
తాజా వార్తలు
మెరిపిద్దాం.. తేమతో!
కొంతమంది జుట్టు పొడిబారి.. చివర్లు చిట్లిపోతుంది. దానికితోడు వెంట్రుకలు రాలిపోవడం, తెగిపోవడం వంటి సమస్యలూ ఎదురవుతాయి. అలాకాకుండా ఉండాలంటే...
బొప్పాయిని మెత్తగా చేసి పెట్టుకోవాలి. దానికి నానబెట్టి రుబ్బిన పావుకప్పు మెంతిపిండిని చేర్చాలి. ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసుకుని ఇరవై నిమిషాలు ఉండనివ్వాలి. ఆపై మరోసారి వేళ్లతో మాడుని మృదువుగా మర్దనా చేసి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి నెలరోజులు చేసి చూడండి. జుట్టు మెరిసిపోతుంది.
* రెండు కప్పుల మునగాకుని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ ఆముదం, చెంచా పెరుగు కలిపి తలకు పూత వేసుకోవాలి. ఆపై షవర్‌క్యాప్ పెట్టి ఇరవై నిమిషాలాగి తలస్నానం చేయాలి. దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యంగా మారతాయి. దీనిలోని పోషకాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.
* కప్పు కలబంద గుజ్జు తీసుకుని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ రాసుకోవాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. చివరగా గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. ఇలా మూడు వారాలపాటు చేస్తే శిరోజాలు కొత్త నిగారింపుతో మెరిసిపోతాయి.