close

తాజా వార్తలు

Published : 06/03/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లవ్‌లో పడేసే..మోటూరుసైకిళ్లు!

మనసు బాగోకపోతే లాంగ్‌ డ్రైవ్‌...

కొత్త ప్రదేశాలపై మనసు పడితే బైక్‌ రైడింగ్‌... తీరికలేని పనిలో విశ్రాంతి కోసం టూర్‌కి చలో... సాకు ఏదైనా మోటార్‌సైకిల్‌పై జామ్మంటూ దూసుకెళ్లే ట్రెండ్‌ పెరిగిపోతోంది... ఈ సాహసానికి సిద్ధమయ్యే పద్ధతులు తెలుసుకుంటూనే ప్రయాణానికి అనుకూలమైన బైక్‌లపై కన్నేద్దాం.

తెల్లవారుతుండగా మేనిని స్పృశించే శీతల పవనాలు. ఘడియ గడవగానే నునువెచ్చగా పలకరించే లేత భానుడి కిరణాలు. మరీ ఎండ కాదు. వణికించే చలి లేదు. చికాకు పెట్టే వానలు కానరావు. లాంగ్‌ డ్రైవ్‌లకు ఇంతకంటే మంచి కాలం ఏముంటుందంటారు రైడర్లు. ఆ మాటకొస్తే మనదగ్గర దూరప్రయాణాలకు ఎప్పుడూ అనువైన కాలమేనేమో! అందుకే చేతిలో యాక్సిలరేటర్‌ గుండెలో తరగని ఉత్సాహం ఉన్న బైకర్లు భారీగా పెరిగిపోతున్నారు. వారి ఆసక్తి కనిపెట్టిన ఆటోమొబైల్‌ కంపెనీలూ లాంగ్‌ డ్రైవ్‌ల కోసమే ప్రత్యేకమైన ఫీచర్లతో ద్విచక్రవాహనాలు తయారు చేస్తున్నాయి.

కారణాలెన్నో

బండిపై దూరప్రయాణానికి సై అనడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. ఓ కార్పొరేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పని చేసే విజయ్‌ మాటల్లో చెప్పాలంటే ‘చిన్నప్పట్నుంచీ బైక్‌ రైడింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో దేశమంతా చుట్టేసేవాణ్ని. ప్రస్తుతం ఉద్యోగంలో పడిపోయా. తీవ్ర పని ఒత్తిడి. ఉపశమనం, సంతోషం కోసం మళ్లీ రైడింగ్‌తో దోస్తీ చేస్తున్నా. రెండునెలలకోసారి దేశంలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లొస్తుంటా. బండిపై దూసుకెళ్తుంటే పదేళ్లు వెనక్కి వెళ్లినట్టే అనిపిస్తుంది’ అంటాడు. ఇంకొందరికి కొత్త ప్రదేశాలు తిరగడం అంటే మహా సరదా. ఖరీదైన కార్లలో వెళ్లే స్థోమత లేనివాళ్లు బండిపై వెళ్లొస్తుంటారు. గ్రూపులుగా వెళ్లి సరదాగా ఎంజాయ్‌ చేసేవాళ్లు తక్కువేం కాదు. మెట్రో నగరాలతోపాటు పట్టణాల్లోనూ దూరప్రయాణాలు చేసే బైకర్‌ గ్రూపులున్నాయి. వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నా ఏడాదికి 20శాతం చొప్పున రోడ్‌ట్రిప్‌లు పెరిగిపోతున్నాయని కొన్ని ట్రావెలింగ్‌ వెబ్‌సైట్ల అధ్యయనంలో తేలింది. ఈ రైడింగ్‌ రాజాల్లో అత్యధికులు 22 నుంచి 40 ఏళ్లవాళ్లే.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెట్రోల్‌ బంక్‌లు: టూరు మధ్యలో ఇంధనం అయిపోతే బండి కదలదు. అందుకే ప్రయాణం ప్రారంభానికి ముందే పెట్రోల్‌ బంక్‌ల సమాచారం తెలుసుకోవాలి. జాతీయ రహదారులు, మారుమూల పల్లెల్లో అంతర్జాలం ద్వారా పెట్రోల్‌ స్టేషన్‌ ఎక్కడుందో ముందే కనుక్కోవాలి.

టైర్లలో గాలి: గంటలు, రోజులు.. ప్రయాణం ఎలాంటిదైనా బండి సాఫీగా సాగాలంటే టైర్లలో తగినంత గాలి ఉండాలి. మధ్యమధ్యలో చెక్‌ చేస్తూ ముందుకెళ్లాలి.

బ్యాగేజీ: సామగ్రి తక్కువైతే భారం తగ్గినట్టే. అలాగని అత్యవసర సరంజామా వెంట తీసుకెళ్లడం మరవొద్ధు బ్యాగ్‌ని గ్రాబ్‌రెయిల్‌, హుక్‌తో బంధించి కట్టినప్పుడే సురక్షితం. ప్రయాణానికి ఆటంకం ఉండదు.

వేగం: అతి వేగం, నెమ్మది సదా ఆచరణీయం కాదు. అదుపు చేయగల వేగంతోనే బండి నడపాలి. రైడర్‌ సామర్థ్యాన్ని బట్టి గంటకు 80కి.మీ.ల వరకు ఫర్వాలేదు. అంతకుమించితే సురక్షితం కాదు.

విరామం: ఒంట్లో ఓపిక ఉందని వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఏకధాటిగా పూర్తి చేయాలనుకోవడం మంచిది కాదు. రెండు గంటలకోసారైనా పది నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవాలి. దీంతో మనతోపాటు బండికీ మంచిది. జనం ఉన్నచోటే విశ్రాంతి తీసుకోవాలి.

లైట్లు చెక్‌: లాంగ్‌టూరులో ఒక్కోసారి రాత్రుళ్లూ ప్రయాణించాల్సి ఉంటుంది. హెడ్‌లైట్లు, టెయిల్‌ లైట్లు బాగుండాలి. టర్న్‌ ఇండికేటర్లూ ముఖ్యమే. వీటిలో ఏది పని చేయకపోయినా మనతోపాటు ఇతరులకూ ఇబ్బందే.

తప్పనిసరి: జాకెట్‌, గ్లౌజులు, హెల్మెట్‌, కాళ్లకి బూట్లు ఇవి లేకుండా ప్రయాణం చేయొద్ధు రాత్రుళ్లు ఎదురుగా వచ్చేవాళ్లకి కనపడేలా జాకెట్‌ లేదా హెల్మెట్‌పై రిఫ్లెక్టర్లు, రేడియం స్టిక్కర్లు అంటిస్తే మంచిది.

కిట్‌లు మరవొద్దు: బండికి ఏవైనా మరమ్మతులుంటే సరి చేయడానికి టూల్‌ కిట్‌, చిన్నచిన్న ప్రమాదాలు జరిగినప్పుడు చికిత్స కోసం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ వెంట ఉండటం తప్పనిసరి.

మనకోసమే: చివరిది, ముఖ్యమైంది. మన ఆనందం కోసమే లాంగ్‌టూర్లు. అప్రమత్తంగా ఉండటం, జాగ్రత్తలు తీసుకోవడమూ మన బాధ్యత. ఇవి పాటించినప్పుడే ప్రయాణం సుఖవంతమవుతుంది.

బండి ఎంపిక: ప్రయాణంలో బండి ఎంపిక ముఖ్యం. 500 కిలోమీటర్ల ప్రయాణాన్ని కమ్యూటర్‌ బండితో చేరుకుంటానంటే కుదరదు. వెయ్యి కి.మీ.లు దాటితే లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, అత్యధిక సీసీ ఉన్న బైక్‌ ఎంచుకోవాలి.

మనకు అనుకూలం

మనదేశంలో రకరకాల వాతావరణ సీజన్లు ఉండటంతో ఒకట్రెండు నెలలు తప్ప సంవత్సరం పొడవునా రైడింగ్‌ చేయొచ్ఛు పదేళ్ల కిందట హైదరాబాద్‌లో వందమంది బైకర్లు ఉంటే ఇప్పుడు పదివేలమంది తయారయ్యారు. నలభై వరకు బైక్‌ రైడింగ్‌ క్లబ్‌లున్నాయి. తమకు నచ్చిన ప్రదేశాలను చుట్టిరావాలనుకునే ఔత్సాహికులకు బైక్‌ రైడింగ్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఉద్యోగ ఒత్తిడిలో ఉన్నవాళ్లు మానసిక ఉల్లాసానికి దీన్ని మార్గంగా భావిస్తే, అడ్వెంచర్‌ టూర్‌ చేసినవాళ్లు దీన్నో విజయంగా భావిస్తారు. ప్రకృతికి దగ్గర కావాలి, కొత్త ప్రదేశాలు తిరిగి రావాలి అనుకునే కాలేజీ విద్యార్థులు, కార్పొరేట్‌ ఉద్యోగులు పెరిగిపోతున్నారు. స్వతహాగా కొందరికి బైక్‌ రైడింగ్‌ ఇష్టం. ఇవన్నీ కలిపి లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.

- కె. వరుణ్‌నాయుడు, బైకర్‌

మన బడ్జెట్లో..

దూరప్రయాణాలకు అనుకూలంగా, మంచి ఫీచర్లతో, బడ్జెట్లో అనువైన ద్విచక్రవాహనాలివి.

మహీంద్రా మోజో ఎక్స్‌టీ300

విభాగం: స్ట్రీట్‌, సామర్థ్యం: 295సీసీ

21 లీటర్ల భారీ ఇంధన ట్యాంకు దూరప్రయాణాలకు అనుకూలం. స్థిరమైన భంగిమ, వెడల్పాటి సీట్లు, డబుల్‌ బ్యారెల్‌ హెడ్‌ల్యాంప్‌లు, రెండు చక్రాలకు ఏబీఎస్‌.. దూర ప్రయాణానికి అనుకూలమైన ఫీచర్లు.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ థండర్‌బర్డ్‌

విభాగం: క్రూజర్‌, సామర్థ్యం: 346సీసీ

దూరప్రయాణాలకు అనువుగా తీర్చిదిద్దిన బండి థండర్‌బర్ఢ్‌ వెన్నెముకపై భారం పడకుండా కూర్చునే భంగిమ సౌకర్యవంతంగా ఉంటుంది. నిటారైన హ్యాండిల్‌బార్‌, ముందుకు సాగిన ఫుట్‌ పెగ్స్‌, కుషన్డ్‌ సీట్లతో ఎంత దూరం ప్రయాణించినా అలసటే ఉండదు. ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌లు, రెండు చక్రాలకు ఏబీఎస్‌ రైడింగ్‌ని తేలిక చేస్తాయి.

బజాజ్‌ డోమినర్‌ 400

విభాగం: క్రూజర్‌, సామర్థ్యం: 373సీసీ

టూరర్లు ఎక్కువగా ఇష్టపడే ద్విచక్రవాహనం. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, టర్న్‌ ఇండికేటర్లు, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, వెడల్పాటి సీట్లు దూరప్రయాణాన్ని తేలిక చేస్తాయి. లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, సింగిల్‌ సిలిండర్‌, 39.5బీహెచ్‌పీ, 35ఎన్‌ఎం టార్క్‌.. స్లిప్పర్‌ అసిస్ట్‌ క్లచ్‌, రెండు చక్రాలకు ఏబీఎస్‌.. భద్రతకు భరోసాగా ఉంటాయి.


బజాజ్‌ అవెంజర్‌ క్రూజ్‌ 220

విభాగం: క్రూజర్‌, సామర్థ్యం: 220సీసీ

పొడవాటి విండ్‌షీల్డ్‌, తక్కువ ఎత్తులో సీటు, ముందుకు అమర్చిన ఫుట్‌ పెగ్స్‌, వెడల్పాటి హ్యాండిల్‌బార్‌.. దూర ప్రయాణాలకు సరిపోయే మోటార్‌సైకిల్‌గా చెప్పుకోవచ్ఛు 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో పని చేసే ఈ బండికి సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ ఉంది.


కావాసాకీ వెర్సీస్‌ 650

విభాగం: స్ట్రీట్‌, సామర్థ్యం: 649సీసీ

దూరప్రయాణాలకోసమే ప్రత్యేకంగా తయారైన బండి. లాంగ్‌ అడ్జస్టబుల్‌ సస్పెన్షన్‌, వెడల్పాటి సీట్లు, గాలిని అడ్డుకునే విండ్‌స్క్రీన్‌, 21లీటర్ల భారీ ఇంధన ట్యాంకు రైడర్లు ఇష్టపడే ఫీచర్లు. వెడల్పాటి హ్యాండిల్‌బార్‌, రెండు చక్రాలకు ఏబీఎస్‌ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌

విభాగం: స్ట్రీట్‌ సామర్థ్యం: 411సీసీ

ఎలాంటి రోడ్లపై అయినా దూసుకెళ్లడానికి, దూరప్రయాణాల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన బండి హిమాలయన్‌. పొడవైన సస్పెన్షన్‌, సౌకర్యవంతమైన సీట్లు, ఆన్‌బోర్డ్‌ మాగ్నెటిక్‌ కంపాస్‌, వెడల్పైన హ్యాండిల్‌బార్‌, 15 లీటర్ల ఇంధన ట్యాంకు.. లాంగ్‌డ్రైవ్‌కి సరిగ్గా సరిపోతాయి. 24.5బీహెచ్‌పీ, 32ఎన్‌ఎం టార్క్‌, రెండు చక్రాలకు ఏబీఎస్‌ సాంకేతిక, భద్రతాంశాలు.


కేటీఎం 390 డ్యూక్‌

విభాగం: స్ట్రీట్‌, సామర్థ్యం: 373సీసీ

ఇది నేక్డ్‌ మోటార్‌సైకిల్‌. పనితీరు, హ్యాండ్లింగ్‌, ఫీచర్లు.. అన్నింట్లో మేటినే. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వెడల్పైన హ్యాండిల్‌బార్‌లు, డిజిటల్‌ టీఎఫ్‌టీ తెర, స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానమయ్యే కన్‌సోల్‌, స్లిప్పర్‌ అసిస్ట్‌ క్లచ్‌, రెండు చక్రాలకు ఏబీఎస్‌.. రైడర్లు కోరుకునే హంగులెన్నో ఉన్నాయి.Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని