివింది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి. ఉద్యోగరీత్యా ఆయన వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. దీంతో చిన్నప్పటి నుంచే ఎన్నో ప్రదేశాలు చూసిందామె. తనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా పసివాళ్లు బతుకుదెరువు కోసం ఏదోఒక పనిచేస్తూ కనిపించేవారు. ఒక రోజు రూబుల్‌ తన విద్యార్థి కోసం ముంబయిలోని ధారావి మురికివాడలోకి వెళ్లింది. ఆమె ఎన్నో ఏళ్లుగా ఆ మహానగరంలో నివసిస్తోంది. కానీ ఎప్పుడూ ఆ మురికివాడను చూడలేదు. అక్కడి జీవితాలు, అపరిశుభ్రత వంటివి ఆమెను కదిలించాయి. అక్కడి పిల్లలకు చదువు లేదు. సరైన పోషకాహారం లేక బక్కచిక్కిపోయారు. ఈ పరిస్థితి మార్చాలని నిర్ణయించుకుంది రూబుల్‌. కళ ఎంతో మందిని కదిలించగలదు. మరెందరినో చైతన్యవంతులను చేస్తుంది. అందుకే తనకు తెలిసిన కళతో గోడలపై రంగులు వేయడం ప్రారంభించింది. ఇలా పదేళ్ల కిందట ‘రూబుల్‌ నాగి ఆర్ట్‌ ఫౌండేషన్‌’ మొలకెత్తింది.

ఏం చేస్తారంటే...

ఈ సంస్థ మొదటిసారి ముంబయిలోని బాంద్రాలో ఉండే మురికివాడను సందర్శించింది. అక్కడి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించింది. కొంతమంది వాలంటీర్ల సహాయంతో అక్కడి ఇళ్లకు రంగులు వేసింది. ఆ రంగులు, గోడలపై ఉండే బొమ్మలు... ఆ ప్రజలను ఆలోచింపజేసేలా ఉంటాయి. పరిశుభ్రతతో కలిగే ప్రయోజనాలు తెలియజేస్తాయి. చదువు విలువను వివరిస్తాయి. ఆరోగ్యం, ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని చాటిచెబుతాయి. అక్కడి ప్రజలతో రూబుల్‌ మాట్లాడుతుంది. ఇప్పటి వరకు ఆమె ఎన్నో మురికివాడలను సందర్శించింది. దాదాపు లక్ష ఇళ్లను రంగులమయంగా మార్చింది. ఇందులో భాగంగానే ఫిలిం నగర్‌లోని మురికివాడలకు రంగులద్దింది.

- యస్‌.యస్‌.రాజ, ఈజేఎస్‌

అందవిహీనంగా మారిన ఇళ్లకు రంగులద్దడం చూసి మురికివాడల్లోని ప్రజలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇక్కడేమైనా సినిమా తీస్తున్నారా అని అడుగుతుంటారు. ఆ వాడలను అందంగా తీర్చిదిద్దడం చూసి నువ్వు మాకు దీపావళి పండగను తెచ్చావమ్మా అంటూ కన్నీళ్లు పెడుతుంటారు. ముంబయిలో మా పనితనం చూసి ఎంతోమంది వైద్యులు, లాయర్లు, ఫ్యాషన్‌ పరిశ్రమలో పనిచేసేవారు మా సంస్థతో జట్టు కట్టారు. ప్రపంచ జల దినోత్సవం రోజు యూనిసెఫ్‌తో కలిసి నీటి కొరతపై అవగాహన కల్పించాం. మా పనితీరును అమితాబ్‌ బచ్చన్‌, ఆమీర్‌ ఖాన్‌ వంటి ప్రముఖులు ప్రశంసిస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మేమింకా చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. కనీసం పది లక్షలమంది పిల్లల్ని బడిబాట పట్టించడమే మా సంస్థ లక్ష్యం.

- రూబుల్‌ నాగి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని