
తాజా వార్తలు
భలే మంచి ఏనుగు!
పూర్వం రామాపురం, రంగాపురం అనే రెండు గ్రామాలు పక్కపక్కనే ఉండేవి. ఆ ఊర్ల మధ్యలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఎత్తైన చెట్లు, జంతువుల వింత శబ్దాలు, గుబురు గుబురు పొదలతో భయంకరంగా కనిపించేది. బాటసారులు నడిచివెళ్లేందుకు అడవిలో ఒకేఒక బాట ఉండేది.
రెండు గ్రామాల ప్రజలు పగలంతా ఎటువంటి భయం లేకుండా అడవి మీదుగా రాకపోకలు సాగించేవారు. రాత్రి అయితే మాత్రం భయపడేవారు. ఎందుకంటే కాలిబాట పక్కనే ఉన్న మర్రిచెట్టు చాటు నుంచి ఓ ఏనుగు రకరకాల వింత ప్రశ్నలు అడుగుతుండేది. వాటికి సరైన సమాధానాలు చెప్పిన వారిని ఏమీ చేయకుండా వదిలేసేది. చెప్పకపోతే ఇక అంతే సంగతులు. అందువల్ల చీకటి పడిన తర్వాత అడవిని దాటేందుకు ఎవరూ సాహసం చేసేవారు కాదు.
ఒకరోజు రామాపురంలో ఒక పండితుడి భార్యకు జబ్బు చేసింది. వారం రోజులు ఉండనని ముందే చెప్పి ఆ ఊరి వైద్యుడు పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లాడు. వైద్యుడు ఎప్పుడు వస్తాడోనని పండితుడు ఎదురు చూడసాగాడు. ఉన్నట్టుండి ఓరోజు ఆమె ఆరోగ్యం క్షీణించింది. పక్కనున్న రంగాపురం వెళ్లి.. అక్కడి వైద్యుడిని కలుద్దామంటే.. అప్పటికే చీకటి పడింది. అడవి దాటలేని పరిస్థితి. ఏనుగు ఏం ప్రశ్నలు అడుగుతుందో.. ఏం చేస్తుందోననే దడ.
భార్య అవస్థలు చూడలేక.. దేవుడి మీద భారం వేసి.. ధైర్యం కూడగట్టుకొని మందుల కోసం రంగాపురం బయలుదేరాడు. ఇంతలో మర్రిచెట్టు రానే వచ్చింది. పండితుడిని చూసిన ఏనుగు బిగ్గరగా ఘీంకరించింది. ఆ శబ్దానికి అతడు గజగజ వణికిపోయాడు.
‘ఏయ్! ఎవరు నువ్వు. ఎక్కడికి వెళ్తున్నావ్’ అని ప్రశ్నించింది ఏనుగు. నా భార్యకు జబ్బు చేసింది. సమయానికి వైద్యుడు అందుబాటులో లేడు. అందుకే రంగాపురం వెళ్తున్నా’ అని జవాబిచ్చాడు పండితుడు. ‘నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే వదిలేస్తాను. అడగమంటావా?’ అనడంతో అతడు భయపడుతూనే సరేనన్నాడు.
‘కాళ్లున్నా చురుగ్గా కదలలేనిది ఏది?’ అంటూ మొదటి ప్రశ్న అడిగింది ఏనుగు. ‘తాబేలు’ అని సమాధానమిచ్చాడు పండితుడు. ‘కాళ్లు లేకున్నా చురుగ్గా కదిలేది ఏది?’ అని అడగ్గా.. ‘పాము’ అన్నాడు. ‘ఒకే ఒక కాలున్నా ఊరంతా తిరిగి వచ్చేది ఏది?’ అని మూడో ప్రశ్న వేసింది ఏనుగు. చాలాసేపు ఆలోచించిన పండితుడు ‘బొంగరం’ అన్నాడు. ‘జీవులన్నింటిలో ఎక్కువ బలమున్నది ఏది?’ అని చివరిది అడిగింది. మళ్లీ ఆలోచనలో పడ్డాడు పండితుడు. దైవాన్ని తలచుకొని.. ‘ఉడుము’ అని సమాధానం చెప్పాడు.
‘అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పావు. నీవు రంగాపురం వెళ్లనవసరం లేదు. అడవిలో ఏ జంతువుకు ఆరోగ్యం బాగోలేకపోయినా నేనే వైద్యం చేస్తుంటా. ఆపదలో ఉన్నావు కాబట్టి.. నీ భార్యకు నయమయ్యేలా నేనే మంచి మందు ఇస్తా’ అని అంది ఏనుగు. కళ్లు మూసుకొని.. చేతులు చాచమని చెప్పింది. కొన్ని మూలికలను అతనికి అందించింది. వాటిని చూర్ణం చేసి నీళ్లలో కలిపి తాగించాలని సూచించింది. పండితుడు ఆ మందు తీసుకొని వెనక్కు తిరిగి చూడకుండా పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు. ఏనుగు చెప్పిన విధంగా భార్యకు దాన్ని తాగించాడు. రెండ్రోజుల్లో ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో దంపతులిద్దరూ మనసులోనే గజరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
- పుట్రేవు శ్రీనివాస్, విశాఖపట్నం
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- తాగడానికి తగని సమయముంటదా..!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- ఐసీయూలో భారత దిగ్గజ స్పిన్నర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
