close

తాజా వార్తలు

Published : 16/05/2020 00:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాళ్ల ఆత్మగౌర్‌వం!

మాస్క్‌, శానిటైజర్‌, గ్లవుజులు.. అన్నీ సిద్ధం చేసుకుని.. ఆ ఊరిలోని మూడు వందలమంది ఆడ పిల్లలు సంతకాలు చేసిచ్చిన దరఖాస్తుతో.. స్కూటీపై బయలుదేరింది రేణుగౌర్‌. ఇంతకీ వారంతా దరఖాస్తు చేసుకున్నది దేనికోసం? ఆమె ప్రయాణం ఎక్కడికి?
జోధ్‌పూర్‌లోని ఓసియన్‌ పంచాయతీలోని తోబ్‌ గ్రామం రేణుగౌర్‌ది. ఆ ప్రాంతంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ ప్రాజెక్టులో పనిచేస్తోందామె. సమస్యలపై తక్షణం స్పందించే ఆమె అంటే అక్కడి అమ్మాయిలకు చాలా అభిమానం. అందుకే వాళ్లకు ఏ సమస్య వచ్చినా ముందుగా ఆమెకే చెబుతుంటారు. ఓ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక ఓ అమ్మాయి ఫోన్‌ చేసి ఊర్లో ఆడపిల్లలు శానిటరీ న్యాప్‌కిన్లు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. అంతవరకు వాళ్లు న్యాప్‌కిన్లని అంగన్‌వాడీల నుంచి ఉచితంగా అందుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆరోగ్యకార్యకర్తలు కరోనా నియంత్రణ పనుల్లో తలమునకలయ్యారు. దాంతో ఆడపిల్లలకు అవి అందడం లేదు. వాటిని కొనుక్కునే స్థోమత కూడా లేదు. ఒకవేళ తెలిసిన సంప్రదాయ విధానాలు పాటించినా అవి అసురక్షితం కావడంతో వాళ్లంతా ఇన్‌ఫెక్షన్లతో సతమతమవ్వడం వంటి విషయాలు రేణు తెలుసుకుంటూనే ఉంది. స్థానిక సబ్‌డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ పేరిట.. అమ్మాయిలందరూ సంతకం చేసిన ఓ దరఖాస్తు తీసుకుంది. ఆ దరఖాస్తుతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్‌పూర్‌కు బండిపై బయలుదేరింది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అధికారులకు చెబితే  ఇదో పెద్ద సమస్యా అంటూ కొట్టిపారేశారు. ఐనా ఆమె పట్టువిడవకుండా వారికి సమస్యని వివరించింది. చివరికి వాళ్లు ఆ అమ్మాయిల సమస్యను అర్థం చేసుకున్నారు. రేణు సేవాభావాన్నీ గుర్తించారు. ఆ ఆడపిల్లలతో పాటు... చుట్టుపక్కల ఐదు గ్రామాల్లోని అమ్మాయిలకు కూడా శానిటరీ న్యాప్‌కిన్లు, రక్తహీనతను నివారించే ఐరన్‌ టాబ్లెట్లు పంచే బృహత్తర బాధ్యతని ఆమెకు అప్పగించారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని