close

తాజా వార్తలు

Published : 28/04/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊబకాయంతోనూ ముప్పే!

సమస్య సలహా

సమస్య: నాకు 40 ఏళ్లు. ఊబకాయం ఉంది. ఊబకాయులకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎక్కువని ఇటీవల విన్నాను. నిజమేనా? నాలాంటి వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - జి. వెంకటేశ్‌, హైదరాబాద్‌

సలహా: మీరు విన్నది నిజమే. వృద్ధాప్యం, గుండెజబ్బులు, మధుమేహం వంటివాటితోనే కాదు.. ఊబకాయంతోనూ కొత్త కరోనా జబ్బు ముప్పు పెరుగుతున్నట్టు ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. వీరికి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత, మరణించే ముప్పూ ఎక్కువగానే ఉంటోంది. ఊబకాయుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువ. వీరిలో సైటోకైన్ల వంటి వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) కారకాలూ పెద్ద మొత్తంలో ఉంటాయి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డప్పుడు ఇవి మరింత విజృంభిస్తాయి. దీంతో కరోనా దుష్ప్రభావాలు ఇంకాస్త ఎక్కువవుతాయి. వాపు కారకాలతో మరో ప్రమాదమేంటంటే- శరీరం నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటున్న స్థితిలో ఉంటుండటం. బరువు ఎక్కువవుతున్నకొద్దీ ఇదీ పెరుగుతూ వస్తుంటుంది. దీంతో మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి జబ్బుల ముప్పూ పెరుగుతుంది. మీరు ఊబకాయం గురించి తెలిపారు గానీ ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయేమో వివరించలేదు. ఊబకాయుల్లో చాలామంది ఇలాంటి సమస్యలతోనూ బాధపడుతుంటారు. ఇవీ కరోనా జబ్బు ముప్పును పెంచేవే కావటం గమనార్హం. వీటికి ఊబకాయం జతకూడితే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. ఊబకాయుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యమూ తక్కువగానే ఉంటుంది. నిద్రలో తరచూ శ్వాసకు అంతరాయం తలెత్తటం (స్లీప్‌ అప్నియా), ఊపిరితిత్తులు సరిగా వ్యాకోచించకపోవటం వంటి సమస్యలతోనూ బాధపడుతుంటారు. దీంతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా ఊపిరితిత్తులు త్వరగా చేతులెత్తేస్తాయి. వీరికి అత్యవసర సమయాల్లో వెంటిలేటర్‌ అమర్చటమూ కష్టమే. ఫలితమూ అంతంత మాత్రమే. కరోనా జబ్బులో చాలామంది ఊపిరితిత్తుల్లో న్యుమోనియా, ఊపిరితిత్తుల వైఫల్యంతోనే మరణిస్తుండటం చూస్తున్నదే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు మరింత అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. అనవసరంగా బయటకు వెళ్లకపోవటం, ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులు కడుక్కోవటం, ముఖానికి మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు ఇంకాస్త కచ్చితంగా పాటించాలి. కుటుంబ సభ్యులూ అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో వృద్ధులు, మధుమేహులు, కిడ్నీ జబ్బు బాధితులు ఉన్నప్పుడు తీసుకున్నట్టుగానే ఊబకాయుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. బయటకు వెళ్తే ఇంట్లోకి వచ్చే ముందే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే ఊబకాయులకూ ముప్పు తెచ్చిపెట్టినట్టు అవుతుంది. ఇప్పటికిప్పుడు ఊబకాయాన్ని తగ్గించుకోవటమైతే అసాధ్యం. మీరు ముందు నుంచే జాగ్రత్త పడాల్సింది. అంతమాత్రాన నిరాశ చెందాల్సిన పనిలేదు. ఇప్పట్నుంచైనా బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) 30, అంతకన్నా ఎక్కువుంటే ఊబకాయంగా పరిగణిస్తారు. దీన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. బొజ్జ పెరగకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆహార, వ్యాయామ నియమాలు కచ్చితంగా పాటించాలి. ఎక్కువ కేలరీలతో కూడిన నూనె, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. సమతులాహారం తీసుకోవాలి. వీలైనంతవరకు ఇంట్లో వండుకున్న ఆహారం తినటం మేలు. ఎలాంటి పోషకాలు లేని జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం ముఖ్యం. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోతే ఇంట్లోనైనా వ్యాయామాలు చేయాలి. దీంతో బరువు పెరగకుండా చూసుకోవచ్ఛు మున్ముందు కరోనా బారి నుంచీ కాపాడుకోవచ్ఛు ఎందుకంటే కరోనా ఇప్పుడప్పుడే సమసిపోయే సమస్య కాదు. కచ్చితమైన చికిత్సలు, సమర్థమైన టీకా అందుబాటులోకి వచ్చేంతవరకు మనల్ని వెంటాడుతూనే వస్తుంది. అందువల్ల దిగ్బంధం (లాక్‌డౌన్‌) తొలగించినా మీ జాగ్రత్తలో మీరుండటం మంచిది.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.inTags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని