close

తాజా వార్తలు

Updated : 25/03/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శార్వరిలో... నవ నాయికలు!

చైత్రహాసం ఎక్కడా లేదు.

కోయిల కుకూ.. అన్నా కరోనా అన్నట్టుగా వినిపిస్తోంది.

వికారి మిగిల్చిన వికారం సోకి.. శార్వరి వర్రీగానే మొదలైంది.

అవమానం ఉన్న చోటే రాజపూజ్యం ఉంటుంది. వ్యయం పక్కనే ఆదాయమూ ఉంటుంది. పండగ పూట నెలకొన్న ఈ సంకట స్థితి.. త్వరలోనే మాయమవుతుందని ఆశిద్దాం. పంచాంగంలో వివిధ ఆధిపత్యాలు పొందిన నవనాయకులు గతి తప్పిన కాలాన్ని గాడిలో పెడతారని విశ్వసిస్తారు. ఇరుసు విరిగిన బతుకు బండిని తరుణి చక్కదిద్దాల్సిన తరుణమిది. పండగపూట ద్వారానికి కట్టిన తారామణి హారం వాడకుండా.. నవనాయికగా మారాల్సిన సందర్భమిది.

శార్వరి అంటే రాత్రి, చీకటి అని అర్థం. కరోనా తాకి ఇప్పుడు ప్రపంచమంతా చింతాక్రాంతమై చిన్నబోయింది. ఆ తిమిరాన్ని తరిమికొట్టడానికన్నట్టు ఈ దఫా నవనాయకుల్లో శుభగ్రహాల ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. ఈ చింతను దూరం చేయడానికి ఇంతులే ముందుకురావాలి. తమకే సొంతమైన మల్టీటాస్కింగ్‌ను మనసుపెట్టి చేయాలి. మునుపెన్నడూ లేనంత దీక్షతో ఉండాలి. ఇంతకీ ఏం చేయాలంటే...


ఆర్థికానికి మంత్రిగా

రోనా దెబ్బకు షేర్‌ మార్కెట్లే బేర్‌మంటున్నాయి. పంచాంగంలో ఆదాయ వ్యయాల పట్టికకు.. ఇప్పుడున్న పరిస్థితికి బొత్తిగా పొత్తు లేకుండా ఉంది. ఆర్థికాంశాలు ఆటుపోట్లకు గురవుతున్న వేళ.. ఆవిడే ఆర్థికవేత్త కావాలి. ఈ సంవత్సరానికి రాజు బుధుడు. ఈయనగారు చాలా చలాకీ. అంతకుమించిన పొదుపరి. ఇదే లక్షణం ప్రతి ఇల్లాలూ అలవాటు చేసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి. ఆర్థికాంశాల్లో ముందూవెనకా ఆలోచించాలి. రూపాయి రూపాయికీ కాపాయం చేయాలని కాదు కానీ, దుబారా తగ్గించేలా చూడాలి. నయానో భయానో.. ఆర్థిక వ్యవహారాలన్నీ తన అదుపులోనే ఉండేలా చూసుకోవాలి.


బంధాలకు చుక్కానిలా..

దాయం ఒడిదొడుకుల్లో పడితే.. దాని ప్రభావం అన్యోన్యతపై పొడ చూపుతుంది. ఒత్తిళ్లు ఆనుబంధాన్ని చిత్తు చేస్తుంటాయి. అన్యోన్యత నిత్యనూతనంగా ఉండాలంటే ‘సర్దుకుపోదాం రండి’ సూత్రాన్ని ఎంచుకోండి. ఆయనగారూ దీన్ని పాటించాల్సిందే! సరదాగా అనే మాటలూ.. కోటలు దాటకుండా చూసుకోండి. ఆర్థికమంత్రిగా పైచేయి సాధించగలిగితే.. అనురాగాలూ శ్రుతిలోనే సాగుతాయి. ఈ విషయంలో శుక్రుడిని ఫాలో అయిపోవచ్ఛు కళల రేడు, కలల వాడు ఈయన. ఎప్పుడు ఏ కళను ప్రదర్శించాలి, ఏ కలను నెరవేర్చుకోవాలో ఆలుమగలిద్దరికీ తెలిసుండాలి. తగువైనా వినోదంగా ఉండాలి. కలహంలోనూ ప్రణయం ఉండాలి.


ఆరోగ్యానికి అధిదేవతగా..

ల్లి మేలు చేయాలన్నా.. తల్లి వండాల్సిందే! బిడ్డడు అడ్డం పడితేనే అష్ట దిగ్బంధనం చేసే అమ్మ.. మహమ్మారులు చుట్టుముట్టిన ఈ సమయంలో.. ఇంకెంత జాగ్రత్తగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లల విషయంలోనే కాదు.. కట్టుకున్న వాడి విషయంలో, కన్నవారి గురించి.. ఆమెలా ఇంకెవరూ ఆలోచించరు. వారి ఆరోగ్యం కోసం అహరహం తపిస్తుంది. ఇంట్లోవాళ్లకు సమతుల ఆహారం అందించాలి. పాక ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూనే.. పోషకాల విలువలు ఉండేలా చూసుకోవాలి. సూర్యుడు విటమిన్‌ డి ఇస్తే.. మిగతా విటమిన్లన్నీ అందించే అమ్మ ఆదిత్యుడి కన్నా ఆధిక్యంలోనే ఉంటుంది మరి.


చదువుకు శార్వాణిగా..

పిల్లల సంరక్షణ గురించి తల్లులకు ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. మారిన కాలమాన పరిస్థితుల్లో తల్లి బాధ్యత చాలా పెరిగింది. ఆయన చూసుకుంటాడులే అనుకోవద్ధు పిల్లలకు తల్లిని మించిన ధైర్యం లేదు. ఆ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అమ్మదే! చదువులో, కెరీర్‌లో, వారి సంరక్షణలో అన్నింటా ఆమె ముందుండాలి. తొలి గురువైన తల్లి.. తన పాత్రను మరింత సమర్థంగా పోషించాల్సిన సమయమిది. పరిపూర్ణ శుభగ్రహంగా పేరున్న గురువును ఆదర్శంగా తీసుకొని పిల్లల సంపూర్ణ విజయంలో కీలకంగా వ్యవహరించాలి.


స్వచ్ఛతకు సేనానిగా..

రిశుభ్రత.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇదే! ప్రపంచాన్నంతా గడగడలాడిస్తున్న కరోనాను వ్యక్తిగత పరిశుభ్రతతోనే కట్టడి చేయొచ్చని చెబుతున్నారు. ఆ విషయంలో ఇల్లాలు మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే! పరిశుభ్రత గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్పాలి. జీవన విధానంలో దాన్నొక భాగంగా చేయాలి. ఈ బాధ్యత నిర్వహణలో కుజుడిని ఆదర్శంగా తీసుకోవచ్ఛు సైన్యాధ్యక్షుడిగా పేరున్న అరుణ గ్రహం ఆగ్రహిస్తూనే అనుగ్రహిస్తుంటాడు. పరిశుభ్రత విషయంలో మీ ఆగ్రహం భవిష్యత్తుకు అనుగ్రహం అవుతుందని మరచిపోకండి.


ఆ గుడిలో దేవత..

మ్మకాల మాట అటుంచితే.. ఆధ్యాత్మిక సాధనతో ఫలితాలు ఎలా ఉన్నా మనసు కుదుటపడుతుంది. పురుషుడైతే సమయం తీరు సంధ్యవారుస్తాడేమో గానీ, గృహిణి ఎంత కష్టంగా ఉన్నా ఇష్టదైవాన్ని స్మరించకుండా ఉండదు. మంత్రాల్లోని ధనాత్మక శక్తి ఇంటిని కాపాడుతుంది. మీ బాటలోనే ఇంట్లో వాళ్లంతా నడిచే అవకాశమూ ఉంది. ఆధ్యాత్మికతకు కేతువు కారకుడని చెబుతారు. ఆయన అనుగ్రహం ఎలా ఉన్నా.. మీ ప్రయాణం భక్తితో ముడిపడితే అందరికీ మంచిదే కదా!!


శ్రమకు శ్రీలక్ష్మిగా..

‘శ్రమయేవ జయతే’ ఏ కాలానికైనా అక్షర సత్యం. ఈ రోజుల్లో ఒక ఇల్లు గడవాలంటే భార్యాభర్తలిద్దరూ కొలువుల్లో కుదురుకోవాల్సిందేనని అనుకునేవారే ఎక్కువ. రెండు చేతులూ సంపాదిస్తేనే అన్నీ సక్రమంగా సాగుతాయి. ఇంటి బాధ్యతలు చక్కబెడుతూనే.. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం మహిళకు అదనపు భారమే! అందులోనూ ఆమె మిస్‌ అండ్‌ మిసెస్‌ పర్‌ఫెక్ట్‌ అని నిరూపించుకున్న సందర్భాలెన్నో. కాకపోతే శ్రమను ఓర్చుకోవాల్సిందే. ఒత్తిళ్లను అధిగమించాల్సిందే. శనైశ్చరుడు శ్రమజీవుల ఆరాధ్య దైవం. అతడు శ్రామిక వర్గానికి ప్రతినిధి. అతగాడి అనుగ్రహం జతకలిస్తే.. శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోదు.


కాంతిగా.. శాంతిగా..

ల్లన్నాక నలుగురూ నాలుగు రకాలుగా ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా.. బలవంతంగా ఒప్పించకుండా సంసార సాగరం ఈదాలి. ఇందుకు అవనిని మించిన ఓపిక వనిత సంపాదించుకోవాలి. ప్రశాంతంగా పనులు చక్కబెట్టాలి. ఆవేశాలు కట్టలు తెంచుకుంటున్నా.. కుటుంబ సంక్షేమం కోసం శాంతాన్ని కోల్పోరాదు. చంద్రుడిని మించిన వెన్నెల ఒలికించాలి.


దేశానికి దారి దీపంగా..

మెరుగైన సమాజానికి బీజం పడేది ఇంట్లోనే. ఆ ఇల్లు సమాజహితం కోరేలా చేయాల్సిన బాధ్యత ఇల్లాలిదే. పిల్లలకు ఉన్నత విద్య చెప్పించడమే కాదు.. ఉన్నత విలువలు, సామాజిక బాధ్యత నేర్పాల్సింది అమ్మే! ఇది సాధ్యమవ్వాలంటే అట్నుంచి నరుక్కురావాలి. ఇంట్లో మర్యాదస్థుల్లా వ్యవహరించే పిల్లలు బయట ఎలా ఉంటున్నారో తెలివిగా గమనించగలగాలి. ఈ విషయంలో రాహు గ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవచ్ఛు ఈయనగారు చడీచప్పుడు లేకుండా ఎదుటి గ్రహాన్ని కప్పేస్తుంటాడు. ఆ గ్రహం లక్షణాలన్నీ తెలుసుకోగలుగుతాడు. తల్లులూ... మీరూ ఇదే పాటించేయండి మరి.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని