close

తాజా వార్తలు

Published : 23/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ రంగులు మాసిపోవు!

అదెట్టా!

వస్తువు రంగైనా కాలం గడిచేకొద్దీ మాసిపోతుంటుంది. వేడి, తేమ, రేడియేషన్‌ వంటివన్నీ రంగులు వెలసిపోయేలా చేస్తుంటాయి. మరి ఇవి ఎప్పటికీ మాసిపోకుండా అలాగే ఉండిపోతే..! అదెలా సాధ్యమనేగా మీ సందేహం. దీనికి సమాధానం మన ప్రకృతే. నెమలి ఈకలు, సీతాకోక చిలుకల రెక్కల రంగులనే తీసుకోండి. ఇవి ఎప్పటికీ వెలసిపోవు. నిజానికి నెమలి ఈకలు గోధుమరంగులో ఉంటాయి. కానీ అతి సూక్ష్మమైన ఆకృతుల కారణంగా నీలం, పచ్చ వంటి రంగులనూ ప్రతిఫలింపజేస్తాయి. ఆయా కోణాల్లో చూసినప్పుడు రంగుల తీరూ మారిపోతుంటుంది. ఇలాంటి రంగులను ఆకృతిక (స్ట్రక్చరల్‌) రంగులు అంటారు. వీటి స్ఫూర్తితోనే సెంటర్‌ ఫర్‌ నానో అండ్‌ సాఫ్ట్‌ మ్యాటర్‌ సైన్సెస్‌ (సీఈఎన్‌ఎస్‌) పరిశోధకులు కృత్రిమ ఆకృతిక రంగులను సృష్టించారు. పలుచని టైటానియం పలకలను ఆయా కోణాల్లో తిప్పుతూ.. వాటిపై టైటానియం డయాక్సైడ్‌ (టిఓ2) పొరలను, నానోరాడ్లను పరచటం ద్వారా దీన్ని సాధించారు. ఈ రంగులను ఒక్క టైటానియం మీదే కాదు.. అల్యూమినియం, నికెల్‌, కోబాల్ట్‌, రాగి వంటి వాటి పైనా వేయొచ్చు. ఇవి రంగుల తయారీలో వాడే వర్ణద్రవ్యాల మాదిరిగా హాని చేయవు. సాధారణంగా ఆకృతిక రంగులు స్థిరంగా ఉంటాయి. వెలసిపోవు. కానీ కాలం గడుస్తున్నకొద్దీ కాలుష్య కారకాలు వీటిపై పోగుబడి రంగు మాసిపోయేలా చేస్తాయి. తరచూ వీటిని శుభ్రం చేయటం పెద్ద సమస్య. శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమ ఆకృతిక రంగులతో ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఎందుకంటే నీరు, తేమ వంటివి అంటుకోని విధంగా, తమకు తామే శుభ్రం చేసుకునేలా కూడా వీటిని తీర్చిదిద్దారు మరి. అంతేకాదు, ఆప్టికల్‌ రంగంలో సమాచార మార్పిడికీ వీటిని వినియోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని