
తాజా వార్తలు
నేరాల లోగుట్టు విప్పే... ఫోరెన్సిక్ సైన్స్
ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతోన్న పరిణామాల కారణంగా ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల్లో చేరి భవితకు బాటలు వేసుకోవచ్చు!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య జరిగిందా? హథ్రస్ బాధితురాలిని హత్య మాత్రమే చేశారా? అత్యాచారమూ జరిగిందా? ఇటీవలి కాలంలో దేశంలో తీవ్ర దుమారానికి ఈ రెండు సంఘటనలూ కారణమయ్యాయి. అయితే ఈ పరిణామాల వెనుక ఉన్న అనుమానాలు.. నిజమో, కాదో నిర్ధారణ జరిగింది. వీటిని ఫోరెన్సిక్ నిపుణులు శాస్త్రీయంగా శోధించారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. వీటి వెనుక ఉన్న నిజాలను ఫోరెన్సిక్ నిపుణులు తమ పరిధిలో నిగ్గు తేలుస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నేరాలు, ఆర్థిక మోసాలు ఎక్కువయ్యాయి. వీటికి బాధ్యులైనవారిని గుర్తించి, చట్టం ముందు నిలబెట్టడానికి సాధారణ నైపుణ్యం సరిపోవడం లేదు. ఆధారాలు అన్వేషించి, అసలు దోషుల గుట్టు విప్పడానికి ఆవిర్భవించిందే ఫోరెన్సిక్ సైన్స్. ఇది కేవలం హంతకులను గుర్తించే శాస్త్రమే కాదు. మోసగాళ్లను పట్టించే దివ్యాస్త్రం కూడా. ముడుపులు తీసుకున్నవారినీ, మార్ఫింగ్ మోసగాళ్లనూ, వన్యమృగాల వేటగాళ్లనూ, పసిమొగ్గలపై పైశాచికాన్ని ప్రదర్శించినవారినీ.. కచ్చితత్వంతో పట్టుకుంటుంది. ఈ రంగంలో కెరియర్ అవకాశాలు విస్తరిస్తున్నాయి.
అవకాశాలిక్కడ..
ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు, ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఫోరెన్సిక్ నిపుణులను డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకుంటున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ), పోలీస్ శాఖల్లో ఉద్యోగాలుంటాయి. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్, మాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తదితర విభాగాల్లో కొలువులు పొందవచ్చు.
యూజీ నుంచి పీహెచ్డీ వరకూ...
ఫోరెన్సిక్ సైన్స్‌పై ఆసక్తి ఉన్న ఇంటర్ మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులు బీఎస్సీలో దీన్ని ఒక సబ్జెక్టుగా చదువుకోవచ్చు. అయితే తక్కువ సంఖ్యలో సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. యూజీలో సైన్స్, మ్యాథ్స్ కోర్సులు చదివినవారు పీజీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం జాతీయ స్థాయిలో కొన్ని ప్రత్యేకమైన సంస్థలూ ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులు అమలవుతున్నాయి. పీజీ అనంతరం పీహెచ్‌డీలో చేరవచ్చు. చాలా సంస్థలు సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. స్పెషలైజేషన్లు సైతం ఉన్నాయి.
ఎమ్మెస్సీ- డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎమ్మెస్సీ - హోం ల్యాండ్ సెక్యూరిటీ అండ్ యాంటీ టెర్రరిజం, ఎంబీఏ ఫైనాన్స్ (ఫోరెన్సిక్ అకౌంటింగ్), ఎంటెక్ - సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, పీజీ డిప్లొమా - ఫోరెన్సిక్ టాక్సికాలజీ, ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్, ఫింగర్ ప్రింట్ సైన్స్, క్రిమినాలజీ, ఫోరెన్సిక్ మేనేజ్మెంట్, ఫోరెన్సిక్ అకౌంటింగ్, ఫోరెన్సిక్ అడొంటాలజీ, ఫోరెన్సిక్ నర్సింగ్... తదితర కోర్సులను ఎన్నో సంస్థల్లో బోధిస్తున్నారు. అభ్యర్థులు ఆసక్తి, పూర్వ విద్యా నేపథ్యం ప్రకారం తమకు అనువైన కోర్సులో చేరవచ్చు.