
తాజా వార్తలు
అనాథల ఇంటికే క్యారియర్లు...
అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు... దమయంతి అలా కాదు... అడగకుండానే ఎక్కడెక్కడో ఉన్న వృద్ధ అనాథలకు ఇంటికే భోజనం పంపిస్తోంది ముంబయికి చెందిన దమయంతి.ఐదేళ్లుగా ‘శ్రీ నిమేష్ తన్న ఛారిటబుల్ ట్రస్ట్’ని నడుపుతోంది దమయంతి. ఆరేళ్ల క్రితం ఓ రైలు ప్రమాదంలో తన బిడ్డను కోల్పోయింది. దాంతో తనకంటూ జీవితం ఉందని ఆమె అనుకోలేదు. ఆ సమయంలోనే దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిందామె. ఎక్కడికెళ్లినా బిడ్డ ఆలోచనలే వెంటాడేవి. అనాథలకు భోజనం పెట్టడం అంటే తన బిడ్డకి చాలా ఇష్టం. అతని ఇష్టంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంది దమయంతి. అలా ఐదేళ్ల క్రితం స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాథలు, పేదలైన వృద్ధులకోసం ఉచితంగా ఆహారం ఇస్తామని కరపత్రాలు ముద్రించింది. ‘ముదిమి వయసులో కాలుకదపలేని వృద్ధులు నా దగ్గరకు రావాల్సిన శ్రమ లేకుండా వారి దగ్గరకే టిఫిన్ బాక్సులు పంపిస్తున్నా. రోజూ ఉదయం పదకొండు గంటకల్లా దాదాపు 150 మంది వృద్ధులకు వేడి వేడి అన్నం వారి ఇళ్లకే వెళ్లిపోతుంది’ అంటారు దమయంతి. ‘దహను’ అనే ప్రాంతంలోని ఆరు బాల్వాడీ (అంగన్వాడీ లాంటి)లను దత్తత తీసుకుని అందులోని ఆదివాసీ చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూరుస్తోంది. ఇలా చిన్నారుల కళ్లలో కనిపించిన ఆనందంలో తన కొడుకుని వెతుక్కుంటోందామె.