close

తాజా వార్తలు

Updated : 09/01/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పుడర్థం కాలేదు..

చాలా ఏళ్ల తర్వాత ఆమె ఊరొచ్చిందట. ఇప్పుడెలా ఉందో? నన్ను చూడగానే ఎలా రియాక్ట్‌ అవుతుందో? రెట్టింపు వేగంతో జ్ఞాపకాలు నన్ను పన్నెండేళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. ఫొటోషాప్‌ నేర్చుకోడానికి వెళ్లినప్పుడు మొదటిసారి నా మనసు తట్టింది. చూడగానే ‘ఎంత బాగుందీ’ అనిపించేంత అందం. నా అదృష్టం కొద్దీ ఆమె మా కోర్సు ఇన్‌స్ట్రక్టర్‌. పక్కన కూర్చొని పాఠాలు చెబుతుంటే కడియపుసావరం మెరకచేలో విరిసిన మల్లెపువ్వు పరిమళాలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. కొద్దిరోజుల్లోనే మా మధ్య చనువు పెరిగింది. ఈ కొత్త అనుభూతి నన్నో వింత లోకంలో విహరింపజేసేది. ‘ఏదో చూద్దాంలే’ అనుకున్నవాణ్ని, ఆమె కోసమే రోజూ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లేవాణ్ని. కోర్సు ముగిసేసరికి ఎలాగైనా నా మనసులో మాట చెబుదామనుకున్నా.
ఓరోజు చర్చికి తీసుకెళ్లింది. ప్రార్థన అయ్యాక ‘రండి.. అలా వెళ్లొద్దాం’ అంటూ కోటిలింగాల రేవు దగ్గరకు తీసుకెళ్లింది. ఒకరి కళ్లలోకి ఒకరం చూస్తూ కూర్చున్నాం.  మెల్లిగా నోరు విప్పింది. ‘భీమవరం దగ్గర వీరవాసరం మా సొంతూరు. మొదట్లో స్థితిమంతులమే. పెద్దోళ్లు పాడు చేయడంతో ఇప్పుడేం మిగల్లేదు. నాన్న రాజమండ్రిలో ఓ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌. నాకో చెల్లి.  ఉంది. తనకి గుండె జబ్బు. వైద్యానికి చాలా ఖర్చవుతోంది’ చెబుతూ ఆగింది.. నా మనసును చదువుతున్నట్టు. ఆప్తుడు, చేయి అందుకోబోయేవాడితో తప్ప ఒకమ్మాయి ఇలాంటి విషయాలు పంచుకోదు. ఆ ఆలోచన రాగానే మనసు సంతోషంతో గంతులేసింది. కానీ కాసేపయ్యాక అసలు బాంబు పేల్చింది. ‘ఏడాదిన్నర కిందటే నాకు పెళ్లైంది. భర్త అర్థం చేసుకోడు. దాంతో మా కాపురం వరద గోదారిలో చిల్లు పడ్డ నావలా అయింది. ఆరు నెలలకే పుట్టింటికొచ్చి ఇలా చిన్న ఉద్యోగం చేస్తున్నాను’ అంది. నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉండే తన గుండెలో ఇంత బాధ ఉందనుకోలేదు. చివరగా.. ‘ఇవన్నీ మీకెందుకు చెబుతున్నానంటే మీరంటే నాకిష్టం. కానీ రాత్రి నా భర్త వచ్చాడు. క్షమించమన్నాడు. చెల్లి ఆపరేషన్‌కి డబ్బులు సర్దుతానన్నాడు.. సింగపూర్‌ వెళ్తున్నాడంట.. తనతో పాటు రమ్మన్నాడు’ అంది. నా మాటే కాదు.. మనసూ మూగబోయింది. గోదారి మీద నుంచి గాలి వీస్తున్న చప్పుడు. రావిచెట్టు నుంచి ఆకులు రాలినప్పుడల్లా గలగలా శబ్దం.. ‘వెళ్లాలంటావా?’ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగిందామె. కళ్లల్లోంచి రెండు చుక్కలు బొటబొటా రాలాయి. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. నేనేం సమాధానం చెప్పలేదు. తనూ మళ్లీ అడగనూ లేదు. తను అడిగింది అభిప్రాయమా? కోరింది అనుమతా? అప్పుడు అర్థం కాలేదు.  ఇప్పుడు అర్ధమైనా ఉపయోగం లేదు. ఊరెళ్లాక తనెలా స్పందిస్తుందో!

- వికాస్‌ (పేరు మార్చాం)Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని