close

తాజా వార్తలు

Published : 19/09/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతుల కోసం... మిల్లెట్‌ మ్యూజియం!

అన్నం... కూర... పప్పు ఈ రొటీన్‌ లంచ్‌బాక్స్‌ మెనూ క్రమంగా మారుతోంది! కొర్రల ఉప్మా... రాగిసంగటి... సామ మురుకులు.. ఊదల పాయసం ఇలాంటివి మన రోజువారీ మెనూలో కొత్తగా చోటుదక్కించుకుంటున్నాయి.. వీటిని తినేవాళ్లు ఉన్నారు సరే... మరి పండించేవాళ్లు ఏరి? ‘మిల్లెట్‌ బ్యాంక్‌’, ‘మిల్లెట్‌ మ్యూజియం’లద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు విశాలారెడ్ఢి.

విశాల ప్రారంభించిన మిల్లెట్‌ మ్యూజియంలో అడుగుపెడితే... ధాన్యం దాచే గాదెలు, విత్తనాలు నిల్వ చేసే కుండలు... కొడవళ్లు.. కత్తులు... పలుగులు... పారలు... చుట్ట కుదుర్లు ఒక్కటేంటి వ్యవసాయానికి సంబంధించిన సమస్తం అక్కడ కనిపిస్తాయి. చిత్తూరు జిల్లా కుప్పం దగ్గరున్న ఎమ్‌కే పురం అనే కుగ్రామంలో ఉందీ మ్యూజియం. ‘ఒక కుగ్రామంలో వ్యవసాయానికి సంబంధించిన మ్యూజియం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? రైతుకు వ్యవసాయంలో ఓనమాలు నేర్పే సాహసం చేస్తున్నారా? అని మీరు అనుకోవచ్ఛు అక్కడికే వస్తున్నా. నేను హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. కొత్తగా స్టార్టప్‌లు పెట్టాలనుకునే యువతకు మెంటారింగ్‌ కూడా చేస్తుంటాను. ఇలాంటి నేపథ్యం ఉన్న నేను ఆ కుగ్రామంలో మట్టితో సావాసం చేస్తూ.. మిల్లెట్‌ బ్యాంకు, మ్యూజియం వంటివి పెట్టడానికి ఓ కారణం ఉంది. మా అక్కా వాళ్లు కర్ణాటకలో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం రెండెకరాల భూమిలో మా అక్క కొర్రలు పండించింది. ఆర్గానిక్‌ మెన్యూర్‌ వేసి చాలా జాగ్రత్తలు తీసుకుని పండించిందేమో పంట విరగపండింది. ప్రభుత్వ అధికారులు అక్కను పిలిచి సన్మానాలు చేశారు. తనతో ప్రసంగాలు కూడా ఇప్పించారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ... రెండేళ్లయినా ఆ పంట అమ్ముడుపోలేదు. దాంతో తను తెలిసినవాళ్లకి, బంధువులకి పంచిపెట్టింది. ఎందుకిలా జరిగిందని ఆరాతీస్తే... తృణధాన్యాల సాగులో ఎన్ని ఇబ్బందులున్నాయో అప్పుడే నాకు తెలిసింది. చాలామందికి వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియదు. దాంతో రైతులెవ్వరూ తృణధాన్యాలు సాగుచేయడానికి ముందుకు రావడం లేదు. మరోపక్క పిల్లలూ, మహిళల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. నీతిఆయోగ్‌ వంటి సంస్థలు మిల్లెట్స్‌ని పండిస్తే పోషకాహారలోపం తీరుతుందని చెబుతున్నాయి. అప్పుడే అనుకున్నా రైతులని తృణధాన్యాల సాగు దిశగా మళ్లిస్తే బాగుంటందని. అలా మిల్లెట్‌ బ్యాంకు ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చినా దాన్ని అమలు చేసింది మాత్రం ఆరునెలల క్రితమే’ అంటారు విశాలారెడ్ఢి

పాఠాలు నేర్పుతారు...

తొలి ప్రయత్నంగా రైతులతో కలిసి ఎమ్‌కే పురంలోనే 25 ఎకరాల భూమిలో తృణధాన్యాల సాగుకు శ్రీకారం చుట్టారు విశాల. ఇక్రిశాట్‌ వంటి సంస్థలు విత్తనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులూ భరోసా ఇవ్వడంతో వచ్చే సీజన్‌కల్లా మరో 250 ఎకరాల్లో ఈ సాగుచేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారామె. ‘ఎమ్‌కే పురం మా సొంతూరు. అందుకే మిల్లెట్‌ బ్యాంకుకు అక్కడ నుంచే శ్రీకారం చుట్టాను. మొదట్లో నాక్కావాల్సిన అరుదైన విత్తనాల కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎందుకంటే మన పెద్దవాళ్లు విత్తనాలు పాడవకుండా గాదెల్లో, కుండల్లో, బుట్టల్లో దాచిపెట్టేవారు. ఇప్పుడు అవేమి లేవు. అందుకే మళ్లీ పాత పద్ధతులనే రైతులకు తిరిగి పరిచయం చేయాలనుకున్నాను. మాకున్న పెద్ద హాలుని పెయింట్స్‌ వేసి సరికొత్తగా ముస్తాబు చేశాను. దీన్నే మ్యూజియం కమ్‌ మిల్లెట్‌ బ్యాంక్‌గా మార్చాను. రైతులతో పాటూ కళాకారులూ, విద్యార్థులు, ఎన్జీవోలు... వ్యవసాయ నిపుణులు ఇలా అందరినీ ఇన్‌వాల్వ్‌ చేశాను. రైతులకు వర్క్‌షాపులు, వెబినార్లు నిర్వహించడానికి వీలుగా ఓ పెద్దటీవీని అమర్చాం. ఆన్‌లైన్‌లో తమకొచ్చిన సందేహాలని తీర్చుకోవచ్ఛు అలాగే నిపుణుల సాయంతో రసాయనాలు వాడని ఆర్గానిక్‌ మెన్యూర్‌ తయారీ వంటివన్నీ ఇక్కడ నేర్చుకోవచ్ఛు ఈ సాగు గురించి కలెక్టర్‌తో చెబితే... ఆయన సంతోషించి రైతులకు తమ పూర్తి మద్దతు ఇస్తామన్నారు. మరో పక్క ఇక్రిశాట్‌ అధికారులు కూడా విత్తనాలు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే యాభైమందికి పైగా రైతులతో నెట్‌వర్క్‌ ఏర్పాటు ఏర్పాటు అయ్యింది. ఇప్పటికే కొన్ని పోషకాహార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నా. రైతుల నుంచి సేకరించిన ధాన్యాలని వాళ్లకి చేరవేస్తాం’ అంటున్నారు విశాలా రెడ్ఢి.


మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విశాలారెడ్ఢి.. ఐడెంటిసిటీ పేరుతో ఒక సంస్థని ప్రారంభించి డెస్టినేషన్‌ మార్కెటింగ్‌ విధానానికి తొలిసారిగా శ్రీకారం చుట్టారు. ఒక ప్రాంతం ప్రాధాన్యతని తెలియచేస్తూ సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌, ఆగస్ట్‌ఫెస్ట్‌ వంటి సదస్సుల ఏర్పాటులో ఆమె తనదైన ముద్ర వేశారు.

జ్యామితీ పేరుతో యువ వ్యాపారవేత్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కలినరీ లాంజ్‌, యాంప్లీఫై వంటి 30 వ్యాపారాలకు ఆమె దిశానిర్దేశం చేశారు.


 Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని