close

తాజా వార్తలు

Updated : 11/09/2020 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాజును మెప్పించిన వల్లభుడు

సుగంధపుర అనే దేశాన్ని రాజు చిత్రసేనుడు పరిపాలించేవాడు. రహస్య గూఢచారి పదవికి అర్హుడిని ఎంపిక చేయాలని మహామంత్రిని ఆదేశించాడు. రాజు మాట ప్రకారం మంత్రి చాటింపు వేయించి పరీక్షలకు తేదీ ప్రకటించాడు. ఎంపికకు హాజరైన అభ్యర్థులందరికీ వివిధ పరీక్షలు నిర్వహించారు. అందులో సచ్చీలుడు, వల్లభుడు అనే ఇద్దరు తుది పరీక్షకు ఎంపికయ్యారు.

ఆ ఇద్దరిలో గూఢచారిగా పనిచేసేందుకు ఎవరు సరైనవారో నిర్ణయించేందుకు తెలివితేటలకు సంబంధించిన పరీక్ష పెట్టాలనుకున్నాడు మంత్రి. భటుల సాయంతో అందమైన ఒక పురాతన పెట్టెను తెప్పించి.. అందులో ఏముందో రేపటిలోగా మీరు చెప్పగలగాలి అన్నాడు. సచ్చీలుడు, వల్లభుడు పెట్టెను బాగా పరీక్షగా గమనించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు సచ్ఛీలుడు ఆస్థాన ప్రాంగణంలోకి వచ్చి ‘అంతటి పురాతన పెట్టెలో ఏముంటుందా? అని రాత్రంతా ఆలోచించాను. కొన్ని పాత గ్రంథాలను కూడా చదివాను. వంశపారంపర్యంగా వచ్చే విలువైన వజ్రవైఢూర్యాలు ఉండవచ్చు’ అని తన సమాధానం చెప్పాడు.

ఆ తర్వాత వల్లభుడు వచ్ఛి. రాజా! ఆ పురాతన పెట్టె మీకు వారసత్వంగా వచ్చింది. అప్పట్లో దాన్ని అత్యంత నైపుణ్యం కలిగిన పదిమంది వడ్రంగులు అయిదేళ్లు కష్టపడి తయారు చేశారు. పొడవు, వెడల్పు వివరాలు చెప్పబోతుండగా.. సచ్ఛీలుడు కల్పించుకొని ‘ఏంటి వల్లభా? పెట్టెలో ఏముందో చెప్పమంటే నువ్వు దాని చరిత్ర చెబుతున్నావు’ అని హేళనగా మాట్లాడాడు. వెంటనే మహామంత్రి లేచి ‘మహారాజా! పెట్టెలో ఏముందో తెలివితేటలతో ఆలోచించకుండా సచ్చీలుడు కేవలం గ్రంథాలపైనే ఆధారపడ్డాడు. వల్లభుడు మాత్రం తన విచక్షణతో సంతృప్తికర సమగ్ర వివరాలు సేకరించాడు. గూఢచారి అనే వ్యక్తి ఏదైనా క్లిష్టమైన సమస్యపై అవగాహన, ఆసక్తి పెంపొందించుకోవాలి. ఆ లక్షణం ఉన్న వల్లభుడు ఆస్థాన వడ్రంగుల వద్దకు వెళ్లి పెట్టెకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాడు’ అని అన్నాడు. పెట్టె లోపల ఏముందో చెప్పాలని వల్లభుడి వైపు చూసి ఆసనంలో కూర్చున్నాడు మహామంత్రి.

వల్లభుడు వినయంగా నమస్కరించి ‘మహారాజా! ఆ పెట్టె మీ ముత్తాత మీకు చిన్నతనంలో ప్రేమతో ఇచ్చిన బహుమతి. దాని కిందిభాగంలో ఓ మూలన కొన్ని అక్షరాలు కనిపించాయి. తీక్షణంగా చూస్తే మీ తాతగారి పేరు, పక్కన వీరత్వానికి గుర్తుగా నవరత్నాలు పొదిగిన కత్తి బొమ్మను గమనించాను. దీన్నిబట్టి లోపల కత్తి ఉంది అని నిర్ణయానికి వచ్చా’ అని ముగించాడు. వల్లభుడి పరిశీలనా శక్తిని మహారాజుతో సహా అంతా మెచ్చి, చప్పట్లతో కొనియాడారు. వెంటనే రాజ్యానికి గూఢచారిగా నియమిస్తూ రాజు ఆదేశించాడు.

- గెడ్డం సుశీలరావు, విశాఖపట్నంTags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని