close

తాజా వార్తలు

Published : 12/03/2020 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అల్లుడి సంబరం... ఆడపడుచు ఆదరం!

ఈనెల 22 నుంచి శ్రీశైల ఉగాది మహోత్సవాలు

ఉగాది అంటే కొత్త ఏడాదికి స్వాగతం పలకడం. ఈ విషయం మనందరికీ తెలిసిందే.
అన్ని గుళ్లు, గోపురాలు భక్తులతో నిండిపోవడమూ మనం చూసేదే... కానీ, వారికి మాత్రం ఆరోజు ఎంతో ప్రత్యేకం...
తమ ఆడపడుచును చూడ్డానికి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది ఆరోజు తరలివస్తారు. అల్లుడిని గౌరవించడం కోసం కొండలు, అడవులు కాలినడకన దాటి వస్తారు.
వారిని చూసిన ఆనందంలో భక్త్యావేశాలతో ఊగిపోతారు.
అందుకే ఆ రోజు మల్లికార్జునుడి సన్నిధి తాండవం చేస్తున్న పారవశ్యంలా కనిపిస్తుంది. ఇది శ్రీశైలంలోని ఉగాది ఉత్సవాల గురించి..

ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతాన్ని అప్పుడు మహీసుర రాజ్యమని పిలిచేవారు.
దాని పాలకుడు మహీసుర రాజు. గొప్ప శివభక్తుడు.
శ్రీశైల మల్లికార్జునుడికి పరమ భక్తుడు!!

ఆ రాజుకు ఎంతో కాలం తర్వాత శివానుగ్రహం వల్ల  ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు మల్లిక అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచారు.

మల్లిక ఎదిగే కొద్దీ తండ్రి మాదిరిగానే శివభక్తి అలవడింది. మల్లికార్జునుడిని ఇష్టదైవంగా భావించి పూజించేది.

చిన్నవయసులోని ఇష్టం యుక్త వయసు రాగానే ప్రేమగా మారింది. మల్లికార్జునుడే తన భర్త అనుకుంది.

ఆయనపై అలాగే అనురాగం, ఆరాధన పెంచుకుంది.

తల్లిదండ్రులు వరుడి కోసం అన్వేషిస్తుంటే పరమశివుడే తన భర్త అని తెగేసి చెప్పింది.

ఆ పరమశివుడైనా ఆమె మనసు మార్చుతాడని ఆమెను శ్రీశైలం తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అక్కడ కుమార్తెతో ఎన్నో పూజలు చేయించారు. మంచి మాటలు చెప్పారు. జ్యోతి స్వరూపుడైన స్వామిని వివాహం చేసుకోవడం సాధ్యంకాదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయినా ససేమిరా అంది మల్లిక. స్వామి తనకు సర్వంగా భావించి ఆలయంలో సేవలో మునిగిపోయింది. కొద్దిరోజుల తర్వాత మల్లికార్జునుడు కరుణించాడు. ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు.

దీంతో మహీసుర రాజు సాక్షాత్తు భ్రమరాంబే తన కుమార్తెగా జన్మించిందని భావించాడు. మల్లన్ననూ అల్లుడిగా గౌరవించాడు. రాజుతో పాటే ఆ రాజ్య ప్రజలు కూడా భ్రమరాంబను ఆడపడుచుగా, మల్లికార్జునుడిని అల్లుడిగా భావించారు. నూతన సంవత్సరంనాడు వారికి సారెపెట్టడం వారికి సంప్రదాయంగా మారింది. ఇక్కడ జగన్మాతేే తమ ఆడపడుచు! దేవదేవుడే తమ అల్లుడు. అందుకే నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాదినాడు కన్నడిగులు శ్రీశైల భ్రమారాంబ, మల్లికార్జునులను దర్శించుకుని సారె సమర్పిస్తారు. మల్లిక పుట్టింటి నుంచి లక్షలాది మంది హాజరయ్యే ఉగాది ఉత్సవం శ్రీశైలంలో ఒక ప్రత్యేక మహోత్సవంగా కొనసాగుతోంది. నిజానికి ఏ శైవ క్షేత్రంలోనూ ఉగాదిని ప్రత్యేకంగా చేయరు. ఒక్క శ్రీశైలంలో మాత్రం ఆనందోత్సాహాలతో జరుగుతుంది. 


5 రోజుల పాటు...

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అయిదు రోజుల పాటు జరుగుతాయి. ఉగాదికి మూడు రోజుల ముందు ఫాల్గుణ మాసం బహుళ పక్ష త్రయోదశినాడు ప్రారంభమై, ఉగాది మరుసటి రోజు అంటే ఛైత్రశుక్ల విదియ వరకు ఇవి కొనసాగుతాయి.

* కర్ణాటక భక్తులు తాము ఆడపడుచుగా భావించే అమ్మవారికి అనేక కానుకలను సమర్పిస్తారు. అదే సమయంలో అమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారు. మొదటి రోజు మహాలక్ష్మి, రెండో రోజు మహాదుర్గ, మూడోరోజు మహా సరస్వతి, నాలుగో రోజు ఉగాది నాడు రమావాణి సేవిత రాజరాజేశ్వరీదేవి, అయిదోరోజు భ్రమరాంబగా అమ్మ దర్శనమిస్తారు..
* భక్తులు సారె సమర్పించే క్రమంలో వడిబియ్యం పోస్తారు. మైనారులు అనే భక్తులు అమ్మకు పసుపు, కుంకుమ, చీర, మంగళసూత్రాలు, పూలు, వడిబియ్యం సమర్పిస్తారు.
* ఉగాది నాటి రాత్రి వీరశైవ ఉత్సవాలు జరుగుతాయి. ఆలయం ముందు అగ్ని గుండం ఏర్పాటుచేసి భక్తులు నడుస్తారు. గణాచారులనే భక్తులు వీరాచార విన్యాసాలు నిర్వహిస్తారు.
* కర్ణాటక నుంచి వచ్చే భక్తులు కొందరు కావడిని తెస్తారు. ఇరువైపులా నంది విగ్రహాలున్న కావిళ్లను భజాలపై మోసుకుంటూ స్వామి సన్నిధికి చేరుకుంటారు. వీటిని నంది కావిళ్లంటారు.
* శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తులు వందల కిలోమీటర్లు కాలినడకనే రావడం ఇక్కడ విశేషం. ఇందులో కర్ణాటక నుంచే కాకుండా సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పాల్గొంటారు.

  - ఐఎల్‌ఎన్‌.చంద్రశేఖరరావు


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని