close

తాజా వార్తలు

Updated : 31/03/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిత్య ఆదర్శం వారి దాంపత్యం

భర్తకు దూరమై అశోకవనంలో శోక సంద్రంలో మునిగి ఉంది సీతమ్మ. ఆమెని చూసిన ఆంజనేయుడు అనుకున్న మాట ఇది. ‘‘అస్యా దేవ్యా మనస్తస్మిన్‌, తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్‌/ తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి’’. ప్రాణానికి ప్రాణమైన సీతారాములు తమ ఎడబాటును భరించి ఎలా జీవించారన్నదానికి సమాధానమే ఇది. రాముడి మనసులో సీత, జానకి మనసులో రఘుపతి గట్టిగా తిష్ఠ వేసుకుని కూర్చున్నారు కాబట్టే అది సాధ్యమైందట. సుందరకాండలో వచ్చే ఈ శ్లోకం సీతారాముల అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని కడగండ్లు ఎదురైనా వారి మనసుల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న అనురాగం చెరగలేదు. అదే వాళ్లని ఆదర్శ దంపతులుగా నిలిపింది. తరాలు మారినా, యుగాలు జరిగిపోతున్నా సీతారాములకు అదే ప్రత్యేకతనిచ్చింది.
లోకానికి ఆది దంపతులు శివపార్వతులైతే ఆదర్శ దంపతులు మాత్రం సీతారాములే. శివుడు సతీదేవికి తన దేహంలో సగభాగమిచ్చి భర్తగా తిరుగులేని కీర్తి సంపాదించాడు. కానీ, గౌరమ్మకు పోటీగా గంగమ్మను తల మీద తెచ్చిపెట్టుకున్నాడు. ఒక్క శివుడని ఏంటి, మన దేవుళ్లందరికీ దాదాపు ఒకరికి మించి పత్నులు. అయితే, రాజాధిరాజు, మనిషి రూపంలో ఉన్న దైవం రాముడు అలా కాదు. ఆయన జీవితంలో సీతమ్మ ఒక్కరికే స్థానం. ఆయన ప్రేమ, మనసు అన్నీ ఒక్క వైదేహికే సొంతం. రాముని పేరు చెప్పగానే ‘సీతను అడవులపాల్జేశాడు’ అని అంటుంటారు చాలా మంది. రాముడు మంచి భర్త, అలాగే ఆదర్శవంతమైన రాజు కూడా. ఆ రాజ ధర్మానికి కట్టుబడే తప్పనిసరి పరిస్థితుల్లో కంటికి రెప్పలా కాచుకున్న భార్యామణిని కానలకు పంపించాడు. కానీ, సీత దూరమై రాఘవుడు ఎంతగా విలపించాడో రామాయణాన్ని చూస్తే అర్థమవుతుంది. రాక్షస రావణుడు ముని వేషంలో సీతను అపహరించినప్పుడు కూడా కౌసలేయుడు కుమిలి కుమిలి విలపించాడు. వృక్షాలు, జంతువులను సీత జాడ అడుగుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రాణసఖి దూరమైన బాధను తాళలేక మూర్ఛపోయాడు కూడా. వీరాధివీరుడు, యోధానుయోధుడైన దాశరథి అంతలా తల్లడిల్లిపోవడం చూస్తే జానకి మీద ఆయనకున్న ప్రేమ అర్థమవుతుంది.
సీత కూడా సతతమూ భర్తే తన సర్వస్వం అనుకుంది. అడవులకు వెళ్లే సమయంలో అయోధ్యలోనే ఉండమని రాముడు ఎంతగా బతిమాలినా ఒప్పుకోలేదు. భర్త కష్టసుఖాల్లో భార్య ఒక్కటే తోడుంటుందని ధర్మసూక్ష్మాలు గుర్తు చేసింది. ‘మీరు నన్ను ఆపలేరు’ అని తెగేసి చెప్పింది. సిరి సంపదల్లో పుట్టి పెరిగిన ఆమె నారవస్త్రాలు ధరించి కానలకు కదిలింది. బంగారు లేడి రూపంలోని మాయావి మారీచుడు ‘హా లక్ష్మణా, హా సీతా’ అని అరచినప్పుడు సీత తల్లడిల్లిపోయింది. తన భర్త తిరుగు లేని వీరుడన్న విషయం మర్చిపోయి సగటు ఇల్లాలిగా మాట్లాడింది. ‘రాముడు లేకుంటే ఈ భూమ్మీద క్షణం కూడా జీవించలేను, గోదావరిలో దూకుతాను, విషం తాగుతాను’ అంటూ సౌమిత్రిని ఒత్తిడి చేసి పంపించింది. దశకంఠుడు తన వైభోగం అంతా చూపించి మభ్యపెట్టబోతే గడ్డిపోచలా ఎంచింది. అశోక వనంలో రావణ పరిచారికలు ఆమె మనసు మార్చాలని ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని హింసలు పెట్టినా తొణకలేదు, బెణకలేదు. అవసరమైతే ప్రాణ త్యాగం చెయ్యాలనుకుందిగానీ, రాముని పట్ల అనురాగాన్ని వదులుకోలేదు. రెండోసారి అడవులకు వెళ్లినప్పుడు బేలగా మిగిలిపోకుండా ఆశ్రమంలోనే కుశలవులను వీర పుత్రులుగా తీర్చిదిద్దింది. తండ్రిని మించిన తనయులుగా మలచింది. సీతారాముల జీవితాన్ని చూస్తే అధిక భాగం కన్నీళ్లే. కానీ, అంత దుఃఖంలోనూ వారు ఆచంద్ర తారార్కం నిలిచిపోయే దంపతులుగా మిగిలారంటే కారణం ఒకరి మీద ఒకరికున్న అపార ప్రేమే. ఏ దంపతుల మధ్య అయినా తప్పనిసరి జీవన నాదమిది. కడగండ్లు ముంచెత్తినా, సర్వ సుఖాల్లో ఓలలాడుతున్నా దంపతుల మధ్య పరస్పర అనురాగం తప్పనిసరి అప్పుడే ఆ వైవాహిక బంధానికి సార్థకత.        

- వేణుబాబు మన్నం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని