
తాజా వార్తలు
పోషకాలను తాగేద్దామా...
రుచికరమైన ఆహారంతో రోగనిరోధక శక్తినీ పెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ ఉల్లిపాయ, క్యారెట్ సూప్‌ను ప్రయత్నించండి...
స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసి వేడిచేయాలి. దీంట్లో కొద్దిగా అల్లం తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలూ, టీస్పూన్ మిరియాల పొడి వేసి రెండు మూడు నిమిషాలపాటు ఉడికించాలి. ఇంట్లో కూరగాయలు లేదా ఆకుకూరలు ఉడికించిన నీళ్లు ఉంటే అవి పోసి తక్కువ మంట మీద పదినిమిషాల పాటు ఉడికించి దించేయాలి. చివరగా కొత్తిమీర తురుము లేదా పుదీనా ఆకులు వేసుకుని వేడివేడిగా తాగేయాలి. ఇష్టమైతే కాస్త నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.
క్యారెట్లో బీటాకెరొటిన్, పీచు పదార్థం, విటమిన్-కె, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఉల్లిపాయ దగ్గు, గొంతు నొప్పి, ఇతర ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. ఈ రెండింటినీ కలిపి చేసే ఈ సూప్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.