
తాజా వార్తలు
సమాజాభివృద్ధులు
చదువుకోవాలనిపిస్తే... గ్రంథాలయం
దేవునికి మొక్కాలంటే... పూజ గది
వైద్యం అవసరమైతే... ఆసుపత్రి
ప్రశాంతత కావాలంటే... ధ్యానమందిరం
ఆకలేస్తే భోజనం... నిద్రొస్తే వసతి..
ఇన్ని సౌకర్యాలు ఎక్కడండీ బాబు అంటారా? అయితే శ్రీకాకుళంలోని ‘ప్రశాంతి వృద్ధ జనాశ్రమం’ వెళ్లాల్సిందే.
ఉద్యోగ రీత్యా ఇంతకాలం తీరికలేకుండా ఉన్న బూరవిల్లి కృష్ణమూర్తి పదవీ విరమణ పొందాక ఏం చేయాలని ఆలోచించారు. మిత్రుడు ఎంఎన్ శర్మ, ఇతరుల సాయంతో శ్రీకాకుళం వయోధికుల సంఘంగా ఏర్పడ్డారు. సంఘంగా ఏర్పడితే చాలా? తమవంతుగా ఏదో సేవ చేయాలి కదా? అని ఆలోచించారు. వృద్ధాప్యం విలువ తెలిసిన వారంతా... నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు అండగా నిలవాలనుకున్నారు. పేర్ల సాంబమూర్తి, రమాదేవి దంపతులు స్థలాన్ని ఇవ్వగా, అనేకమంది దాతల సహకారంతో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. 1996లో ప్రశాంతి వృద్ధ జనాశ్రమం ఏర్పాటు చేశారు. 20మందితో ప్రారంభమైన ఆశ్రమంలో ఇప్పుడు అనేక మంది ఆదరణ పొందుతున్నారు.
* వయోధికుల సంఘంలో మొత్తం 700 మంది సభ్యులున్నారు. వారంతా పదవీ విరమణ పొందిన వారే కావడం విశేషం. ఆశ్రమ నిర్వహణ నిమిత్తం కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ప్రస్తుతం సోమేశ్వరరావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆశ్రమ స్థాపకులు కృష్ణమూర్తి 2011లో మరణించాక ఆయన మేనల్లుడు యూవీ రమణ, కుమారుడు బీఏఎల్ ప్రసాద్ దీని బాధ్యతలు చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000లో ఉత్తమ ఆశ్రమంగా దీనికి పురస్కారం లభించింది. వయోధికుల సంఘం ఇంతటితో ఆగిపోలేదు. సమాజహితం, ఆధ్యాత్మికతలపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మంచి పౌరులను దేశానికి అందించే కార్యక్రమం చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారీ వృద్ధులు. సమాజాభివృద్ధులు.
ఆశ్రమంలో 55-75 ఏళ్ల వయస్కులనే చేర్చుకుంటారు. ఎక్కువగా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. రోజు పౌష్టికాహారం అందజేస్తారు. ఆదివారం నాడు గ్రీవెన్స్ డే నిర్వహిస్తారు. ప్రతినెల మొదటి వారంలో హాస్య క్లబ్బులను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో వినోదంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి, వృద్ధులకు సాంత్వన చేకూరుస్తారు.