close

తాజా వార్తలు

Published : 19/09/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిటారు భవనం.. నిలువెత్తు వనం..

ఇక్కడి ఇంటికి ఇటలీ అందం

విస్తరిస్తున్న హరిత ఆకాశహర్మ్యాలు

ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణాల్లో సరికొత్త పోకడలు వస్తున్నాయి. నగరంలో కొత్తగా కడుతున్న గృహ, వాణిజ్య భవనాలను పర్యావరణ హితంగా ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండటంతో ఈ మేరకు బిల్డర్లు అంతర్జాతీయ స్థాయిలో హరిత భవనాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులోనూ ఎవరికివారు తమ ప్రత్యేకత చాటేందుకు పోటీపడుతున్నారు. కొనుగోలుదారుల్లో హరిత భవనాలపై అవగాహన పెరగడంతో నిర్మాణ సంస్థలు కొత్తదనం చూపేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇటలీలోని హరిత భవనాల స్ఫూర్తిగా నిటారు వనాలతో ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నాయి.

నగరంలో ఇళ్లను చూస్తే కాంక్రీట్‌ జంగిల్‌ మాదిరిగా తలపిస్తాయి. పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాలున్నచోట మినహా మిగతాచోట్ల పచ్చదనం పెద్దగా కన్పించదు. అభివృద్ధి పేరుతో ఈ భూముల్లోనూ పచ్చదనంపై వేటూ పడుతూనే ఉంది. మరోవైపు వాహనాల విస్పోటనంతో కాలుష్యం అధికం అవుతోంది. ప్రశాంతంగా, కాలుష్యానికి దూరంగా ఉందామనుకునేవారు శివార్లకు వెళుతున్నారు. వ్యక్తిగత ఇళ్లు, విల్లాల వైపు మొగ్గుచూపుతున్నారు. వృత్తి, ఉపాధిరీత్యా దూరంగా వెళ్లలేనివారు సిటీ మధ్యలోనే ఉంటున్నా హరిత భవనాలు పెద్దగా అందుబాటులో ఉండేవి కాదు. ఐటీ కారిడార్‌తోపాటూ ఇప్పుడిప్పుడే సెంట్రల్‌ హైదరాబాద్‌లోనూ ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.

ఆరోగ్యంగా ఉండేలా..

హరిత భవనాలంటే పచ్చదనం మాత్రమే కాదు. ఆ ఇంట్లో ఉండేవారు, ఆ కార్యాలయంలో పనిచేసేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా.. పర్యావరణానికి హాని తగ్గించేదిలా ఉండటం ముఖ్యం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దేశంలో ఇప్పటి వరకు చేపట్టిన హరిత భవనాలు, విదేశాల్లో నిర్మించిన భవనాల ఆర్కిటెక్చర్‌ను అధ్యయనం చేసిన తర్వాత మన బిల్డర్లు రంగంలోకి దిగుతున్నారు. ఇటలీలోని హరిత భవనాలను మనవాళ్లు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.

ఫ్లాట్‌ చుట్టూ..

హరిత భవనాలన్నీ ప్రస్తుతానికి విలాస వంతంగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నవే. దీంతో ప్రతి అంతస్తులో రెండు ఫ్లాట్లు మాత్రమే ఉండేలా విశాలంగా నిర్మిస్తున్నారు. ప్రతి గదికి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అపార్ట్‌మెంట్‌లో మొక్కలు పెంచుకోలేక పోతున్నామనే దిగులు లేకుండా ప్రతి ఫ్లాట్‌ చుట్టూ రెండు మీటర్ల జాగా వదిలేస్తున్నారు. వ్యక్తిగత ఇళ్లలో చుట్టూ తిరగడానికి ఖాళీ జాగా వదిలినట్లే బహుళ అంతస్తుల్లోనూ కొందరు బిల్డర్లు స్థలాన్ని వదులుతున్నారు. చుట్టూ మొక్కలు పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వేడిని గ్రహించని ఇటుకలు..

హైదరాబాద్‌లో వేసవి కాలంలో ఎక్కువ వేడి ఉంటుంది. తట్టుకోలేక ఏసీల వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఇది పర్యావరణానికి హాని చేసేదే. హరిత భవనాల్లో నిర్మాణ సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ వేడిని గ్రహించే ఇటుకలు కాకుండా తక్కువగా గ్రహించే ఎర్రమట్టి ఇటుకలను వినియోగిస్తున్నారు. స్థానికంగా కొందరు ప్రత్యేకంగా తయారు చేయిస్తుంటే... మరికొందరు కేరళ నుంచి తెప్పిస్తున్నారు. వీటి వాడకంతో గది లోపల ఉష్ణోగ్రత 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువ ఉంటుందని బిల్డర్లు చెబుతున్నారు. వర్షపు నీరు ఇంకేలా 700 అడుగుల లోతు ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌ వేసి ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

స్థలం లభ్యత తగ్గిపోవడంతో..

ఇప్పటివరకు ఆకాశహర్మ్యాల భవనాలను గమనిస్తే మొత్తం విస్తీర్ణంలో 20 నుంచి 30 శాతం మాత్రమే నిర్మాణాలు వచ్చేవి. మిగతా స్థలాన్ని పచ్చదనం, చిట్టడవులు, ఆటస్థలాలు, సౌకర్యాల కోసం కేటాయించేవారు. శివార్లలో ఎక్కువ స్థలం అందుబాటులో ఉన్నచోట ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఎక్కువ వచ్చాయి. ప్రస్తుతం అటు ఐటీ కారిడార్‌లోగానీ, నగరం మధ్యలో కానీ స్థలాల లభ్యత తగ్గిపోయింది. దీంతో నిబంధనల మేరకు స్థలం వదిలి మిగతా మొత్తం ఎత్తైన భవంతులు కడుతున్నారు. ప్రతి రెండు అంతస్తులకు ఒక చెట్టు పెంచుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా బిల్డింగ్‌ డిజైన్‌ రూపకల్పన చేస్తున్నారు. 30 అంతస్తుల భవనం ఉంటే కింది నుంచి పైకి ప్రతి రెండు అంతస్తులకు ఒకటి చొప్పున 15 చెట్లు ఉంటాయి. ప్రతి ఫ్లాట్‌లో వందల మొక్కలను పెంచుకోవచ్ఛు.


ఉక్కు, ఆర్‌ఈసీ బాల్కనీలు..

ఇటలీలోని మిలాన్‌లో 2014లో నిర్మాణం పూర్తిచేసుకున్న ‘బాస్కో వర్టికల్‌’ భవనం ఆధునిక హరిత భవనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా మారింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. మరెన్నో విశిష్టతలు ఈ భవనం సొంతం. రెండు టవర్లలో ఒకటి 18 టవర్లు, మరోటి 26 అంతస్తులు ఉంటుంది. నిలువెత్తు అడవి పేరుతో పిలిపించుకుంటున్న ఈ భవనంలో 900 చెట్లు, 5000 పొదలు ఉన్నాయి. 11 వేల శాశ్వత మొక్కలు పెంచారు. సౌర విద్యుత్తు, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగంతో భవనం స్వయం సమృద్ధిగా గుర్తింపు పొందింది. వందల చెట్లు, వాటికి పోసే నీటితో భవనం తట్టుకుంటుందా అనే సందేహాలు రావడం సహజం. అందుకోసం ఇంజినీర్ల బృందం వృక్ష, ఉద్యాన శాస్త్రవేత్తలతో మాట్లాడి బాల్కనీలను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఉక్కు, ఆర్‌ఈసీ బాల్కనీలను 1.30 మీటర్ల పిట్టగోడలతో 28 సెం.మీ. మందంతో నిర్మించారు. ఈ తరహా హరిత నిర్మాణాలను స్విట్లర్లాండ్‌, నెదర్లాండ్‌, చైనాలోని వేర్వేరు నగరాల్లో నిర్మిస్తున్నారు. హైదరాబాదీ బిల్డర్లు పలువురు ఇటలీ బాస్కో వర్టికల్‌ను స్ఫూర్తిగా తీసుకుని నిర్మాణాలు ప్రారంభించాయి. వీటి అధ్యయనానికే మూడు నాలుగేళ్లు సమయం కేటాయించారంటే వారు ఈ ప్రాజెక్ట్‌లను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్ఛు.Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని