
తాజా వార్తలు
ముకేశ్ అంబానీ ఏంచెప్పారంటే...
‘అంగ్రేజీ మీడియం’ సినిమా చూశారా? లండన్ వెళ్లి చదువుకోవాలనుకున్న కూతురు కోసం తండ్రి ఇర్ఫాన్‌ఖాన్ నానాతంటాలుపడతాడు... జ్యోతిదేశ్‌పాండే కూడా ఎంబీయే చదవడం కోసం ట్యూషన్లు చెప్పి పైసాపైసా కూడబెట్టింది.. ఈ రెండింటికీ సంబంధం ఏంటంటే... అంగ్రేజీ మీడియం సినిమా నిర్మాత జ్యోతినే! బాలీవుడ్లో విజయవంతమైన నిర్మాతగానే కాదు.. ప్రతిష్ఠాత్మక రిలయెన్స్ మీడియా హెడ్‌గానూ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారామె..
ఆరునెలల పసిపాపగా ఉన్నప్పుడు న్యుమోనియా బారిన పడింది జ్యోతి. ఆ సమస్య నుంచి బయటపడిందోలేదో... ఓరోజు నేలమీద పాకుతున్న ఆ పాప కాస్తా అక్కడ నుంచి కదల్లేక గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. డాక్టర్‌కి చూపిస్తే... పోలియో వ్యాక్సిన్ వికటించిందనీ, ఆ ప్రభావం ఎడమకాలిపై పడిందనీ చెప్పారు. జ్యోతి వాళ్లది ముంబయి. తండ్రి జర్నలిస్టు. ‘నువ్వు చేయలేని వాటి గురించి ఆలోచించకు... చేయగలిగిన వాటిని మాత్రం ది బెస్ట్‌గా చెయ్. నువ్వు వేగంగా పరుగుపెట్టలేకపోవచ్ఛు కానీ చెస్ ఆడగలవు కదా!’ అంటూ ఎదుగుతున్న వయసులో తండ్రి అన్నమాటల్ని ఆమె బాగా గుర్తు పెట్టుకుంది. ఆయనిచ్చిన స్ఫూర్తితోనే చదువుల్లో, ఆటల్లో రాణించింది. స్కూల్ హెడ్‌గర్ల్‌గా మారింది. గల్లీ క్రికెట్‌ని ఇష్టంగా ఆడేది. నార్సీమంజీ కాలేజీ నుంచి కామర్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది. ఆ సమయంలో ఇంటర్, హైస్కూల్ పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. ఎంబీఏ చదవడానికి ఆ డబ్బుని పొదుపు చేసుకుంది. ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తిచేసిన వెంటనే బ్రిటన్‌కి చెందిన మైండ్షేర్ మీడియాలో సీనియర్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ తరువాత కాలేజీలో తనతోపాటూ చదువుకున్న సంజయ్దేశ్పాండేని పెళ్లిచేసుకుని లండన్‌లో తన కెరీర్‌ని కొనసాగించింది జ్యోతి. కొన్నాళ్లు జీ నెట్వర్క్కి సేల్స్ మార్కెటింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ ఉద్యోగాలన్నీ ఒకెత్తయితే ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా జ్యోతి కెరీర్‌ని కీలకమైన మలుపు తిప్పింది.
అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ...
ముంబయికి చెందిన ఎరోస్ మీడియా దేశంలోనే పేరున్న సినిమా డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ. ఏడాదికి అరవై నుంచి డెబ్బై సినిమాలను పంపిణీ చేసే ఈ సంస్థ జ్యోతిలోని వ్యాపార చాతుర్యాన్ని పసిగట్టింది. భారతీయ సినిమాల్ని విదేశాల్లో డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యతని ఆమెకి అప్పగించింది. ఆ పనిని విజయవంతంగా పూర్తిచేసిన జ్యోతి ఎరోస్లో 18 సంవత్సరాలకుపైగానే పనిచేసి ఆ సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టింది. మనకు ఓటీటీ సర్వీసుల గురించి పెద్దగా పరిచయం లేనప్పుడే ఎరోస్లో డిజిటల్ లైబ్రరీకి శ్రీకారం చుట్టిందామె. సినిమాలు, సీరియల్స్ అన్నింటినీ ఒకచోటికి చేర్చి ఎరోస్ని అతిపెద్ద వినోద లైబ్రరీగా మార్చేసింది. మరోపక్క మీడియాలో తనకున్న అనుభవంతో నిర్మాతగానూ మారింది. పదేళ్ల క్రితం అక్షయ్‌కుమార్, జాన్అబ్రహం హీరోలుగా ‘దేశీబాయ్స్’ చిత్రాన్ని నిర్మించింది. రూ.80 కోట్ల రూపాయలు వసూలు చేసిందీ చిత్రం. తనలో ఒక ఉద్యోగి మాత్రమే కాదు... వ్యాపారవేత్తకూడా ఉంది అని గ్రహించిన ఆ క్షణం నుంచి వీలుచిక్కినప్పుడల్లా చిత్రాలని నిర్మిస్తూనే ఉంది. కొంతకాలం బ్రిటిష్ ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్‌లో కీలకమెంబర్గానూ వ్యవహరించిందామె.
జియో స్టూడియో ఏర్పాటు...
రెండేళ్ల క్రితం రిలయెన్స్ మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగానికి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకుంది జ్యోతి. అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీసుల్లో జియో కూడా ఒకటి. పదకొండు భాషలకి సంబంధించిన సినిమాలు, వెబ్‌సిరీస్, మ్యూజిక్ వంటి విభాగాల్ని ఆమె పర్యవేక్షించాలి. సుమారు 16 కోట్ల మంది చందాదారుల ఇష్టాయిష్టాలని గ్రహిస్తూ ముందుకు నడవాలి. ‘నేనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు నన్నో ఉద్యోగిగా కాకుండా వ్యాపారవేత్తగా ఆలోచించమని అన్నారు ముకేశ్ అంబానీ. ఆయనిచ్చిన స్ఫూర్తితోనే వందమంది బృందంతో కలిసి ‘జియో స్టూడియోస్’ ఏర్పాటు చేశా. స్త్రీ పేరుతో 15 కోట్ల పెట్టుబడితో ఒక చిత్రాన్ని తీశాం. అది 150 కోట్లరూపాయల లాభాల్ని ఆర్జించింది. ఇలాంటివే మరికొన్ని ప్రయోగాలు. అన్నీ విజయవంతమయ్యాయి’ అంటోంది జ్యోతి. ఇలాంటి కీలకమైన వ్యవహారాలు చక్కబెట్టేటప్పుడు మీపై ఒత్తిడి ఉండదా అంటే ..‘ఎందుకు ఉండదు... ఉంటుంది. నేనీ పని చేయలేనేమో వంటి నెగిటివ్ ఆలోచనలు ఎవరికైనా వస్తుంటాయి. అవి రాకుండా చేయడం మనవల్ల కాదు. వాటికి బదులుగా పాజిటివ్ ఆలోచనలు చేయడమే ఇందుకు పరిష్కారం’ అంటోందామె. ఒత్తిడిని తగ్గించేందుకు విపాసనతో పాటూ రోజుకు రెండు సార్లు ధ్యానం చేస్తా అని చెబుతుంది.
ఆ భావన నుంచి బయటపడి...
పిల్లల పెంపకం... కెరీర్.. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు చాలామంది పిల్లల పెంపకానికే ఓటేస్తారు. ఒక వేళ కెరీర్‌కు ఓటేస్తే మాత్రం పిల్లల పెంపకాన్ని మిస్ అయినందుకు జీవితాంతం గిల్ట్‌గా భావిస్తారు. అదే తప్పంటారు జ్యోతి. ‘నా కూతురుకి 11 ఏళ్ల వయసున్నప్పుడు నేను కెరీర్లో కీలకమైన అడుగులు వేశా. తనకి కొంత సమయం కేటాయిస్తూనే నా కెరీర్లోనూ కీలకమైన మార్పులు చేసుకున్నాను. తనకిప్పుడు 21 సంవత్సరాలు. లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేస్తోంది. సంప్రదాయ ఆలోచనల నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసిన ప్రతీసారి మహిళలు అపరాధభావంలో కూరుకుపోతారు. ముఖ్యంగా కెరీర్‌కోసం మాతృత్వంతో రాజీపడాల్సిన ప్రతిసారీ ఈ భావన రెట్టింపు అవుతుంది. ఆ ఆలోచన నుంచి బయటపడితేనే మనం కెరీర్‌ని ఆస్వాదించగలం’ అంటోంది జ్యోతి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
