close

తాజా వార్తలు

Published : 04/12/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అయినవారు పొమ్మన్నా... అందరి బంధువైంది!

రద్దీగా ఉండే ఓ బస్టాండు..
సమీపంలో చిరిగిన దుస్తులతో స్పృహ లేని స్థితిలో ఓ వ్యక్తి...
ఓ రైల్వేస్టేషన్‌ సమీపంలో బురద మధ్య ఒళ్లంతా గాయాలతో కదల్లేని స్థితిలో ఒక వృద్ధుడు... మరో చోట మానసిక స్థితి సరిగ్గాలేని దివ్యాంగురాలు...  ఆ పక్క నుంచి నడిచివెళ్లేవారే తప్ప ఏ ఒక్కరూ ఆ వైపు అడుగులేయలేదు. అయితే 24 ఏళ్ల మనీషా మాత్రం అక్కడికెళు తుంది. దిక్కులేకుండా పడి ఉన్న ఆ అనాథలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. వారికి ఆహారాన్ని అందించి పునరావాసకేంద్రానికి తరలిస్తుంది. ఇందుకోసం ఓ ఎన్జీవోనూ స్థాపించింది. దీనికోసం ఆమె అయిన వారందరినీ వదులుకోవాల్సి వచ్చింది..

మిళనాడులోని ఈరోడ్‌ దగ్గర.. మాకో మాంసం దుకాణం ఉండేది. మూడో తరగతి నుంచే ఆ దుకాణానికి వెళ్లి నాన్నకు సాయం చేసేదాన్ని. ‘అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తారా’ అంటూ అందరూ వెక్కిరించేవారు. నాన్న మాత్రం పని నేర్చుకోవడంలో తప్పు లేదని వెనకేసుకుని వచ్చేవాడు.   స్కూల్లో చదివేటప్పుడు రోడ్డుపక్కన ఎవరైనా ఆకలితో అల్లాడితే వాళ్లకి తినడానికి ఏదైనా ఇచ్చేదాన్ని. క్రమంగా అదో అలవాటుగా మారిపోయింది. ఈ సాయం చేసే గుణమే నన్ను నర్సింగ్‌ కోర్సులో చేరేలా చేసింది. ఆ కోర్సు చేస్తూనే అనాథ, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సాయం చేసేదాన్ని.  ప్రభుత్వాసుపత్రిలోని ఇన్‌ఫెక్షన్‌ వార్డు మురికిగా, దుర్వాసనతో ఉండేది. అటువంటి చోటుకు ఎవరూ వెళ్లరు. నర్సింగ్‌ చేసేటప్పుడు సెలవురోజుల్లో వెళ్లి అక్కడి రోగులకు సేవలందించేదాన్ని. అప్పుడు వారి కళ్లలో సంతోషం కనిపించేది. ఒంటరిగా ఉంటూ అనారోగ్యంతో బాధపడే వారికి నా సాయం ఉపశమనంగా ఉండేది. అప్పుడే అనుకున్నా. ఇటువంటివారికే సేవలు అందించాలని.
రోడ్లపై అనాథలుగా ఉండేవారికి ఆహారం ఇచ్చేదాన్ని. ఒకరోజు కనిపించినవాళ్లు... మరుసటి రోజు కనిపించేవారు కాదు. అందుకే వాళ్లకి ఆహారం మాత్రమే కాదు.. తగిన నీడనూ కల్పించాలనుకున్నా. దాంతో కొన్ని ఎన్జీవోలతో మాట్లాడి.. ఒంటరి మహిళలు, చిన్నారులు కనిపిస్తే వారిని ఆయా ఎన్జీవోలకు చేర్చడం మొదలుపెట్టాను. ఇంతలో అపోలో ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూనే, ఎన్జీవో పనులు కూడా చేసేదాన్ని. ఉద్యోగానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేసరికి ఆ పని మానేసి నంద కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో అధ్యాపకురాలిగా చేరా. కాస్త సమయం దొరికింది. అప్పుడే నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ‘జీవితం ఫౌండేషన్‌’ను స్థాపించాను. అనాథలు.. ఒంటరి వాళ్లకు నీడనివ్వడం మొదలుపెట్టాను.

చాలా చోట్ల మానసికరోగులు కనిపించేవాళ్లు. వీళ్లని మామూలు మనుషులుగా చేయడం అంతతేలికైన పనికాదు. చేతిలో కర్రో, రాళ్లో పెట్టుకుని దగ్గరకు రానిచ్చేవారు కాదు.  అలాంటి వాళ్లని జాగ్రత్తగా గమనించి.. నెమ్మదిగా స్నేహం చేసేదాన్ని. చాలామంది దగ్గరకు రానివ్వరు. కానీ సహనంతో చేరువయ్యేదాన్ని. పెరిగిన జుట్టును కత్తిరించి, స్నానం చేయించి మంచి దుస్తులు వేసేదాన్ని. గాయాలకు మందు వేసి, తిండి పెట్టేదాన్ని. వాళ్లని ఒప్పించి పునరావాసకేంద్రానికి తరలించి నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పించేదాన్ని. నయమయ్యాక కుటుంబసభ్యుల వద్దకు చేరుస్తాను. లేదంటే చిన్నచిన్న ఉద్యోగాలు చూసేదాన్ని.
కానీ ఈ పనులన్నీ మా ఇంట్లో వాళ్లకి నచ్చలేదు. ‘మా పరువు తీస్తున్నావంటూ’ అమ్మానాన్న కోప్పడ్డారు. నేను వినలేదు. బంధువుల వద్ద మర్యాద పోతోందంటూ నన్ను బయటికి వెళ్లిపొమ్మన్నారు. మూడున్నరేళ్ల క్రితం మొదలుపెట్టిన మా ఫౌండేషన్‌లో ప్రస్తుతం రెండువందలమందికి పైగా కార్యకర్తలున్నారు. దాదాపు 500మందికి నీడ కల్పించా. మా ఎన్జీవో అందిస్తున్న సేవలను గుర్తించిన చాలామంది ఆన్‌లైన్‌లో మాకు ఆర్థిక చేయూతనందించేవారు. ఇంకా కాలేజీలు తెరవకపోవడంతో ప్రస్తుతం నా అవసరాలకు మాంసం దుకాణంలో పనిచేస్తున్నా. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మా సేవలను విస్తరించాలని ఉంది.Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని