
తాజా వార్తలు
ఫేషియల్ తరువాత ఇలా వద్దు!
నిర్జీవమైన చర్మాన్ని మెరిపించడానికి ఫేషియల్ చేయించుకోవడం మంచిదే. ఇది మృతకణాలను తొలగించి కొత్తవి వచ్చేలా చేస్తుంది. అయితే ఫేషియల్ చేయించుకున్న తరువాత చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. అలా కాకూడదంటే... వెంటనే ముఖం కడగొద్దు.. ఫేషియల్ చేయించుకున్నాక మూడు నాలుగు గంటల వరకు ముఖాన్ని కడగకూడదు. అలా చేస్తే చర్మంలో రసాయన చర్యలు జరిగే ప్రమాదముంది. ఆ తరువాత కూడా నీటితో ముఖాన్ని కడగాలి తప్ప సబ్బు, ఫేస్‌వాష్‌ను వాడొద్దు. ఎండలోకి వెళ్లొద్దు.. ఫేషియల్ చేసుకున్న వెంటనే ఎండలోకి వెళ్లే పొరపాటు అస్సలు చేయొద్దు. ఇలా చేయడంవల్ల చర్మం ఎరుపెక్కి దద్దుర్లు రావొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ముఖాన్ని వస్త్రంతో కప్పుకోండి.
వ్యాక్సింగ్ వెంటనే వద్దు...
ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకోవడమే కాకుండా అది చాలా సున్నితంగా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో వెంటనే ఫేస్ వ్యాక్సింగ్ చేయించుకోవద్దు. ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. నాలుగైదు రోజులు ఆగితే సరి. మేకప్ వద్దు... కొంతమంది ఫేషియల్ అయిపోయిన వెంటనే మేకప్ వేసుకుంటుంటారు. ఇలా చేస్తే చర్మానికి హాని జరుగుతుంది. ఫేషియల్ తరువాత చర్మానికి గాలి తగిలేందుకు కొంచెం సమయం ఇవ్వాలి.
ఫేస్‌ప్యాక్ వద్దు... ఫేషియల్ చేయించుకున్న ఒకట్రెండు రోజుల వరకు ఫేస్‌ప్యాక్ వేసుకోవద్దు. ఇలా చేస్తే స్కిన్ గ్లో తగ్గి నిర్జీవంగా కనిపిస్తుంది. ఫేషియల్ వల్ల ముఖం మెరవడానికి ఒకట్రెండు రోజులు పడుతుంది. కాబట్టి మీరు ముఖానికి పూతల్లాంటివి వారం తరువాతే అప్లై చేయాలి.