close

తాజా వార్తలు

Published : 02/03/2020 00:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్యోగం ముగిసింది విద్యాసేవ మొదలైంది

అవిశ్రాంత సేవకులు

సేవ చేయడానికి వయసుతో పనేముంది? పదవీవిరమణ తర్వాత వారంతా సమాజానికి ఉపయోగపడాలని సంకల్పించారు. నెత్తురు మండే... శక్తులు నిండే మనసుతో అజ్ఞానంపై యుద్ధం చేస్తున్నారు. రేపటి తరానికి విజ్ఞానం పంచుతున్నారు. పేదరికాన్ని చదువుతో జయించే మార్గం చూపుతున్నారు.

పౌరులు బాగుంటేనే సమాజం పురోగమిస్తుంది. మరి ఆ పౌరులు బాగుండాలంటే... బాలలు బాగుండాలనేది హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌కు చెందిన డి.పార్థసారథి ఆలోచన. పేదరికం వల్ల చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకు విజ్ఞానం పంచాలని అనుకున్నారు. కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన పార్థసారథి బీకేగూడలోని తన నివాసంలో కొంత స్థలం కేటాయించి 2015లో విద్యాభ్యాస కేంద్రాన్ని ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగులు బీఎంకే సత్యనారాయణ, మామిడి రామమూర్తి, జీవీఎల్‌ రెడ్డి, ఆర్‌.కృష్ణారెడ్డి, పి.నర్సింహగౌడ్‌, కృష్ణదేవ్‌గౌడ్‌ తదితరులు ఆ కేంద్రంలో పిల్లలకు పాఠాలు చెబుతూ సాయపడుతున్నారు.

ఆలోచన ఇలా..

పార్థసారథి నిత్యం విధుల నుంచి తిరిగొస్తుంటే... తన ఇంటి సమీపంలోని బస్తీ పిల్లలు బయట రోడ్డుమీదే ఆడుకుంటూ సమయం వృథా చేసేవారు. ఒకరోజు ఆయన ఆగి.. ఆ పిల్లలతో మాట్లాడారు. తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లడంతో ఇలా బయట ఆడుకుంటామని వారు సమాధానమిచ్చారు. తరగతులకే సరిగ్గా వెళ్లని ఆ బస్తీ పిల్లలు, ఇక ఇంటికొచ్చి ఏం చదువుతారని అనుకున్నారు. వారికోసం సాయంత్రాలు ప్రత్యేకంగా ఒక ట్యూషన్‌ ఏర్పాటు చేయాలని తలచారు.

అల్పాహారంతో ఆకట్టుకొని

ట్యూషన్‌ ప్రారంభించిన కొత్తలో చాలా తక్కువ మంది వచ్చేవారు. ఎలాగైనా పేద పిల్లలను వృద్ధిలోకి తీసుకురావాలని భావించిన ఆయన విద్యాభ్యాస కేంద్రానికి వచ్చిన పిల్లలకు అల్పాహారం అందించడం మొదలుపెట్టారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 35 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత గంటన్నరపాటు వీరు తరగతులు నిర్వహిస్తారు. నిత్యం కూలీలు, రిక్షా, ఆటో నడిపే వారి పిల్లలకు బిస్కెట్లు, పండ్లు తదితర అల్పాహారం అందిస్తూ చదువు చెబుతున్నారు. వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి ఆటల పోటీలు నిర్వహించడం, బాగా చదువుకున్న వారికి ఉపకార వేతనాలు అందించడం లాంటివి చేస్తున్నారు. అసలు బడికే వెళ్లను అనే చిన్నారులను వారంతట వారే చదువుకుంటాననేలా మార్పు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 200పైగా మందిని పాఠశాలల్లో చేర్పించారు. పేదరికాన్ని జయించడానికి చదువుకు మించిన ఆయుధం లేదని నమ్మి... సాగుతున్న ఈ సీనియర్‌ సిటీజన్స్‌... అభినందనీయులు.

అన్నదానం చేస్తే ఒకపూట కడుపు నిండుతుంది. విద్యాదానం చేస్తే జీవితాంతం తాను బతకడంతోపాటు మరికొందరికి మేలు జరుగుతుంది. అందుకే బస్తీలోని కూలీల పిల్లలకు ఉచితంగా సాయంత్రాలు చదువు చెబుతున్నాం. నా ఆశయానికి నా మిత్రులు, మంచి మనసున్న వారు సాయం చేస్తున్నారు.

- డి.పార్ధసారథి

- తేరాల రంజిత్‌ కుమార్‌, ఈనాడు, హైదరాబాద్‌

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని