
తాజా వార్తలు
ఫీజు కట్టలేదని పంపేశారు...
ఆ తల్లిదండ్రులు కాయకష్టం చేసి తాము తిన్నా తినకున్నా తమ పిల్లల్ని చదివిస్తూ వచ్చారు. ‘మన బతుకు మారాలంటే చదువు ఒక్కటే మార్గం’ అని బిడ్డలకు చెప్పేవారు. తల్లిదండ్రులు చేస్తున్న రెక్కల కష్టమే ఆ పిల్లల జీవితాలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. చదువుకుని కన్నవారికి పేరు ప్రతిష్ఠలు తేవాలన్న సంకల్పాన్ని పెంచింది. తాజాగా ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన కల్యాణి, స్రవంతిల అంతరంగం వారి మాటల్లోనే...
మాది కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్. నాన్న కాటే శేషగిరి. అమ్మ అనిత. నాకో అక్క. చిన్నప్పటి నుంచీ అమ్మానాన్నల కష్టాలు చూస్తూ పెరిగాను. ఎన్ని ఇబ్బందులు పడ్డా అవి మాత్రం ఏ రోజూ నా లక్ష్యాన్ని దూరం చేయలేదు. అమ్మ మమ్మల్ని ఉన్నతంగా చూడాలని కలలు కనేది. కానీ ఆర్థిక ఇబ్బందులు బాగా ఉండేవి. నా చిన్నపుడు నాన్న రోజూ ఇంటికి తాగి వచ్చేవాడు. పిల్లల భవిష్యత్తు పాడవుతుందనీ, సంసారం చెదిరిపోతుందనీ అమ్మ ఎంతో నచ్చచెప్పడంతో చివరికి ఆయన మనసు మారింది. ఐదో తరగతి వరకూ హైదరాబాద్‌లో శిశుమందిర్‌లో చదివాను. నాన్నకు సరైన ఉపాధిలేక తిరిగి కాగజ్‌నగర్‌కి వచ్చేశాం. ఇక్కడికి వచ్చాక ఇడ్లీలు తయారుచేసి ఇంటింటా తిరిగి అమ్మడం మొదలుపెట్టారు. తెల్లవారు జామునే వారి దినచర్య మొదలవుతుంది. రాత్రి ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ఇదంతా మాకోసమే చేస్తున్నారని మాత్రం మాకు తెలుసు. అందుకే నేనూ వారితోపాటు ఉదయాన్నే నిద్రలేచి చదవడం మొదలుపెట్టా. ఆంగ్లమాధ్యమంలోకి మారాలని ఎనిమిదిలో ఓ ప్రైవేటు స్కూల్లో చేరాను. కానీ చాలా సార్లు టైమ్‌కి ఫీజు కట్టలేకపోయా. దాంతో క్లాసులోకి రానిచ్చేవారు కాదు. అలాంటప్పుడు ‘అయ్యో చదువుకోలేకపోతున్నానే’ అని బాధపడేదాన్ని. దాంతో తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరా. పదో తరగతిలో 9.7 జీపీఏ సాధించాను. ఐఐటీలో చదవాలన్నది నా కల. కానీ ప్రైవేటు కాలేజీలో చేరే పరిస్థితి లేదు. ఆ సమయంలో ‘మేధా ట్రస్ట్’ టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. దాన్లో టాపర్‌గా నిలిచా. దాంతో నన్ను హైదరాబాద్ లోని శ్రీచైతన్య కళాశాలలో చేర్పించింది. అక్కడ ఎంతో కష్టపడి చదివి రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు(992/1000) తెచ్చుకున్నా. ఇటీవలే జీఈఈ మెయిన్స్‌లో 97 పర్సంటైల్ సాధించా. అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి మార్కులు వస్తాయి. ఐఐటీలో సీటు సాధిస్తానన్న నమ్మకం ఉంది.
- విడిదినేని శ్రీనివాసరావు, న్యూస్‌టుడే, కాగజ్‌నగర్
నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి...
‘మంచిగ చదువు బిడ్డ’ ఈ మాటల్నే నాన్న నాకు పదేపదే చెప్పేవారు. తర్వాత తన పనిలో తాను మునిగిపోయేవారు. మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ. ఊళ్లో చిన్న ఇల్లుంది. నాన్న ఉపాధి, మా చదువుల కోసమని మంచిర్యాలలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నాన్న అంజన్న మార్బుల్ వేసే పనికి వెళ్తాడు. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడే అమ్మ(కళావతి) టీబీతో చనిపోయింది. దీంతో అన్న ప్రశాంత్నీ నన్నూ నాన్న కష్టపడి చదవిస్తున్నాడు. నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్న తరువాత కూడా చిన్నమ్మ (స్వప్న) మమ్మల్ని మరింత బాగా చూసుకుంటూ చదవమని ప్రోత్సహించేది. అమ్మానాన్నల రెక్కల కష్టం వృధా పోకూడదని మనసుపెట్టి చదివేదాన్ని. పదోతరగతిలో 9.8 జీపీఏ సాధించాను. ఇంటర్మీడియెట్ కరీంనగర్‌లోని ఎస్సార్ కళాశాలలో చదివా. టెన్త్‌లో వచ్చిన మార్కుల్ని బట్టి నాకు ఉచిత సీటు ఇచ్చారు. హాస్టల్ వసతి కూడా ఉచితమే. ‘లక్షలు కడితేగానీ రాని సీటు నాకు ఉచితంగా వచ్చింది. ఈ అవకాశాన్ని వృధా కానివ్వకూడదు’ అనుకునేదాన్ని. పుస్తకాలూ ఖర్చులకు నాన్న డబ్బులిచ్చేవాడు. ఆ కొద్ది మొత్తం కూడా వాళ్లకి కష్టంగానే ఉండేది. అందుకేనేమో పుస్తకం పట్టిన ప్రతిసారి నాన్న పడుతున్న కష్టం గుర్తొచ్చేది. వారి కష్టాలు పోవాలంటే బాగా చదవాలని పట్టుదలతో ఉండేదాన్ని. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 437(440కి) మార్కులతో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించా. ఈ పరీక్షలకు కొద్దిరోజుల ముందు నాకిష్టమైన మా నాన్నమ్మ శంకరవ్వ చనిపోయింది. ఓ వైపు బాధ ఉన్నా.. ఏకాగ్రతను ఏ మాత్రం సడలనివ్వకుండా ప్రణాళికా ప్రకారం చదివా. అందుకే 992 మార్కుల్ని సాధించగలిగా. కార్డియాలజిస్ట్‌గా మారి మారుమూల గ్రామాల ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఈ రోజు నా విజయాన్ని చూసి కూలి బిడ్డ సాధించిన ఘనత ఇదని మెచ్చుకుంటుంటే నాన్న కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
- తుమ్మల శ్రీనివాస్, ఈనాడు డిజిటల్, కరీంనగర్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
