
తాజా వార్తలు
అలా చెప్పడం తప్పు!
ఇస్లాం సందేశం
ఒక వ్యక్తి ఒక గోధుమ విత్తును భూమిలో నాటాడు. అది మొలకెత్తింది. ఏపుగా పెరిగి పెద్దదై ఏడు వెన్నులను ఈనింది. ఒక్కో వెన్నులో వందేసి గింజలున్నాయి.... ఇలా ఒక్క విత్తనంతో 700 వందల గింజలు పండాయి. ఈ ఉపమానాన్ని ఖురాన్ సరైన రీతిలో చేసే ఖర్చుతో సరిపోల్చింది. ధనాన్ని నీతి, నిజాయతీతో సంపాదించి దాన్ని పిసినారితనంతో కూడబెట్టకుండా కుటుంబ అవసరాలకు పోగా మిగిలినది దైవమార్గంలో ఖర్చు చేయాలంటోంది ఖురాన్. ఇక్కడ దైవ మార్గం అంటే నిరుపేదలు, అన్నార్తులను ఆదుకోవడమని అని అర్థం. విత్తే విత్తనం నకిలీది కాకుండా చూసుకోవాలి. నకిలీ విత్తనాలు నాటితే ఏవిధంగా మొక్కలు మొలకెత్తవో అలాగే అక్రమ సంపాదన కూడా ఫలితాన్నివ్వదు. అలాగే దానం చేసి కృతజ్ఞతను ఆశించడం, నలుగురికీ ప్రచారం చేసుకోవడం, దెప్పిపొడవడం ఇవన్నీ చేయకూడని పనులు.
జకాత్.. ఫిత్రా..
* రంజాన్ మాసంలో దానధర్మాలను జకాత్, సదఖా, ఫిత్రా అనే పద్దుల్లో ఖర్చుపెడతారు. ఏడాదిపాటు తమవద్ద నిల్వ ఉన్న సంపదలోనుంచి రెండున్నర శాతం తీసి నిరుపేదలకు, అనాథలకు, బాటసారులకు, రుణగ్రస్తులకు అందించడాన్ని జకాత్ అంటారు. జకాత్ అంటే శుద్ధి చేయడం. జకాత్ ఇవ్వడం వల్ల ఏడాదిపాటు తమ సంపదను శుద్ధి చేసుకోవచ్చు.
* రంజాన్ పండగకు ముందు చేసే దానం ఫిత్రా. ఇది ప్రతి ముస్లిం తప్పనిసరిగా చేయాలి. కిలోన్నర గోధుమలకు సరిపడా డబ్బును పంపిణీ చేస్తేనే ఉపవాసాలు స్వీకృతి పొందుతాయని ప్రవక్త సూక్తి. అందుకే ఇంట్లో అప్పుడే పుట్టిన శిశువునుంచి పండు ముదుసలి వరకూ లెక్కగట్టి ఆ డబ్బును నిరుపేదలకు పంపిణీ చేసి వారు కూడా పండగ చేసుకునేందుకు తోడ్పడతారు.
* కష్టార్జితంతో సంపాదించిన చిన్న ఖర్జూరపు ముక్కనైనా సదఖా (దానం) చేయండి అని ప్రవక్త (స) చెప్పారు. అలా దానం చేసిన ఖర్జూరపు ముక్కను అల్లాహ్ స్వయంగా తన కుడి చేతిలో తీసుకుని పెంచి పోషిస్తాడని ప్రవక్త తెలిపారు.
కొండరాతిపై ఒక మట్టిపొర ఏర్పడి ఉంది. భారీవర్షం కురిసి ఆ మట్టి కాస్తా కొట్టుకు పోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండరాయి మాత్రమే. దానం చేసి దాన్ని ప్రచారం చేసుకునేవారికి కూడా ఇలాగే ఏ ప్రయోజనం కలగదు (దివ్య ఖురాన్)
- ఖైరున్నీసాబేగం