close

తాజా వార్తలు

Published : 24/11/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డ్రైవర్‌ సీట్లో... ఆశ!

ఎనిమిదో తరగతిలోనే పల్సర్‌ని అవలీలగా నడిపేసిన చల్లా ఆశ.. ఇప్పుడు బస్సుని కూడా అంతే సునాయాసంగా నడిపేసి వార్తల్లోకి ఎక్కింది.  త్వరలో ఆర్టీసీలో మొదటి మహిళా డ్రైవర్‌గా చేరే అవకాశాన్ని పొందింది.  శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఈ యువ ఇంజనీర్‌కి హెవీవెహికల్స్‌ అంటే  అమితమైన ఆసక్తి.  అదే.. మొదటిసారి ఆర్టీసీ స్టీరింగ్‌ పట్టిన అమ్మాయిగా  గుర్తింపు తెచ్చింది..

సైనికుడి కూతురిగా తండ్రి నుంచి ధైర్యాన్ని వారసత్వంగా అందుకున్న ఆశకు గుర్రపుస్వారీ వచ్చు. పల్సర్‌, బుల్లెట్‌ వంటి బైకుల్నీ తేలిగ్గా నడిపేస్తుంది. ఇవన్నీ ఏదో ఉద్యోగ అవసరం కోసం నేర్చుకున్నవి కావు. కేవలం హెవీవెహికల్స్‌పై ప్రేమతో నేర్చుకున్నవే అంటుంది ఆశ. సిక్కిం, అండమాన్‌, దిల్లీలలో ఏడో తరగతి వరకూ, 8-10 తరగతులు టెక్కలిలో చదువువుకున్న ఆశ.. ఇంటర్మీడియెట్‌ వైజాగ్‌లో చదివింది. టెక్కలిలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. వాహనాలని నడపాలన్న ఆసక్తి మాత్రం చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన సైకిల్‌ని నడపడంతోనే మొదలయ్యిందట. ‘నాన్న ఆర్మీలో పనిచేస్తూ.. కుటుంబానికి దూరంగా ఉండటంతో ఇంటి పనులన్నీ మేమే చేసుకునేవాళ్లం. అలా నాకు ఎనిమిదో తరగతిలో ఉండగానే పల్సర్‌ (150 సీసీ) నడపడం వచ్చేసింది. దాని మీద వెళ్లి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ని నడుపుతున్నా. బీటెక్‌లో ఉండగా నాన్న కారు కొనివ్వడంతో  డ్రైవింగ్‌ కూడా నేర్చుకున్నా’ అని చెప్పుకొచ్చింది ఆశ. 

ఒకే ఒక్క అమ్మాయి...  ఇటీవల ఏపీఎస్‌ఆర్టీసీ హెవీ వెహికిల్స్‌ శిక్షణ కోసం ఓ ప్రకటన ఇచ్చింది. ఆ శిక్షణ తీసుకున్న 19 మందిలో ఒకే ఒక్క అమ్మాయి ఆశ. ‘నా చిన్నప్పటి కల. ఇలాంటి భారీ వాహనాలు నడపాలని. ఆ కల నెరవేరడానికి ఈ శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది. శిక్షణలో భాగంగా వాహనాన్ని నడపడమే కాకుండా ఇతర విషయాలూ నేర్పారు. బస్సు మధ్యలో ఆగిపోతే అవసరమైన చిన్నచిన్న మరమత్తులు చేసుకోవడం వంటివి నేర్చుకున్నా. మా ఇన్‌స్ట్రక్టర్‌ వర్మ సార్‌ సొంత కూతురిలానే చూసుకునేవారు. నేను బస్సు నడపడం చూసిన చాలామంది అమ్మాయిలు ఆ వివరాలు అడుగుతున్నారు. వాళ్లకు నేనిలా స్ఫూర్తిగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఆర్మీలో టెక్నికల్‌ ఇంజినీర్‌ కావాలనేది నా కల’ అంటోంది ఆశ.

- వెలమల ఢిల్లేశ్వరరావు, జలుమూరు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని