close

తాజా వార్తలు

Published : 29/11/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

...నగరాన్ని దిద్దుదామని!

ఏంటో... ఈ నగర జీవనం...
అడుగు తీసి అడుగు వేద్దామంటే
ట్రాఫిక్‌ నరకం...
అంతా అడ్డదిడ్డం..అర్థంకాని దూకుడు..
నడిపే వాళ్లకు కనీస క్రమశిక్షణ ఉండదు..
ఎవరో వేగానికి మనకు గాయాలవుతాయి.
మరెవరో తప్పిదానికి ఇంకెవరికో శిక్ష
పడుతుంది.
ఏం చేస్తాం, మన సమాజం ఇంతే...
అని నిట్టూరుస్తాం...
మొదట్లో ఆమె కూడా ఇలాగే బాధపడింది. ఎవరో ఒకరు వచ్చి మార్చితే బాగుండని అనుకుంది.
అంతలోనే... ఆ ఒక్కరు నేనే ఎందుకు కాకూడదు అనుకుంది..
చేసే పని చిన్నదా, పెద్దదా కాదు... ఎంత మందికి ఉపయోగపడుతుంది.
ఎందరిలో మార్పుతెస్తుందన్నదే ఆమె ఫిలాసఫీ...
అందుకే చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదులుకుని మరీ ఈ సేవలో భాగమయ్యింది...

విజయవాడకు చెందిన కొల్లా జయశ్రీ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బోధనారంగంలో పాతికేళ్ల అనుభవం ఆమెది. ఐదంకెల జీతం.. సౌకర్యవంతమైన జీవితం ఉన్నా.. ఇంకా ఏదో చేయాలన్న తపన ఆమెని నిలవనీయలేదు. ముఖ్యంగా.. ఘోరమైన రోడ్డు ప్రమాదాలు ఆమెను కలచివేశాయి. బయటకు వెళ్లినవాళ్లు... ఇంటికి క్షేమంగా తిరిగొచ్చేంతవరకు వాళ్లకోసం ఆతృతగా ఎదురుచూసే ఇల్లాలు ఎన్నిసార్లు ఇంట్లోకి, గుమ్మంలోకి తిరుగుతుందో అనే భావనే ఆమెని మరో అడుగు ముందుకు వేసేలా చేసింది. 22 సంవత్సరాల నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల్లో వలంటీరుగా చేస్తూ, సేవలందించిన జయశ్రీ రెండేళ్ల క్రితం విజయవాడలో ‘జయహో సర్వీస్‌ అండ్‌ ట్రాఫిక్‌ ఆర్గనైజేషన్‌’ స్థాపించారు. ఉద్యోగానికి వలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని ఈ సేవా కార్యక్రమాలపై దృష్టి సారించింది.
అసలేం జరిగిందంటే.....  
పద్మవ్మూహాన్ని తలపించే కూడళ్లు, రెడ్‌సిగ్నల్‌ పడినా ఆగని వాహనాలు... వన్‌వేలోనూ ఎదురొచ్చే బండ్లు, గుంతలు పడిన రోడ్లు.. ఇవన్నీ మనకు నగర వీధుల్లో నిత్యం ఎదురయ్యే సంఘటనలు. వీటితోపాటూ స్పీడ్‌ బ్రేకర్లు కంటికి కనిపించకపోవడం వల్ల కూడా చాలామంది ప్రమాదాలని ఎదుర్కొంటున్నారు. జయశ్రీ సైతం ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. ఆ సంఘటనే ‘జయహో సర్వీసెస్‌ అండ్‌ ట్రాఫిక్‌ ఆర్గనైజేషన్‌’ స్థాపించడానికి కారణమైంది. తనతోపాటూ సామాజిక బాధ్యత ఉన్న మరో వందమందిని ఈ సంస్థలో సభ్యులుగా చేర్చుకున్నారామె. వీళ్లంతా కలిసి నగరంలోని ప్రధాన వీధులు, కూడళ్లలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్లను గుర్తించి.. వాటికి రంగులు వేయడం ప్రారంభించారు. రెండేళ్లలో 300 స్పీడ్‌ బ్రేకర్లకి రంగులు వేశారు. దాంతో వాహనదారులు వాటిని గుర్తించి ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు.
ఏం చేస్తారంటే....  
సాయంత్రం ఐదున్నర గంటలు.. ఉద్యోగ నిమిత్తం విజయవాడకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమవుతున్న వాహనాలతో రద్దీగా ఉంది. ఈ సమయంలో ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. ఒక్కసారిగా పది మంది సభ్యులు అక్కడాగిన వాహనాల దగ్గరకు వచ్చారు. రహదారి భద్రత నియమాలు పాటిస్తున్న వారికి చిన్నచిన్న బహుమతులు, పండ్లు ఇచ్చి అభినందించడంతోపాటు.. పాటించని వారికి సలహాలు, సూచనలు ఇస్తుంటారు ఈ జయహో స్వచ్ఛంద సంస్థ సభ్యులు.
ఆ విషాదం ఎదురుకాకుడదనే...
చాలామంది ఇళ్లలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. దీనిపై వాహనదారులను చైతన్యవంతులను చేయడానికి జయశ్రీ స్టిక్కరింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘మీ కోసం ఇంటి దగ్గర మీ కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నారు’ అనే స్టిక్కర్లను ముద్రించి బైకులపై అతికిస్తున్నారు. రోజుకో కూడలిలో జయహో సభ్యులు చేరుకుంటారు. రెడ్‌సిగ్నల్‌ పడగానే ఆగిన వాహనాలకు ఈ స్టిక్కర్లను అతికిస్తున్నారు. దీంతో పాటూ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్‌ నియమ నిబంధనలను వివరిస్తారు. తనకు పెన్షన్‌గా అందుతున్న డబ్బును ఇలాంటి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు జయశ్రీ. తల్లి చేస్తున్న సేవాకార్యక్రమాలకు అమెరికాలో ఉన్న ఆమె కూతురు కీర్తి కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలు చేయడానికీ ఉత్సాహం చూపిస్తున్నారు.

- అల్లం శివరామకృష్ణ, విజయవాడTags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని