close

తాజా వార్తలు

Published : 23/04/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నెలవంక తొంగి చూస్తుంది... శుభ సందేశం తీసుకొస్తుంది!

ఏడాది క్రితం ఇంటికి ఓ అతిథి వచ్చాడు!
అతను మీకోసం ఎన్నో వెలకట్టలేని బహుమతులను, కానుకలను తెచ్చాడు!
మీ సంతోషం రెట్టింపయ్యింది. ఆ అతిథి మీ ఇంట్లో ఉన్నన్ని రోజులూ ఏ లోటూ లేకుండా, ఎలాంటి చీకూచింతా లేకుండా మీ ఇల్లు గడిచింది.
ఒకానొక రోజు ఆ అతిథి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. మీరతనికి భారంగానే వీడ్కోలు పలికారు.
చాలాకాలం వరకూ అతనితో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఆ అతిథి మరోసారి మీ ఇంటి తలుపుతడితే, మళ్లీ ఒకసారి ఆ కానుకలు తెస్తే ఎంత బావుండు!
మా ఇల్లు సంతోషాలకు, ఆనందాలకు నిలయమైతే ఎంత బావుండు! మా కష్టాలు, బాధలన్నీ మటుమాయమవుతాయి!
ఈ ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అదుగో... ఆ అతిథి రానే వస్తున్నాడు.
సకల శుభాలతో, అనంత కారుణ్యాన్ని మోసుకొచ్చి మరోసారి తలుపు తట్టనున్నాడు.
అతను మన గుండె గదిని ప్రక్షాళనం చేస్తాడు!
మన పాపాలను మన్నించి పునీతుల్ని చేస్తాడు.
ఇంతకీ ఆ అతిథి మరెవరో కాదు ‘రంజాన్‌ పవిత్ర మాసం’.
మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది.


ఈ ఏడాది రంజాన్‌ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని ఉలేమాలు ప్రకటించారు. మసీదుకు వెళ్లలేకపోయామని నిరాశ చెందే బదులు ఇంటినే ఆరాధనా స్థలంగా మార్చేయాలి. ప్రతి ఇల్లూ నమాజ్‌, ఖురాన్‌ పఠనంతో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్మేలా చేసే గొప్ప అవకాశమిది. ప్రపంచ మానవాళిపై విరుచుకుపడుతున్న రక్కసిని గొప్ప ఆధ్యాత్మిక శక్తితో తరిమేయాల్సిన అపూర్వ సందర్భమిది.


రమజ్‌ అనే ధాతువు నుంచి రంజాన్‌ వచ్చింది. అంటే కాల్చివేయడం అని అర్థం. అల్లాహ్‌ దాసులు ఏడాదిపాటు చేసిన పాపాలను ఈ నెలలో పాటించే ఉపవాసాలు, తరావీహ్‌ నమాజులు, జకాత్‌ దానాలు, ఖుర్‌ఆన్‌ పారాయణాలు భస్మీపటలం చేస్తాయి. ఈ సమయంలో చేసే ధార్మిక కసరత్తులన్నీ మనిషి వ్యక్తిగత శిక్షణ కోసమేనని ఖుర్‌ఆన్‌ బోధిస్తోంది.


ఉపవాసం

నిషిలో వ్యక్తిగతంగా దైవభీతిని జనింపచేయడమే ఉపవాసాల ఉద్దేశమని ఖుర్‌ఆన్‌ చెబుతోంది. కేవలం కడుపు కాదు కళ్లు, చెవులు, కాళ్లు, చేతులు, నాలుక ఇవన్నీ ఉపవాసం  పాటించాలని ఇమామ్‌ గజాలీ అంటారు. అలాంటి ఉపవాసం పాటించినప్పుడే అది అల్లాహ్‌ స్వీకృతి పొందుతుందని ప్రవక్త (స) చెప్పారు. రోజంతా పస్తులుండి, ఉపవాసాల ఉద్దేశాన్ని నెరవేర్చేవారికి ‘రయ్యాన్‌’ అనే ద్వారంగుండా స్వర్గప్రవేశం లభిస్తుందని ఆయన అన్నారు. ‘నా కోసం రోజంతా పస్తులుండి కఠోర ఉపవాస దీక్ష పాటించిన నా దాసులు రానున్నారు. వారి కోసం నువ్వు మనోహరంగా మారిపో’ అని అల్లాహ్‌ స్వర్గాన్ని ఆదేశిస్తాడన్న మరో ప్రవచనమూ ఉంది.


తరావీహ్‌.. ఖియాముల్లైల్‌.. తహజ్జుద్‌...

రంజాన్‌ లో ప్రవక్త (స) ప్రత్యేకంగా తరావీహ్‌ నమాజును ఆచరించేవారు. ఈ నమాజులో పూర్తి ఖురాన్‌ను ఒక్కసారి వినడం ప్రవక్త(స) సంప్రదాయం.  దైవసాన్నిహిత్యానికి ఇదెంతో ఉపయుక్తం. తరావీహ్‌ అనంతరం రాత్రంతా నమాజులో నిల్చుండటాన్ని ఖియాముల్లైల్‌ అంటారు. ఆ తరువాత సహరీ భుజించడానికి అరగంట లేదా గంట ముందు చేసే నమాజును తహజ్జుద్‌ నమాజు అంటారు. ఇవన్నీ ఏకాంత ఆరాధనలే. దైవానికి దగ్గరవడానికి ఇవి చక్కటి వారధులు..


ఖురాన్‌...

రంజాన్‌ నెలలో ఒక రాత్రి ఖురాన్‌ అవతరించింది. ప్రవక్త (స) మనోఫలకంపై జిబ్రాయీల్‌ అనే దైవదూత దీన్ని అవతరింపజేశారు. ఈ నెలంతా ప్రవక్త (స) ఖురాన్‌ పారాయణ చేసేవారు. ఇదే ఆనవాయితీతో రంజాన్‌  నెల పొడుపు కనపడినప్పటినుంచి షవ్వాల్‌ నెలవంక కనపించేవరకూ ముస్లింలు రోజూ ఒక్కసారైనా ఖురాన్‌ వినడమో, చదవడమో చేస్తారు. తరావీహ్‌ నమాజులోనో, వ్యక్తిగతంగానో ఖురాన్‌ పఠించాలన్నది ప్రవక్త (స) హితవు. ‘ఖురాన్‌ చదవడం రాకపోయినా కష్టపడి చదవడానికి ప్రయత్నించేవారికి రెండింతల పుణ్యం లభిస్తుందని ప్రవక్త (స) చెప్పారు.


ఏతెకాఫ్‌..

ప్రవక్త (స) రమజాన్‌ చివరి పది రోజులు బయటకు రాకుండా మసీదులోనే ఉండేవారు. ప్రాపంచిక వ్యవహరాలన్నీ త్యజించి కేవలం దైవనామస్మరణ, నమాజులు, ఖురాన్‌ పారాయణ చేసేవారు. దీన్నే ‘ఏతెకాఫ్‌’ అంటారు. సంప్రదాయంగా రంజాన్‌ నెలలో ముస్లింలు ఏతెకాఫ్‌ పాటిస్తారు. ఏతెకాఫ్‌ అనేది ఏకాంత ఆరాధన. ఈ పది రాత్రుల దైవారాధన ఎనలేని ఆత్మబలాన్నిస్తుంది. రంజాన్‌లో చేసే జకాత్‌, ఫిత్రా దానాలు సంపదను శుద్ధి చేస్తాయని ప్రవక్త బోధించారు.

- ఖైరున్నీసాబేగం


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని