close

తాజా వార్తలు

Updated : 22/09/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జబ్బులకు విరుగుడు విషతుల్యాల నిర్మూలనే!

శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. జబ్బులను తనను తాను నయం చేసుకుంటుంది. ఆ మాటకొస్తే జబ్బుల బారినపడకుండా నిరంతరం కాపాడుకుంటూనే ఉంటుంది. కాకపోతే- దానికి కొంత సమయం ఇవ్వాలి. ఓ అవకాశం ఇవ్వాలి. మన సనాతన వైద్య పద్ధతులన్నింటి సారమిదే. ప్రకృతి చికిత్స కావొచ్చు, సంప్రదాయ చికిత్సలు కావొచ్చు, ఆయుర్వేదం కావొచ్చు, యోగా కావొచ్ఛు అన్నింటి ఉద్దేశం ఒకటే. భూమి, గాలి, అగ్ని, ఆకాశం, నీరు.. ఇలా పంచ భూతాల సమాహారమైన దేహాన్ని వీటి సాయంతోనే ప్రాణశక్తిని తిరిగి ఉత్తేజితం చేయటం. జబ్బులను మూలం నుంచి తొలగించటం. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో వెలసిన సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌ సంకల్పమూ ఇదే. జబ్బుల పని పట్టటానికి రకరకాల చికిత్సలు అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. వీటిల్లో ప్రధానమైంది ఒంట్లో పేరుకుపోయే విషతుల్యాల నిర్మూలన. ఏమిటీ చికిత్స? ఎలా చేస్తారు? వీటి గురించి విపులంగా చెబుతున్నారు సెంటర్‌ డైరెక్టర్‌ డా|| అర్చన. జీవనశైలితో ముడిపడిన సమస్యలను జీవనశైలిని మార్చుకోవటం ద్వారానే నయం చేసుకోవచ్చని, వీటి బారినపడకుండానూ కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు.

న ఒంట్లో నిరంతరం రకరకాల జీవక్రియలు జరుగుతుంటాయి. వీటి మూలంగా కొన్ని వ్యర్థాలు, మలినాలు పుట్టుకొస్తుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోవటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. లేకపోతే ఇవన్నీ లోపలే పేరుకుపోయి విషతుల్యాలుగా (టాక్సిన్స్‌) మారిపోతాయి. ఇవే క్రమంగా జబ్బులుగా మారతాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, థైరాయిడ్‌ సమస్యల వంటి జీవనశైలి జబ్బులకు ఇదే మూలం. మరి విషతుల్యాలను బయటకు పంపిస్తే? జబ్బులూ వాటంతటవే నయమవుతాయి. చెత్తను ఎప్పటికప్పుడు ఊడ్చేస్తుంటే ఇల్లు అందంగా కళకళలాడుతుంటుంది కదా. అలాగే మలినాలను, విషతుల్యాలను తొలగించుకుంటే శరీరమూ నిత్య ఆరోగ్యంతో తొణికిసలాడుతుంది. ఇందుకు జీవనశైలిని మార్చుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆహార అలవాట్ల మార్పు గుణాత్మకమైన ఫలితాన్ని కనబరుస్తుంది. నిజానికి ఆహారమే ఔషధం. సరైన ఆహార పద్ధతులను పాటించినా చాలు. విషతుల్యాలు, మలినాలు పోగుపడకుండా చూసుకోవచ్ఛు ఒకవేళ పోగుపడినా జీర్ణకోశానికి కాసింత విరామం ఇవ్వటం, ద్రవాహారం తీసుకోవటం ద్వారా ఎప్పటికప్పుడు తొలగించుకోవచ్ఛు ఒక రకంగా దీన్ని ఆహార చికిత్స అనీ అనుకోవచ్ఛు దీనికి తోడు ప్రాణాయామం, ధ్యానం వంటి యోగ పద్ధతులు పాటిస్తే మనసులోని మాలిన్యాలూ తొలగిపోతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

ఏమిటీ విషతుల్య నిర్మూలన

విషతుల్యాల నిర్మూలనకు సంప్రదాయ వైద్య చికిత్సలు ఆది నుంచీ ఎంతో ప్రాధాన్యమిచ్చాయి. మొక్క ఎండిపోతే ఆకులకు చికిత్స చేస్తే ఏం లాభం? వేళ్లు బాగుంటేనే పోషకాలు బాగా లభిస్తాయి. మొక్క నిగనిగలాడుతుంది. శరీరం కూడా అంతే. దీనికి వేళ్లు మన జీవనశైలే. దీన్ని బాగుంచుకుంటే ఆరోగ్యమూ బాగుంటుంది. ఉత్సాహంతో తొణికిసలాడుతుంది. మన శరీరానికి సమస్త శక్తిని సమకూర్చేది ఆహారమే. జీర్ణక్రియ సజావుగా సాగితే పోషకాలూ సరిగా అందుతాయి. మనసూ కుదురుగా ఉంటుంది. అందుకే ఏం తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? అనే వాటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి. ఇష్టం వచ్చినట్టు, ఏది పడితే అది తినటం సరికాదు. ఇది ఒక్క జీర్ణకోశాన్నే కాదు, అన్ని అవయవాల పనితీరునూ అస్తవ్యవస్తం చేస్తుంది. వేళాపాళ లేని, ఇష్టానుసార ఆహార అలవాట్లు విషతుల్యాలు పోగు పడటానికి దారితీస్తాయి. ఆహార పద్ధతులు, సమయాలను మార్చుకోవటం ద్వారా వీటిని తొలగించుకోవచ్ఛు విషతుల్యాల నిర్మూలలో ఇదే ముఖ్యం. ముందుగా ద్రవాలతో ఆరంభించి.. క్రమంగా ఘనాహారం.. అదీ మితాహారానికి మారేలా చూడటం దీని ప్రత్యేకత.

ద్రవాలతో ఆరంభం

విషతుల్యాలను బయటకు వెళ్లగొట్టటానికి ద్రవాలు, రసాలు, కూరగాయలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టే విషతుల్యాల నిర్మూలనకు ఉద్దేశించిన ఆహార చికిత్సలో ముందుగా 2-3 రోజుల పాటు ద్రవాహారమే ఇస్తారు. ఒకరకంగా దీన్ని ఉపవాసం అనే అనుకోవచ్ఛు ఇది కొందరికి 5-7 రోజుల వరకూ అవసరపడొచ్ఛు శరీర తత్వం, ఆయా జబ్బులను బట్టి ద్రవాలు, రసాలను ఇస్తారు. ఉదాహరణకు- ఒంట్లో ఆమ్లతత్వం గలవారికి అల్లం రసం నీళ్లు, బరువు ఎక్కువగా ఉన్నవారికి దాల్చిన చెక్క నీళ్లు ఉపయోగపడతాయి. నిమ్మరసంలో విటమిన్‌ సి ఉంటుంది. ఇది విషతుల్యాల నిర్మూలనకు బాగా తోడ్పడుతుంది. యూరిక్‌ ఆమ్లం ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అందుకే విషతుల్యాల నిర్మూలనలో నిమ్మరసం కలిపిన నీళ్లకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇది ఎనీమా ఇవ్వటానికీ ఉపయోగపడుతుంది.

* ద్రవాహార చికిత్స అనంతరం నెమ్మదిగా పండ్ల రసాలు, కూరగాయల రసాలు ఆరంభిస్తారు. ఆ తర్వాత క్రమంగా ఆయా కాలాల్లో దొరికే కూరగాయలు ఉడికించి గానీ జీర్ణశక్తిని బట్టి పచ్చి కూరగాయ ముక్కలను గానీ ప్రారంభిస్తారు. వీటికి శరీరం అలవాటు పడిన తర్వాత రాగుల వంటి చిరుధాన్యాలతో చేసిన కిచిడీలాంటి తేలికైన ఘనాహారం మొదలెడతారు. దీంతో క్రమంగా విషతుల్యాలు తొలగిపోయి శరీరం జబ్బులను నయం చేసుకునే స్థితికి చేరుకుంటుంది. ఆహారం విషయంలో ఆయా జబ్బులనూ పరిగణనలోకి తీసుకొని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఇస్తారు. వ్యక్తుల జీవనశైలి, జబ్బులను బట్టి ఎన్నిరోజులు చికిత్స అవసరమనేది ఆధారపడి ఉంటుంది.

వారానికి ఒకరోజు ద్రవాహారమే

విషతుల్య నిర్మూలన చికిత్స తీసుకొని, ఇంటికి వెళ్లిన తర్వాతా జాగ్రత్తలు పాటించటం మంచిది. ముఖ్యంగా వారానికి ఒకరోజు ద్రవాహారం తీసుకోవాలి. దీంతో అప్పటివరకూ పోగుపడిన మలినాలను తొలగించుకోవచ్ఛు మనం సమాజంతో కలిసి జీవించాల్సిందే. ఆచారాలను, వ్యవహారాలను మన్నించాల్సిందే. పండుగలు, పబ్బాలు, వేడుకల వంటి వాటిని కాదనలేం. ఎప్పుడైనా కాస్త ఎక్కువగా తినకుండా ఉండలేకపోవచ్ఛు అయినా కూడా కొన్ని జాగ్రత్తలతో విషతుల్యాలు పేరుకుపోకుండా చూసుకోవచ్ఛు ఉదాహరణకు- ఎప్పుడైనా రాత్రిపూట హోటల్‌కు వెళ్లాలని అనుకున్నారనుకోండి. ఆరోజు మధ్యాహ్న భోజనం మానేసి, దానికి బదులు సలాడ్లు తినటం మంచిది. దీంతో హోటల్‌లో కాస్త ఎక్కువగా తిన్నా ఇబ్బంది ఉండదు. ఆ మర్నాడు ద్రవాహారం తీసుకోవాలి. ఒకవేళ 2, 3 రోజుల పాటు బయటకు వెళ్లాల్సి వచ్చిందనుకోండి. ఇంటికి తిరిగివచ్చిన వెంటనే ఒకరోజు ద్రవాహారానికే కేటాయించుకోవాలి.

నీటికీ లెక్కుంది!

అందరూ ఒకేలా నీళ్లు తాగాలనేమీ లేదు. శరీర అవసరాలకు అనుగుణంగా నీరు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తమ్మీద రోజుకు 10 గ్లాసుల నీరు, ద్రవాలు తాగేలా చూసుకోవాలి. ఉదయం 3 గ్లాసులు, అల్పాహారానికి ముందు ఒక గ్లాసు, స్నానం చేసిన తర్వాత గ్లాసు నీళ్లు తాగాలి. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు, భోజనం చేసిన 45 నిమిషాల తర్వాత గ్రీన్‌ టీ, మరో 10 నిమిషాల తర్వాత గ్లాసు నీళ్లు తాగాలి. రాత్రి భోజనానికి అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగాలి. వీలుని బట్టి పండ్ల రసాలు తీసుకోవచ్ఛు


మానసిక సంతులనానికీ..

క్క శరీరం బాగున్నంత మాత్రాన సరిపోదు. మనసూ బాగుండాలి. ఒంట్లోని విషతుల్యాలనే కాదు, మనసులోని మాలిన్యాలనూ తొలగించుకోవటం చాలా ముఖ్యం. మన రోజువారీ ఆలోచనలు మనసులో పాతుకుపోవచ్ఛు ఇవి ఒత్తిడికి దారితీయొచ్ఛు ఇందుకు యోగ క్రియలు, ధ్యానం, ప్రాణాయామం వంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. విషతుల్య నిర్మూలన చికిత్సలో వీటినీ సాధన చేయిస్తారు. చెడు ఆలోచనలు బయటకు వెళ్లిపోయి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


రోజంతా పద్ధతిగా..

రోగ్య సంరక్షణ అనేది మన బాధ్యతే. ఏదో చికిత్స తీసుకున్నాం. ఇక అంతా బాగైపోయిందని అనుకోవటానికి లేదు. నిత్య జీవనంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స సమయంలో పాటించిన నియమాలను కొనసాగించటం అత్యవసరం.

* రోజును నీళ్లు తాగటంతోనే మొదలెట్టాలి. ఉదయం పూట 3 గ్లాసుల నీళ్లు తాగటం మంచిది.

* అనంతరం నానబెట్టిన బాదం, అక్రోట్లు.. గ్రీన్‌ టీ తీసుకోవచ్ఛు

* అల్పాహారంగా తేలికైన పదార్థాలు తీసుకోవాలి. ఇందులో మొలకలు ఉంటే మరీ మంచిది. మాంసాహారులైతే గుడ్డు తీసుకోవచ్ఛు వారంలో 3 రోజులు పండ్లు తీసుకోవటం మేలు.

* ఉదయం 11 గంటలకు ఆయా కాలాల్లో దొరికే ఏదైనా పండు ఒకటి తినాలి.

* మధ్యాహ్న భోజనంలో సలాడ్లు, పప్పు, కూరలు, అన్నం, మజ్జిగ, పెరుగు వంటివన్నీ తినొచ్ఛు దంపుడు బియ్యం, చిరుధాన్యాలు ఏవైనా అన్నంగా తీసుకోవచ్ఛు మధుమేహులైతే చిరుధాన్యాలు తీసుకోవటం మంచిది.

* సాయంత్రం 4-5 గంటలకు ఒక చెంచాడు చొప్పున గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, కర్బూజా విత్తనాల వంటివి వేయించి తీసుకోవటం మేలు. వేయించిన మఖానా కూడా తీసుకోవచ్ఛు గ్రీన్‌ టీ తాగొచ్ఛు

* ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 7.30 గంటల లోపే రాత్రి భోజనం ముగించెయ్యాలి. అదీ చాలా తేలికగా ఉండాలి. ఆయా కాలాల్లో దొరికే కూరగాయలతో చేసిన సూప్‌.. ఓట్స్‌, కూరగాయలతో కూడిన కిచిడీ తీసుకోవచ్ఛు

* భోజనం చేసిన 40 నిమిషాల తర్వాత అల్లం, దాల్చిన చెక్క, తులసితో చేసిన టీ ఏదైనా తాగొచ్ఛు ఇది జీర్ణక్రియ మెరుగుపడటానికి తోడ్పడుతుంది.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని