
తాజా వార్తలు
కోతి కొమ్మచ్చి.. నెత్తికి టోపీ వచ్చి!
వీరన్ ఓ వర్తకుడు. ఊరూరా తిరిగి టోపీలు అమ్ముతుంటాడు. ఓ సారి వేసవికాలంలో అలసిపోయి ఓ ఊరి చివరన ఉన్న ఒక చెట్టుకిందకు వెళ్లాడు. పక్కనే చిన్న నీటి కుంట, చెట్టునీడ వల్ల అక్కడి వాతావరణం చల్లగా అనిపించింది. కాసేపు సేదతీరుదామని టోపీల మూట పక్కన పెట్టి నిద్రపోయాడు.
ఇంతలో కోతుల గుంపు ఆ చెట్టుమీదకు వచ్చింది. వర్తకుని నెత్తికి టోపీ, పక్కన ఏదో మూట వాటికి కనిపించాయి. ముందుగా రెండు కోతులు మెల్లిగా మూటను చెట్టుమీదకు తీసుకువెళ్లాయి. అందులో రంగురంగుల టోపీలు కనిపించాయి. వీరన్ కూడా నెత్తికి టోపీ పెట్టుకునే పడుకున్నాడు. ఈ కోతులు కూడా చాలాసార్లు మనుషులు టోపీ పెట్టుకోవడం చూశాయి. మనుషులు చేసిన పనుల్ని చూసి కోతులు చక్కగా అనుకరిస్తాయి. అందుకే అవీ ఎంచక్కా టోపీలు పెట్టుకున్నాయి. మిగిలిన కోతులు కూడా తలా ఓ టోపీ తీసుకుని నెత్తిన పెట్టుకుని మురిసిపోతున్నాయి.
కాసేపటి తర్వాత వీరన్కు మెలకువ వచ్చింది. చూస్తే పక్కన మూట లేదు. ‘ఓరి నాయనో.. నా టోపీల మూటను ఎవరో కాజేశారు...’అని కంగారుపడుతూ.. దిక్కులు చూస్తున్నాడు. ఏడుపు ఒక్కటే తక్కువైంది. పోనీ ఎవరినైనా అడుగుదామా.. అంటే.. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు! ఇంతలో చెట్టుపైన ఏదో చప్పుడైంది. తలెత్తి పైకి చూస్తే చెట్టుమీద కోతులు ఒకదాని టోపీని మరోటి మార్చుకుంటూ.. అరుస్తూ.. ఆనందిస్తున్నాయి.
వీరన్ తనకు వచ్చిన కోపాన్ని అణచుకోలేక గట్టిగా అరుస్తూ కొడతా అని చేత్తో బెదిరించాడు. కోతులు కూడా చేతులతో అలాగే చూపించాయి. కిందపడేసి తొక్కేస్తానని వీరన్ కాలితో నేలమీద తన్నాడు. కోతులు చెట్టుపైనే తన్నడం మొదలు పెట్టాయి.
‘ఈ కోతులు నేను ఏం చేస్తే.. అవే చేస్తున్నాయి. కాబట్టి ఓ తమాషా చేస్తా’ అనుకొన్నాడు. వెంటనే ‘ఛీ! వెధవ కోతుల్లారా! ఈ టోపీని కూడా పట్టుకొని పొండి’ అని తనటోపీని నేలకేసి కొట్టాడు. వెంటనే కోతులు తమ తలమీద ఉన్న టోపీల్ని నేలమీదికి విసిరేశాయి. వీరన్ చేతిలోకి కర్ర తీసుకుని టోపీలన్నింటినీ టకటకా ఏరుకుని మూటగట్టుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఓ కోతి మాత్రం టోపీ కింద పడేయలేదు. దాని కోసం మిగతా కోతులన్నీ పోటీపడుతూ.. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకు దూకుతూ.. మొత్తానికి ఆ టోపీ చిరిగిపోయే వరకు రచ్చరచ్చ చేశాయి. ఇంకెప్పుడూ వీరన్ ఆ చెట్టుకింద నిద్రించే సాహసం చేయలేదు.