close

తాజా వార్తలు

Updated : 15/03/2020 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కార్డు లాభాలు వదలొద్దు...

మన చేతిలో డబ్బు లేకున్నా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించేది క్రెడిట్‌ కార్డు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిపై ఆధారపడే వారి సంఖ్య ఎంతో పెరిగింది. ఇది ఇచ్చే ప్రయోజనాలపై పూర్తి అవగాహన ఉంటేనే... అది మనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది.

వడ్డీ లేని వ్యవధి
క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లు చేసినప్పుడు 18-55 రోజుల వరకూ వడ్డీ లేని వ్యవధి లభిస్తుంది. ఇది మీరు కొనుగోలు చేసిన తేదీ, క్రెడిట్‌ కార్డు బిల్లు తేదీని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలనుకున్నప్పుడు బిల్లింగ్‌ తేదీ ముగిసిన మర్నాడు చేయాలి. అప్పుడు మీకు గరిష్ఠంగా వడ్డీ లేని వ్యవధి లభిస్తుంది. ఒకటికి మించి కార్డులు ఉన్నప్పుడు.. వాటికి వేర్వేరు చెల్లింపు తేదీలు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బిల్లు మొత్తం వ్యవధిలోపు చెల్లిస్తేనే వడ్డీ పడదు. కొంత బాకీ ఉన్నా.. రుసుములు తప్పవు.

వాయిదాల్లోకి మార్చుకోండి
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు, ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం వీలుకాకపోతే.. బిల్లింగ్‌ తేదీకి ముందే దాన్ని వాయిదాల్లోకి మార్చుకోండి. అప్పుడు బిల్లును 3-48 నెలల్లో చెల్లించేందుకు వీలవుతుంది. ఒక్కోసారి బిల్లు మొత్తం చెల్లించలేని పరిస్థితి రావచ్చు. ఇలాంటప్పుడు మొత్తం బిల్లునూ వాయిదాల్లోకి మార్చుకునే సదుపాయాన్ని కొన్ని కార్డు సంస్థలు కల్పిస్తున్నాయి. మీ బ్యాంకును సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.

క్రెడిట్ స్కోరు జాగ్రత్త
క్రెడిట్‌ కార్డుతో ఏదైనా కొంటున్నామంటే.. రుణం తీసుకోవడంతో సమానం. కాబట్టి, ఈ లావాదేవీలన్నీ క్రెడిట్‌ బ్యూరోలకు సమాచారం ఇస్తాయి బ్యాంకులు. కాబట్టి, మీరు బిల్లులను చెల్లించడంలో ఆలస్యం చేస్తే.. దీని ప్రభావం మీ క్రెడిట్‌ స్కోరుపై పడుతుంది. కార్డు పరిమితిని మొత్తం వాడినప్పుడూ క్రెడిట్‌ స్కోరు తగ్గే అవకాశం ఉంది. మీ కార్డు రుణ పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదు. ఎక్కువగా వాడుతూ ఉంటే.. అప్పులపైనే ఆధారపడుతున్నారని భావిస్తాయి బ్యాంకులు. ఇలాంటప్పుడు కొత్తగా ఏమైనా రుణాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురుకావచ్చు. వడ్డీ రేట్లూ అధికంగా విధిస్తాయి.

రుణం తీసుకోవచ్చు
మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులు రుణాలను అందిస్తుంటాయి. ఇవి ముందుగానే మంజూరవుతాయి కాబట్టి, ప్రత్యేకంగా ఎలాంటి పత్రాలనూ బ్యాంకులు అడగవు. వేగంగా రుణం లభిస్తుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటికి 1-2.5శాతం వరకూ అధిక వడ్డీ ఉంటుంది. అత్యవసరాల్లో మాత్రమే దీన్ని తీసుకోండి.

- సహీల్‌ అరోరా, గ్రూప్‌ హెడ్‌, paisabazaar.com


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని