
తాజా వార్తలు
హెచ్చుతగ్గులను తట్టుకునేలా...
స్టాక్మార్కెట్లో ఉండే హెచ్చుతగ్గులతో విసిగిపోయి స్థిరంగా ఒక మాదిరి లాభాలతో సంతృప్తిపడే వారికి అనువుగా ఉండేలా లార్జ్ క్యాప్ పథకాన్ని ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ప్రిన్సిపల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనే పేరుతో వచ్చిన ఈ ఈక్విటీ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ అక్టోబరు 12. కనీస పెట్టుబడి రూ.5,000. ప్రిన్సిపల్ లార్జ్ క్యాప్ ఫండ్ కింద 80- 85 శాతం నిధులను దేశీయ స్టాక్ మార్కెట్లోని లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడిగా పెడతారు. యూఎస్ స్టాక్ మార్కెట్లలో 50 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయటానికి 15 శాతం నిధులు కేటాయిస్తారు. ఇటు దేశీయ మార్కెట్లో, అటు యూఎస్ మార్కెట్లో ఉన్న వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకొని మదుపరులకు అధిక లాభాలు ఆర్జించాలనేది ఈ పెట్టుబడి వ్యూహంలోని ప్రధానోద్దేశం. దీని పనితీరును నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌తో పోల్చి చూస్తారు. సుధీర్ కేడియా దీనికి ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ఈ పథకంలోని విదేశీ పెట్టుబడులను అనిర్వన్ సర్కార్ పర్యవేక్షిస్తారు.
దీన్లో స్మార్ట్, మై గెయిన్ అనే ఆప్షన్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలినప్పుడు మదుపరుల పెట్టుబడిపై లాభాలు హరించుకుపోకుండా కాపాడటానికి స్మార్ట్ ఆప్షన్‌ను ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ రూపొందించింది. దీన్లో మదుపరుల సొమ్మును దశల వారీగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. మై గెయిన్ ఆప్షన్లో మదుపరులు తమ పెట్టుబడిపై నిర్దేశించిన ప్రతిఫలం రాగానే ఆ సొమ్మును ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఇతర పథకాలకు మళ్లించుకోవచ్చు.
చిన్న కంపెనీల షేర్లలో..
నష్టభయం అధికంగా ఉన్నప్పటికీ.. స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించాలనుకుంటున్నారా? 250 స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని నిప్పాన్ ఇండియా నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ కల్పిస్తోంది. ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 9. కనీస పెట్టుబడి రూ.5,000.
దీనికి ఫండ్ మేనేజర్‌గా మెహుల్ శర్మ వ్యవహరిస్తారు. లార్జ్ క్యాప్ ఫండ్లతో పోల్చితే స్మాల్ క్యాప్ ఫండ్లలో నష్టభయం ఎక్కువ. ఎందుకంటే... లార్జ్ క్యాప్ ఫండ్లు, ప్రధానంగా ఎన్నో ఏళ్లుగా తమ తమ రంగాల్లో స్థిరపడి మెరుగైన ఆదాయాలు, లాభాలు ఆర్జిస్తున్న పెద్ద కంపెనీల షేర్లపై పెట్టుబడి పెడతాయి. కాబట్టి ప్రతిఫలం మాట ఎలా ఉన్నప్పటికీ, నష్టాల పాలయ్యే అవకాశాలు తక్కువ. దీంతో పోల్చితే స్మాల్ క్యాప్ కంపెనీల పరిస్థితి పూర్తిగా భిన్నం. పనితీరు పూర్తిగా రుజువు కానీ, అప్పుడే నిలదొక్కుకుంటున్న కంపెనీలు ఈ విభాగంలో ఉంటాయి. కాబట్టి ‘ఫెయిల్యూర్ రేట్’ ఎక్కువ. అందువల్ల మదుపరుల పెట్టుబడికి నష్టభయం కూడా అధికం. కానీ అదే సమయంలో కొన్ని స్మాల్ క్యాప్ కంపెనీలు, మిడ్ క్యాప్ స్థాయికి చేరుకోవటమే కాకుండా ఆ తర్వాత లార్జ్ క్యాప్ కంపెనీలుగా వృద్ధి చెంది మదుపరులకు అనూహ్యమైన రీతిలో లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా రిస్కు ఎక్కువగా ఉన్న చోటే అధిక లాభాలు కూడా ఉంటాయి. ఇటువంటి ఆలోచనా ధోరణి ఉండటంతో పాటు రిస్కును తట్టుకోగల శక్తి ఉన్న మదుపరులు ఈ మ్యూచువల్ ఫండ్‌ను పరిశీలించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ‘యాక్టివ్లీ మేనేజ్డ్’ స్మాల్ క్యాప్ ఫండ్స్..., నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే అధిక ప్రతిఫలాన్ని నమోదు చేస్తున్నాయి. అదే సమయంలో స్మాల్ క్యాప్ తరగతికి చెందిన ఈక్విటీ షేర్లకు కొంత పెట్టుబడి కేటాయించి అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న మల్టీ క్యాప్ ఫండ్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను మదుపరులు పరిశీలించవచ్చు. అలా కాకుండా తమ పోర్ట్‌ఫోలియోలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఒకటి ఉండాలనుకునే మదుపరులకు నిప్పాన్ ఇండియా నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఒక పెట్టుబడి అవకాశమే.