close

తాజా వార్తలు

Published : 23/11/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నెగ్గితే నేర్పిస్తారు!

బ్యాంకింగ్‌ సేవల ఉత్తమ శిక్షణను మేటి బ్యాంకులో పొందే అవకాశం ఇప్పుడొచ్చింది!  దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌బీఐ..  గ్రాడ్యుయేట్లను ఎంచుకుని అప్రెంటిస్‌ శిక్షణను అందించబోతోంది. దేశవ్యాప్తంగా 8500 అప్రెంటిస్‌ అవకాశాలను ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 620, తెలంగాణకు 460 కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబరు 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అప్రెంటిస్‌లుగా దరఖాస్తు చేసుకోవాలంటే..
31.10.2020 నాటికి 20-28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఎస్‌సీ/  ఎస్‌టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి సాధారణ వయఃపరిమితులు రాజ్యాంగబద్ధంగా వర్తిస్తాయి.
అప్రెంటిస్‌గా ఎంపికైనవారికి మూడేళ్లు ఎస్‌బీఐలో పనిచేసే అవకాశం లభిస్తుంది. వీరికి మొదటి ఏడాది నెలకు రూ.15,000, రెండో ఏడాది నెలకు రూ. 16,500, మూడో ఏడాది రూ.19,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. అప్రెంటిస్‌ పోస్టు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం మాత్రం కాదు. మూడేళ్ల కాలపరిమితి కలిగిన అప్రెంటిస్‌షిప్‌ అవకాశం మాత్రమే. మూడేళ్ల తరువాత వారిని ఎస్‌బీఐ నుంచి రిలీవ్‌ చేస్తారు. ఒకరకంగా దీనిని తాత్కాలిక కాంట్రాక్ట్‌ పోస్టుగా చెప్పొచ్చు.
అప్రెంటిస్‌గా ఎంపికైనవారు ఎస్‌బీఐ బ్యాంకులోనే కాకుండా మార్కెటింగ్‌ కార్యకర్తగానూ పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాలవారీగా ఎంపిక ఉంటుంది. ఆయా అభ్యర్థులు గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలకు బ్యాంకింగ్‌ సేవలు వారి వద్దకే చేరేలా వ్యవహరించాల్సి ఉంటుంది. అదేవిధంగా పట్టణాల్లో నివసిస్తున్న వారికి ఎస్‌బీఐ సేవలు- క్రెడిట్‌ కార్డు, ఇన్సూరెన్స్‌, బంగారు రుణాలు, కొనుగోళ్లు తదితర సేవలను వివరిస్తూ వ్యాపార అభివృద్ధి జరిగేలా పనిచేయాల్సి ఉంటుంది.
ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల వారు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీల వారు ఉచితôగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ

రెండు అంచెల్లో జరుగుతుంది. మొదటగా ఆన్‌లైన్‌లో రాతపరీక్ష రాయాలి. దీనిలో అర్హత సాధించినవారికి స్థానిక భాష (లోకల్‌ లాంగ్వేజ్‌) పరీక్ష నిర్వహిస్తారు. దానిలోనూ అర్హత సాధించినవారిని మెరిట్‌ ఆధారంగా అప్రెంటిస్‌గా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ రాతపరీక్షలో 100 ప్రశ్నలకు 100 మార్కులు. 60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4వ వంతు రుణాత్మక మార్కులున్నాయి.
వెబ్‌సైట్లు: https://sbi.co.in/, https://bank.sbi/careers

వేగం, కచ్చితత్వం

అప్రెంటీస్‌ పరీక్ష సన్నద్ధత.. బ్యాంకులు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలకూ ఉపయోగం. అప్రెంటిస్‌షిప్‌ చేసినవారికి ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యం లభిస్తుంది.
ఏ బ్యాంకు సంబంధ పరీక్షల్లోనైనా వేగం, కచ్చితత్వం చాలా ముఖ్యం. నిర్ణీత సమయంలో అధిక ప్రశ్నలను సాధించడం అవసరం. అందుకే ప్రశ్నలను వేగంగా సాధించగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలి. ఇది సాధన వల్లనే సాధ్యమవుతుంది. వేగంతోపాటు కచ్చితత్వానికీ ప్రాధాన్యమివ్వటం అవసరం.నిరంతర సాధన వల్ల పెన్ను ఉపయోగించకుండా కొన్ని ప్రశ్నలకు జవాబులను సాధించే సామర్థ్యం అలవడుతుంది. అభ్యర్థులు ఆ నైపుణ్యాన్ని పొందడానికి కృషి చేస్తే ప్రయోజనకరం. వేగంగా ప్రశ్నలను సాధించే వివిధ పద్ధతులు సాధన వల్లనే గ్రహించగలుగుతాము. పరీక్షలో విజయ సాధనకు ఇవి చాలా కీలకం. వీటిని ఏ మేరకు అలవరచుకున్నారో అంచనా వేసుకోవాలంటే మోడల్‌ పేపర్లను సాధన చేయాలి. ఆ ప్రశ్నపత్రాలనూ అసలైన పరీక్ష రాసినట్లు నిర్దిష్ట  సమయంలో ఆన్‌లై  న్‌లో రాయాలి. పరీక్షకు కేటాయించిన నిర్ణీత సమయంలో 90% ప్రశ్నలను 95% కచ్చితత్వంతో సాధించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అభ్యాసంతో దీన్ని తప్పకుండా సాధించవచ్చు.శాశ్వత ఉద్యోగం కానప్పటికీ ఎస్‌బీఐ అప్రెంటిస్‌షిప్‌కు విలువ ఎక్కువే. మూడేళ్ల తరువాత ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అనుభవం బాగా ఉపయోగపడుతుంది. ఈ అప్రెంటిస్‌ పోస్టుల వల్ల ఎస్‌బీఐలోని క్లర్క్‌ లేదా పీఓ పోస్టుల్లో కానీ నోటిఫికేషన్లలో ఎలాంటి ప్రభావం ఉండదు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని