close

తాజా వార్తలు

Published : 28/11/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ-వాహనం రూ.2లక్షలకే!

చిన్నచిన్న ఆవిష్కరణలు చేసి మమ అనిపించడం... సెల్ఫీలు తీసుకొని సర్దుకుపోవడం... అదీ కుదరకపోతే మార్కెట్లో ఏదో ప్రాజెక్ట్‌ వర్క్‌ కొనేయడం... చాలాసార్లు బీటెక్‌ కుర్రకారు పాటించే ట్రెండ్‌ ఇదే! పల్లవి ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు మాత్రం భిన్నంగా ఉండాలనుకున్నారు. కష్టపడ్డారు. సాధించారు. ఎలక్ట్రిక్‌ జీప్‌ తయారు చేశారు. ఈ మోడల్‌ని పెద్దఎత్తున తయారు చేస్తే అతి తక్కువ ధరకే బ్యాటరీ కారు అందుబాటులోకి వస్తుందంటున్నారు.
ప్రసాద్‌, హరీశ్‌కుమార్‌, ఫయాజ్‌, హుస్సేన్‌, ప్రీతి, కావ్య, శిరీష, పూజిత, అరుణ్‌కుమార్‌, సాయినాథ్‌, కృష్ణ.. హైదరాబాద్‌లోని పల్లవి ఇంజినీరింగ్‌ విద్యార్థులు. తమ ప్రాజెక్ట్‌వర్క్‌ అందరికన్నా భిన్నంగా ఉండాలని భావించారు. అదీ పర్యావరణానికి మేలు కలిగించేలా. బాగా ఆలోచించాక విద్యుత్తు బ్యాటరీతో నడిచే కారు తయారు చేయాలనుకున్నారు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా ముందుకెళ్లాలనుకున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని కలిస్తే వాళ్ల తపన చూసి రెండు లక్షల రూపాయలు అందజేశారు. పారమౌంట్‌ ఆటో బే సర్వీసెస్‌ నిర్వాహకురాలు విద్యా నంబిరాజన్‌ తమ గ్యారేజీని కార్యక్షేత్రంగా మలచుకోవడానికి అనుమతినివ్వడమే కాదు.. లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. మిగతా మొత్తం విద్యార్థులు భరించారు.
తయారైందిలా..
ఫ్యాకల్టీ అనిల్‌ సహకారంతో ఎలక్ట్రిక్‌ కారుకి పక్కా ప్రణాళిక సిద్ధమైంది. హ్యుందాయ్‌ ఇయాన్‌ కారు టైర్లు, మారుతీ వ్యాగన్‌ ఆర్‌ స్టీరింగ్‌, టాటా ఏస్‌ సస్పెన్షన్‌ సిస్టమ్‌ తీసుకున్నారు. బయటి నుంచి 3కేవీ మోటార్‌ తీసుకొచ్చారు. లిథియం-అయాన్‌ బ్యాటరీ వాడితే ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీని ఎంచుకున్నారు. ముందు ఈ-కారు అనుకున్నా మధ్యలో చేసిన మార్పులు, ల్యాడర్‌ టైపు ఛాసిస్‌ వాడటంతో ఈ-జీప్‌ తయారైంది. నమూనా వాహనమైనా నాణ్యతలో రాజీ పడలేదు. డ్రమ్‌ బ్రేకులు అమర్చి ఒక్కసారి బ్రేక్‌ వేయగానే ఆటోమేటిగ్గా మోటార్‌ కటాఫ్‌ అయిపోయేలా మలిచారు. బండికి అదనపు సపోర్ట్‌ కోసం టాటా ఏస్‌ రియర్‌ షాక్‌ అబ్జార్బర్లు అమర్చారు. ఇది ఆరుగంటల్లో పూర్తిగా ఛార్జింగ్‌ అవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 50 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. 30 కి.మీ.ల వేగంతో దూసుకెళ్తుంది. 4 సీట్ల సామర్థ్యం.
అవాంతరాలు అధిగమించి
ఆలోచన నుంచి ఆవిష్కరణ పూర్తయ్యే వరకూ యువబృందం అలుపెరుగక శ్రమించారు. మెకానికల్‌, ఈసీఈ విభాగాలకు చెందిన 23 మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. కొందరు మెకానికల్‌ విభాగం చూసుకుంటే.. మరికొందరు సెన్సర్లు రూపొందించడం, మోటార్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఆరునెలలు సరదాలు, షికార్లు... అన్నీ బంద్‌. ముందు విడిభాగాలు సేకరించడం మొదలుపెట్టారు. ఈలోపు కరోనాతో లాక్‌డౌన్‌ మొదలైంది. కొన్నాళ్లు విరామం ప్రకటించినా తమను తాము నిరూపించుకోవాలనే తపన కుదురుగా ఉండనీయలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్లీ రంగంలోకి దిగారు. ఒక రూపం వచ్చాక ట్రయల్స్‌కి వెళ్తే సస్పెన్షన్‌ విరిగిపోయింది. దాన్ని సవరించారు. బండి మరింత దృఢంగా ఉండేలా స్టీరింగ్‌, బాల్‌ జాయింట్స్‌, డిఫరెన్షియల్‌ తయారు చేశారు. అయినా ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతూనే ఉండేది. అన్నీ అధిగమించాక మొత్తానికి ఆరు నెలల కష్టం ఫలించి ఈ-జీప్‌ పరుగులు పెట్టింది. కొన్ని విద్యాసంస్థల నుంచి ఇలాంటి వాహనాలు కావాలంటూ ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు విద్యా నంబిరాజన్‌. ప్రాజెక్ట్‌ వర్క్‌ అయిపోగానే సెల్ఫీలు తీసుకోవడం, తర్వాత కొన్నాళ్లకు దాని గురించి మర్చిపోవడం అందరూ చేసేదే. కానీ మేం అలా కాదంటున్నారు. ఈ-జీప్‌ని పెద్దఎత్తున ఉత్పత్తి చేసి వాడకంలోకి తీసుకొస్తామంటున్నారు.
ఉపయోగాలు
* దీనికి రిజిస్ట్రేషన్‌, ప్రభుత్వ అనుమతులు అక్కర్లేదు.
* గేటెడ్‌ కమ్యూనిటీ, భారీ ప్రాంగణాలున్న విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఉపయోగం.
* పెద్దఎత్తున తయారు చేస్తే రూ.రెండు లక్షల లోపే జీప్‌ తయారవుతుంది.
* పర్యావరణహితం. ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. నిర్వహణ వ్యయమూ తక్కువే.

సరదాలన్నీ వదిలేశాం

ప్రాజెక్టు మొదలుపెట్టే సమయానికి మేం పెద్ద లక్ష్యం ఎంచుకున్నామని అర్థమైంది. ముందు నుంచీ ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఒక దశలో ప్రాజెక్టు వర్క్‌ పూర్తి చేయగలమా? అనే సందేహం ఎదురైంది. కానీ మమ్మల్ని మేం నిరూపించుకోవాలి అనే దృఢ సంకల్పంతో ముందుకెళ్లాం. సరదాలన్నీ మానుకున్నాం. కొన్నిసార్లు గ్యారేజీలోనే ఉండిపోయేవాళ్లం. చివరికి అనుకున్నది సాధించాం. మేం తయారు చేసిన ఈ-జీప్‌ గోకార్టింగ్‌, రన్‌వేలలో చూడగలుగుతాం. ఈ తరహా వాహనాలు పెద్దఎత్తున వాడకంలోకి వస్తే పర్యావరణానికి ఎంతో మేలు. కాలుష్యం తగ్గుతుంది.

- గాయత్రి అనుపోజు, టీం లీడర్‌


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని