close

తాజా వార్తలు

Updated : 09/09/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాతయ్య చెప్పారు.. మాస్టారు మార్గం చూపారు!

వీ! మనపని మనం చేసుకోవడంలో తప్పులేదు. పైగా ఈ కరోనా సెలవుల్లో కాసేపు చదువుకొని కొంత సమయం ఆడుతూ.. పాడుతూ.. గడిపి మిగతా వేళల్లో మీ నాన్నకు వ్యవసాయ పనుల్లో సాయపడటంలో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని అడిగారు తాతయ్య తన మనవడు రవిని.

‘అది కాదు తాతయ్యా!.. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా. నేను ఏడో తరగతిలో మంచి ర్యాంకర్‌ను. నన్ను పట్టుకొని నాన్న గేదెలు కాయమంటారు. నా ఫ్రెండ్స్‌ చూస్తే నాకు ఎంత అవమానం?’ అని బుంగమూతి పెట్టాడు రవి.

‘ఒరేయ్‌ రవి.. నేనూ పీయూసీ పాసయ్యాను. మీ నాన్న బీఏ చదివాడు. అయినా మేం పొలం పనులు చెయ్యడం లేదా?! గేదెలు మేపడం లేదా?! ఊర్లో ఇంటింటికీ పాలు పోసి బతకడం లేదా?! మనం పాడిపంటల రైతులం. మన వృత్తి మనం చేసుకోవడంలో సిగ్గెందుకు?’ అన్నారు తాతయ్య.

‘నువ్వు ఎన్నైనా చెప్పు తాతయ్యా.. నాకు పొలం పని, పశువుల పని, అప్పుడప్పుడైనా పాలు అమ్మే పని అంటే నామోషీగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే.. చివరికి అమ్మ కూడా నాన్నకే వింతగా వంతపాడుతోంది. ఇంత చదువూ చదివి ఇదేమి పని అనిపిస్తుంది నాకు’ అని రవి అన్నాడు.

‘సరే ప్రస్తుతానికి ఆ విషయం వదిలెయ్‌! మీ నానమ్మ రోడ్డు మీదకు వెళ్లి అరటి పండ్లు కొని తెమ్మంది పద వెళ్దాం’ అని అన్నారు. తాతయ్య. ‘సరే తాతయ్య’ అంటూ తాతయ్య వెంట నడిచాడు. రోడ్డు మీద అరటిపండ్ల బండి తోసుకుంటూ అమ్ముతున్న మనిషిని చూసి రవి ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి తనను చూస్తే సిగ్గుపడిపోతాడేమో అని ఆ అరటిపండ్ల బండిని వేగంగా దాటివెళ్లడానికి ప్రయత్నం చేస్తుండగా..

‘రవీ.. అరటిపండ్ల్లు కావాలా! ఇటురా.. అవును ఈయన మీ తాతయ్యే కదూ..!’ అని అడిగాడు అరటిపండ్లు అమ్మే వ్యక్తి. ‘ఇంతకూ మీకూ రవికి పరిచయం ఏంటి?’ అని అడిగారు తాతయ్య ఆ మనిషిని.

‘నేను రవికి పాఠాలు చెప్పే మాస్టార్ని. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నేను పనిచేసే పాఠశాల చాలా నెలల నుంచి మూతపడి ఉంది. పిల్లలు రారు. ఫీజులు రావు. అందుకే మాకు జీతాలూ లేవు. కుటుంబాన్ని పోషించడానికి ఈ పని చేస్తున్నా. ఇది నాకు అలవాటైన పనే. మా నాన్న ఈ పని చేసే నన్ను చదివించారు. ఇప్పుడు నాకు ఇదే దిక్కైంది. ఏం తప్పంటారా?’ అని అడిగారు మాస్టారు.

‘లేదు సార్‌. దొంగతనం చేయడం తప్పు కానీ.. కష్టపడి పనిచేయడం నేరమూ కాదు.. నామోషీ అంతకన్నా కాదు’ అని తాతయ్య మాస్టారుతో అన్నారు.

బజారు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రవి అన్నం త్వరగా తినేసి... ‘తాతయ్యా.. నేను పొలానికి వెళ్తున్నాను. కాసేపు నాన్నకు సాయం చేసి వస్తా..’ అని అన్నాడు. తాతయ్య చాలా సంతోషించారు. ‘మాస్టారు బడిలోనే కాదు.. జీవితంలోనూ మంచి పాఠాలు నేర్పారు మా రవికి’ అనుకున్నారు.

- మీగడ రవీంద్రస్వామి, చోడవరం


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని