close

తాజా వార్తలు

Published : 16/03/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుస్తెంత పుస్తకాలు!

పుస్తకాలు ఎంతుంటాయి. దాదాపు మన చేతుల్లో పట్టేంత ఉన్నాయి. కొన్నేమో మనం మోయలేనంత బరువుంటాయి. కాని కొన్ని పుస్తెంతుండే పుస్తకాలూ ఉంటాయి! వీటినే మినియేచర్‌ బుక్స్‌ (సూక్ష్మ పుస్తకాలు) అంటారు. మన దేశంలో భువనేశ్వర్‌కు చెందిన సిద్ధార్థ్‌ మొహంతీ దగ్గర ఇలాంటి బుల్లి బుల్లి పుస్తకాలు నాలుగువేలకు పైగానే ఉన్నాయి. మినియేచర్‌ పుస్తకాలంటే కొన్ని నియమాలుంటాయి.. అంటారీయన. చదవగలిగేలా అక్షరాలుండాలి. పొడవు, వెడల్పుల్లోనూ గరిష్ఠంగా మూడు అంగుళాలు ఉండాలి. 2003లో ఈయన చెన్నైలో ఓ పుస్తకాల దుకాణంలో ఓ చిన్న భగవద్గీత పుస్తకాన్ని చూసి ముచ్చటపడి కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఇలాంటి పుస్తకాల కోసం అన్వేషణ ప్రారంభించారు. 2010లో అమెరికాకు చెందిన మినియేచర్‌ బుక్‌ సొసైటిలో సభ్యుడిగా చేరారు. అప్పటి నుంచి ఈయన కలెక్షన్‌ విపరీతంగా పెరిగింది. చాలా పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి మరీ తెప్పించుకునేవారు.

లాకెట్‌లా మెడలో... ఈయన దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలకు లోహాలతో తయారైన చిన్న చిన్న పెట్టెలున్నాయి. వీటిని ఏకంగా లాకెట్‌లా మెడలో వేసుకోవచ్చు. ఈ పెట్టెలకే ఉండే భూతద్దంతో ఎంచక్కా చదివేయొచ్చు. 100వరకు భగవద్గీత గ్రంథాలు, వందల్లో బైబిల్‌ పుస్తకాలున్నాయి. 20 భాషల్లో దాదాపు 300 డిక్షనరీలున్నాయి. 19వ శతాబ్దానికి చెందిన ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన డిక్షనరీ సైతం ఈయన దగ్గర ఉంది. దీని పొడవు 1.12 అంగుళాలు, వెడల్పు 0.5 అంగుళాలు మాత్రమే. షేక్స్‌పియర్‌ సాహిత్యానికి సంబంధించి 300 వరకూ పుస్తకాలున్నాయి. కేవలం ఇవే కావు. చేతితో రాసిన మినియేచర్‌ ఇథియోపియన్‌ బైబిల్‌, జొరాస్ట్రియన్ల పవిత్ర గ్రంథమైన కుర్దేఅవస్తా గ్రంథాలూ ఉన్నాయి. ఆసియాలోకెల్లా ఎక్కువ మినియేచర్‌ పుస్తకాలు కలిగి ఉన్న వ్యక్తిగా ఈయన పేరిట రికార్డూ ఉంది.
ఈ మినియేచర్‌ పుస్తకాలు 15వ శతాబ్దం నుంచే వాడుకలో ఉన్నాయి. అప్పట్లో ఎక్కువగా మత గ్రంథాలను ఇలా ముద్రించేవారు. 19, 20 శతాబ్దాల్లో గ్లాస్కో డేవిడ్‌ బ్రైసెన్‌ అండ్‌ సన్‌ కంపెనీ వారు ఈ బుల్లి పుస్తకాలను ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. నిజానికి క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.2000 సంవత్సరాల మధ్య సుమేరియన్‌ నాగరికతలో రాతిపై సూక్ష్మంగా చిత్రాలు, రాతలు చెక్కేవారు. వీటి స్ఫూర్తితోనే ఈ మినియేచర్‌ పుస్తకాలు వాడుకలోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతుంటారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని