close

తాజా వార్తలు

Published : 06/09/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కమ్మకమ్మగా కాకమ్మ పాట

అదో పెద్ద అడవి. అందులో ఒక కాకి, ఒక చిలుక. రంగూరూపూ వేరైనా ఇవి మంచి మిత్రులు. పే..ద్ద నేరేడు చెట్టే వాటి నివాసం.

ఓ రోజు కోకిల అటువైపు వచ్చింది. నేరేడు చెట్టు దగ్గర్లోని మామిడిచెట్టుపై వాలి ‘కుహూ.. కుహూ..’అంటూ మధురంగా పాడసాగింది.

అంతే, ఎక్కడి నుంచో ఒక జింక గబగబా అక్కడకు వచ్చింది. కోకిల పాటను వింటూ, ఎంతో పరవశంగా నాట్యం చేయసాగింది.

ఈ దృశ్యాన్ని చూస్తున్న కాకికి ఓ కోరిక కలిగింది. తన నేస్తం చిలుకతో ‘చిలుకమ్మా! నాకూ పాడాలని ఉంది. నా పాటకు ఆ జింక నాట్యం చేస్తుంటే.. చూడాలని ఉంది. మరి, నా కోరిక తీరుతుందంటావా?’ అని ఎంతో ఆశగా.. అడిగింది. చిలుక నవ్వి ఊరుకుంది.

కాసేపటికి కోకిల పాట ఆపేసి ఎగిరిపోయింది. దాంతో పాపం జింక నిరాశగా నిట్టూర్చింది.

అది గమనించిన కాకి ‘జింకమ్మా.. బాధ పడకు, నీకోసం నే పాడతాలే! హాయిగా విను మరి’ అని ‘కావ్‌.. కావ్‌..’అంటూ రాగం తీసింది.

వెంటనే జింక ఆముదం తాగినట్లు మొహం చిట్లించి ‘ఛీ.. ఛీ.. ఇది పాటా? పరమ రోతగా ఉంది’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

పాపం కాకి మనసు కలుక్కుమంది. చిలుక దాన్ని సముదాయిస్తూ.. ‘మిత్రమా, నీ పాటను వింటూ నేను నాట్యం చేస్తాను! సరేనా?’ అంది.

‘వద్దు వద్ధు. నేను ఎలాగైనా ఆ జింకను నా పాటతో మెప్పించి, నాట్యం చేయించి తీరతాను’ అని పట్టుదలగా చెప్పింది కాకి.

ఓ రోజు కోకిల మళ్లీ ‘కుహూ.. కుహూ..’ అంటూ పాట అందుకుంది. జింక పరుగున వచ్చి నాట్యం చేయసాగింది. అదే సమయంలో అటువైపుగా ఎగురుతూ వచ్చిన కాకి తుళ్లిపడింది.

ఒక వేటగాడు జింకకేసి విల్లును ఎక్కుపెడుతున్నాడు. కాకి వెంటనే అతడి తలపై గిరగిరా తిరుగుతూ.. ‘కావ్‌.. కావ్‌’మని అరవసాగింది.

పాటలో లీనమైన జింక ఆ అరుపులు విని ‘అబ్భ. ఇక్కడ కూడా కాకిగోలేనా’ అనుకుంటూ కోపంగా ఇవతలకు తిరిగింది. అక్కడ గాల్లో కాకిని, దాని కింద మృత్యురూపంలో ఉన్న వేటగాడిని చూసి అదిరిపడింది. అంతే, వాయువేగంతో అక్కడ నుంచి పారిపోయింది.

కాకి తన నేస్తం చిలుకకు తర్వాత జరిగిందంతా చెప్పింది. ఆ మర్నాడు కోకిల మళ్లీ పాట అందుకుంది. మరుక్షణం జింక అక్కడకు వచ్చి ‘ఆపవమ్మా కోకిల.. నీ పాట వల్ల నిన్న నా ప్రాణం పోయేది. అయినా నీ గొంతు పరమరోతగా ఉంది’ అంది.

పక్కనే ఉన్న నేరేడు చెట్టు వద్దకు వచ్చి కాకితో అడిగి మరీ పాడించుకుంది. ‘కావ్‌. కావ్‌..’మని కాకి అరుస్తుంటే.. జింక ఉత్సాహంతో ఊగిపోతూ.. ‘ఆహా.. కాకమ్మపాట.. కమ్మకమ్మగా.. తియ్యతియ్యగా ఎంత బాగుందో’ అంటూ నాట్యం చేసింది.

ఇదంతా చూస్తున్న చిలుక ‘కాకి ఈ జింకను వేటగాడి నుంచి కాపాడింది కదా. అందుకే కాబోలు జింకకు కాకంటే బోలెడంత ఇష్టం ఏర్పడింది. దీనివల్ల జింకకు కోకిల పాట రోతగా, కాకి పాట కమ్మగా అనిపించి ఉంటుంది. ఏది ఏమైనా నా నేస్తం కాకమ్మ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన కోరిక నెరవేర్చుకుంది’ అనుకొని ముసిముసిగా నవ్వుకుంది.

- పుట్టగుంట సురేష్‌కుమార్‌



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని